రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం, స్థానిక పార్టీల నాటకాలు..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నాం.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, స్థానిక పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. సముద్రంలో వృథాగా కలిసి పోయే నీటి శాతం లెక్కలతో సహా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దగ్గర ఉన్నాయని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రిజర్వాయర్, ప్రతి చెరువు నింపడమే సీఎం చంద్రబాబు ముఖ్య ధ్యేయం అని మంత్రి జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లే అలగనూరు రిజర్వాయర్ మరుగున పడింది అని మంత్రి జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో అలగనూరు రిజర్వాయర్ పనులకు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తే సరిపోయేది, తాజా అంచనాల ప్రకారం 100 కోట్ల రూపాయల వరకు అయిన సరిపోనీ పరిస్థితి ఏర్పడింది అని మంత్రి తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ బీసీల చేతుల్లోనే ఉన్నాయి..
తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్య ప్రసాద్, సవిత, సత్య కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు. ఇక, మంత్రి అనగాని సత్య ప్రసాద్ బీసీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాల్లో బీసీలకు అగ్ర పీఠ వేస్తుంది.. కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ బీసీ నేతల చేతుల్లోనే ఉన్నాయి.. కేంద్రం కుల గణన ప్రారంభించిందంటే అందుకు కారణం చంద్రబాబు.. కుల గణన ద్వారా బీసీలకు ఎంత మేలు జరుగుతుందో తెలుస్తుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది..
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది.. అమరావతిలో చంద్రబాబు సీన్ రివర్స్ అయింది.. మరో 40 వేల ఎకరాలు కావాలని చంద్రబాబు అడగడంతో అక్కడ రైతులు ఎదురు తిరుగుతున్నారు.. మా భూములు ఇచ్చేది లేదంటున్నారు.. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనకు చేస్తూనే ఉన్నారు.. మామిడి రైతులు నిండా మునిగారని మాజీమంత్రి కారుమూరి పేర్కొన్నారు. ఇక, ప్రశ్నిస్తా అన్న వ్యక్తి అడ్రస్ లేడు మాజీమంత్రి కారుమూరి అన్నారు. రెండునెలలు అయిన ధాన్యం డబ్బులు రైతులకు ఇవ్వడం లేదు.. రైతుని పట్టించుకునే దిక్కులేదు.. సీజ్ ది షిప్ అన్న వ్యక్తి అమెరికాలో వెళ్ళి కూర్చున్నాడు.. పనికి ఆహారం పథకంలో సైతం దోపిడీకి పాల్పడుతున్నారు.. 2027అక్టోబర్- నవంబర్ నాటికి ఎన్నికలు వస్తాయన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్‌ను రహస్యంగా కలిసిన కేటీఆర్.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. కేటీఆర్.. ఇటీవల పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేతల్ని కలిశారని పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాము బనకచర్ల కోసం కోట్లాడుతుంటే.. కేటీఆర్ నారా లోకేష్‌తో రహస్య మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్.. నారా లోకేష్‌ను రెండు సార్లు కలిశారని ఆరోపించారు.. ఎందుకు కలిశావు చెప్పు కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. లోకేష్ తో సీక్రెట్ మీటింగ్ ఎందుకు..? అని నిలదీశారు. కేటీఆర్ స్పందించాలని.. తప్పు అని బుకాయిస్తే వివరాలు అన్నీ బయటా పెడతానన్నారు.
ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్ అరెస్ట్.. రూ.792 కోట్లకు టోకరా..
ఫాల్కన్ గ్రూప్ సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు.. ఆర్యన్ సింగ్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ పెంపెనీ 7056 డిపాజిట్దారుల నుంచి రూ. 4215 కోట్లు వసూలు చేసింది. డిపాజిట్దారులకు రూ. 792 కోట్ల మోసానికి పాల్పడింది. చిన్న మొత్తంలో పెట్టుబడులకు భారీ లాభం అంటూ మోసం చేసింది. కాగా.. అమర్‌దీప్ కుమార్, ఆర్యన్‌సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెల, కావ్యనల్లూరి తదితరులంతా కలిసి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్, కావ్య నల్లూరి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకు అనుబంధంగా ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్నింటిని ఏర్పాటు చేశారు. కంపెనీల నిధుల సమీకరణలో భాగంగా ఉపయోగించే ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్‌ను తెరపైకి తెచ్చి జనాన్ని వంచించారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..
