ఏపీలో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు..
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టులకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఉదయం 8:30 నుంచి 9:30 వరకూ పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. అలాగే, 15 నిముషాల అదనపు అవకాశంతో 9:45 వరకూ పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు అని అధికారులు తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో పద మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుగు అర్హత సాధించే పరీక్ష ఉండనుంది. మొత్తం అభ్యర్ధులు 4,496 మంది ఉండగా, విశాఖపట్నంలో 1190 మంది, విజయవాడలో 1801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇక, విశాఖలో 2, విజయవాడలో 6, తిరుతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు తిరుమల కొండకు. వీకెండ్ కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు తరలి రావడంతో ఐదు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే, నిన్న శ్రీవారిని 74, 344 మంది భక్తులు దర్శించుకోగా.. 32, 169 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి హుండీ ఆదాయం 2.5 కోట్ల రూపాయలు వచ్చింది. మరోవైపు, ఆటోవాలాలు, జీపులు, సెక్యూరిటీలకు శ్రీవారి మెట్టు టైమ్ స్లాట్ టోకెన్లు కౌంటర్ వరంగా మారింది. టైమ్ స్లాట్ టిక్కెట్లు తీయిస్తామంటూ భక్తులను శ్రీవారి మెట్టుకు తరలిస్తున్నారు. దీంతో ఆటోలు, జీపులతో శ్రీవారి మెట్టు మార్గం కిక్కిరిసిపోవడంతో వారిమెట్టు మార్గంలో మళ్లీ ట్రాఫిక్ జామ్ అయింది. ఆటోలతో శ్రీనివాస మంగాపురం గ్రామం నిండిపోయింది. ఉదయం 6 గంటలకు గేట్లు తెరుస్తారనగా అర్థరాత్రి 12 గంటల నుంచి ఆటోలు బారులు తీరుతున్నారు. తిరుమలకు చేరుకోకుండానే భక్తులను ఆటో, జీపు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది నిలువు దోపిడి చేస్తున్నారు.
బరితెగించిన కామాంధులు.. భర్త కళ్లెదుటే..
కామాంధులు, పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. బరితెగించిన కామాంధులు భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడ్డారు. భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి బేగంపేటలోని ఓ పబ్‌కెళ్లి ఇంటికి రాత్రి11:30కి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై ముగ్గురు యువకులు దాడి చేశారు. వివాహితను వెంబడించారు. వారి నుంచి తప్పించుకుని డయల్ 100కి ఫోన్ చేశారు బాధితులు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు ఆకతాయిలను అరెస్టు చేశారు. పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గోవాలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. 50 మందికి గాయాలు
గోవాలోని షిర్గావ్ శ్రీ లైరాయ్ జాతరలో తొక్కిసలాటు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో వారిని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో జరిగే జాతర అగ్నిగుండంపై నడిచే వార్షిక పండుగ. ఇందులో భాగంగా భక్తులు నిప్పులపై నడిస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏంటో ఇంకా తెలియలేదు. బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రావల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
పోప్ అవతారంలో ట్రంప్.. సోషల్ మీడియాలో పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త అవతారం ఎత్తారు. పోప్ అవతారంలో దర్శనం ఇచ్చారు. కొత్త అవతారానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. తనకు తాను పోప్‌గా ఊహించుకుంటూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల కన్నుమూశారు. తదుపరి పోప్ ఎన్నిక త్వరలో జరగనుంది. ఇది అత్యంత రహస్యంగా ఈ ఎన్నిక జరగనుంది. అయితే ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ట్రంప్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకర్లు ట్రంప్‌ను ప్రశ్నిస్తూ… కొత్త పోప్‌గా ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారని అడిగారు. దీనికి ట్రంప్ సమాధానం ఇస్తూ ‘‘పోప్ నేనే అవ్వాలనుకుంటున్నాను’’ అని సమాధానం ఇచ్చారు. మొత్తానికి అన్నట్టుగానే ట్రంప్ పోప్ అవతారం ఎత్తేశారు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
నాని కోసం రంగంలోకి మరో సంస్థ ?
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్ఫాడిస్తున్నాడు. వైలెన్స్ పీక్స్ లో ఉండటంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఇకటి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అంతా చూసే ఉంటారు. నాని మరోసారి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టనున్నాడు. ‘ఇది కడుపు మండిన కాకులు కథ.. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ’ అంటూ ఈ వీడియోలో వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే నాని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ప్లేఆఫ్స్‌పై ఆర్సీబీ కన్ను.. నేడు చెన్నైతో ఢీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఉండటం ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చింది. ఎందుకంటే క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్‌లోని ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు ఎదుర్కొనేందుకు చివరిసారిగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ మొత్తం పాయింట్లు 16కి చేరుకుంటాయి. ప్లేఆఫ్స్‌లో వారి స్థానం దాదాపు ఖాయం అవుతుంది. దీని తర్వాత ఆర్‌సిబి ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ IPL-2025లో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్ళు ధోని, కోహ్లీపైనే ఉంటాయి. ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 443 పరుగులు చేశాడు. ఆర్‌సిబి తమ కెప్టెన్ రజత్ పాటిదార్ నుంచి కీలక ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. చెన్నై బౌలర్లలో, పేసర్ ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ నూర్ అహ్మద్ మాత్రమే ఇప్పటివరకు బాగా రాణించగలిగారు. చెన్నై బ్యాట్స్‌మెన్ ఆయుష్ మాత్రే, సామ్ కుర్రాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబే వంటి బ్యాట్స్‌మెన్‌లు బాగా రాణించి, చివరి ఓవర్లలో ధోని దూకుడు బ్యాటింగ్ తో పరుగులు సాధించగలరని జట్టు ఆశిస్తోంది.