వందే భారత్ రైలు ప్రవేశపెట్టినప్పట్నుంచి ఆవులు, ఎద్దులను ఢీకొంటున్న సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే సంఘటన రిపీట్ అయింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మహబూబబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్ లో 428/11 వద్ద మధ్యాహ్నం ఎద్దును ఢీ కొట్టింది. ఎద్దును ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం ఊడిపడింది. దీంతో ఆ రైలు కొన్ని నిమిషాల పాటు నిలిచింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎద్దును ట్రాక్‌పై నుంచి తొలగించారు. రైలు ఇంజన్ ముందు భాగం(క్యాటిల్ గాడ్) విరిగినట్లు గుర్తించారు. ఇలా వందే భారత్ రైలు, ఆవును ఢీకొట్టడం అన్నది ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు అడ్డుగా జంతువులు రావడం, వాటిని తప్పించేందుకు అవకాశం లేని పరిస్ధితుల్లో గుద్దేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు ఆవుల్ని, గేదెల్ని గుద్దేసి డ్యామేజ్ అవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాయి.
బ్రిక్స్ సమ్మిట్కు హాజరైన ప్రధాని మోడీ.. అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు
బ్రెజిల్ అధ్యక్షతన రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమావేశాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. కాగా, ఈ బ్రిక్స్ సమావేశాల్లో ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, రిఫార్మ్స్ పై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే, అంతర్జాతీయ సవాళ్లకు, పరిష్కారాలపై కూడా ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. కాగా, వచ్చే ఏడాది బ్రిక్స్‌కు భారత దేశం అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఈ సమ్మిట్‌కు ప్రాధాన్యత చోటు చేసుకుంది. అయితే, భారత్‌ను కీలక భాగస్వామిగా అంతర్జాతీయ సముదాయం గుర్తిస్తుంది. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. భవిష్యత్ లో అంతర్జాతీయ వ్యవస్థల్లో భారత పాత్రపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు ప్రత్యామ్నాయ మోడల్‌గా భారత్ అభిప్రాయాలు వెల్లడించనుంది.
మేము హిందీకి వ్యతిరేకం కాదు.. స్టాలిన్ వైఖరికి దూరంగా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ..
బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తర్వాత, ఠాక్రే సోదరులు శనివారం ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. ఇకపై తామిద్దరం కలిసి ఉంటామని చెప్పారు. అయితే, ఈ భాషా ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిలిచారు. ఠాక్రేలు కలిపోవడాన్ని స్వాగతించారు. భాషా ఉద్యమం తమిళనాడు సరిహద్దును దాటి మహారాష్ట్రకు చేరిందంటూ వ్యాఖ్యానించారు. అయితే, స్టాలిన్ వైఖరికి ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దూరంగా ఉంది. “హిందీ విధించడాన్ని వ్యతిరేకించే వారి వైఖరి అంటే వారు హిందీ మాట్లాడరు మరియు ఎవరినీ హిందీ మాట్లాడనివ్వరు. కానీ మహారాష్ట్రలో అది మా వైఖరి కాదు. మేము హిందీ మాట్లాడుతాము… ప్రాథమిక పాఠశాలల్లో హిందీ కోసం కఠినతను సహించబోమని మా వైఖరి. మా పోరాటం దీనికి మాత్రమే పరిమితం,” అని ఉద్ధవ్ ఠాక్రే ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ‘‘మాకు ఇక్కడ హిందీ సినిమాలు, హిందీ థియేటర్లు, హిందీ మ్యూజిక్ ఉన్నందున మేము ఎవరినీ హిందీలో మాట్లాడకుండా ఆపలేము. మా పోరాటం ప్రాథమిక విద్యలో హిందీ విధించడానికి మాత్రమే వ్యతిరేకం’’ అని ఆయన రౌత్ స్పష్టం చేశారు.
ఎలా చైనా జనరల్ ఆహ్వానం, దలైలామా భారత్ పారిపోయి వచ్చేలా చేసింది..?
టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం ఇప్పుడు భారత్-చైనాల మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా వారసుడు చైనా సార్వభౌమాధికారానికి చట్టానికి లోబడి ఉండాలని ఆ దేశం చెప్పింది. అయితే, దలైలామా వారసుడుని ఆయన మాత్రమే నిర్ణయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ విషయంపై చైనా స్పందిస్తూ, దలైలామా వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. ఇదిలా ఉంటే, 6 దశాబ్ధాల క్రితం చైనా నుంచి దలైలామా ఎలా పారిపోయి వచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 23 ఏళ్ల సన్యాసి తన రాజభవనం నుంచి నిశ్శబ్ధంగా సరిహద్దులు దాటి, తన అనుచర గణంతో భారత్ చేరారు. అప్పటి నుంచి భారత్‌లోనే 14వ దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. ఇలా ఆశ్రయం కల్పించడం కూడా భారత్-చైనాల మధ్య వివాదానికి కారణమైంది. దలైలామా తప్పించుకోవడానికి కీలక కారణం, ఓ చైనీస్ జనరల్ ఆయనను ఆహ్వానించడమే. నిజానికి 1950లో టిబెట్‌ని చైనా ఆక్రమించిన తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), టిబెటన్ ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1951లో టిబెట్-చైనా మధ్య 17 పాయింట్ ఒప్పందం జరిగింది. చైనా సార్వభౌమాధికారం కింద టిబెట్‌కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, చైనా దీనిని ఉల్లంఘిస్తూ వచ్చింది.
వారణాసిలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్..?
పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రకరకాల రూమర్లు వస్తున్నాయి. కొందరేమో ఏపీలో నిర్వహిస్తారని చెబుతుంటే.. ఇంకొందరు హైదరాబాద్ లో ఉంటుందని అంటున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈవెంట్ ను వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. నార్త్ ఇండియాలో మూవీకి బజ్ క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంట. హిందువులపై జరిగే దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడే యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మూవీని యూపీలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారంట. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చీఫ్ గెస్ట్ గా వస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జులై 17న వారణాసిలో ఒక ఈవెంట్ ను నిర్వహించిన తర్వాత.. జులై 19న తిరుపతిలో నిర్వహించే రెండో ఈవెంట్ కు సీఎం చంద్రబాబు నాయుడు వస్తారని తెలుస్తోంది. యూపీలో జరిగే ఈవెంట్ కు యూపీ సీఎంతో పాటు భోజ్ పురి మంత్రులు వస్తారంట. తిరుపతి ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కనీ వినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారంట. ఈ రెండు ఈవెంట్లతో అటు నార్త్ ఇండియాను, ఇటు సౌత్ ఇండియాను కవర్ చేయబోతున్నారంట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వెంకీ సరసన ఆ క్రేజీ బ్యూటీ..?
విక్టరీ వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ హిట్ అయింది. దీని తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారంట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎన్టీర్ తో చేసే సినిమా కంటే ముందే వెంకీ మూవీని కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారంట. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఓ ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో చూసుకుంటే త్రిష, రుక్మిణీ వసంత్, నిధి అగర్వాల్ పేర్లు ఉన్నాయి. త్రిష, వెంకీ ఇప్పటికే కలిసి సినిమాలు చేశారు. కాబట్టి త్రిషను తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పుడు రుక్మిణీ వసంత్ పేరు ట్రెండింగ్ లో ఉంది. కానీ వెంకీ సరసన ఆమె కంటే నిధి అగర్వాల్ సెట్ అవుతుందని భావిస్తున్నారంట. పైగా హరిహర వీరమల్లు మూవీకి త్రివిక్రమ్ కొంత హెల్ప్ చేశారు. ఆ టైమ్ లోనే నిధితో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందంట. నిధి అగర్వాల్ ఈ సినిమాలో పాత్రకు సెట్ అవుతుందని గురూజీ భావిస్తున్నారంట. అన్నీ కుదిరితే త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. అది పెద్ద హిట్ అయితే నిధికి అవకాశాలు పెరగడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్.