రాఖీ పౌర్ణమి రోజు విషాదం.. చెల్లి వద్దకు రాఖీ కోసం వెళ్తూ అనంత లోకాలకు..
ఎటు చూసినా రాఖీ పౌర్ణమి సందడి కనిపిస్తోంది.. సోదరులకు వెళ్లే అక్కలు, చెల్లెళ్లు ఓవైపు.. వారి దగ్గరకు వెళ్లే సోదరులతో మరోవైపు రోడ్లు రద్దీగా మారిపోయాయి.. అయితే, పండుగ పూట కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ.. అనంత లోకాలకు చేరాడు ఓ యువకుడు.. తాళ్లపూడి మండలం పెద్దవం గ్రామానికి చెందిన గండేపల్లి శంకర్.. దేవరపల్లి మండలం యాదవోలులో ఉన్న తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి బయలుదేరాడు… ఇంతలో గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్దకు వచ్చేసరికి బైక్ యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబలించింది.. కుటుంబానికి పెద్దదిక్కుగా తన తండ్రి డయాలసిస్ పేషెంట్ కావడంతో కుటుంబ పోషణను భుజాన వేసుకొని కంటికి రెప్పలా చూసుకునే కొడుకు ఒక్కసారిగా దూరం అవడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలోకి నెట్టినట్టు అయ్యింది.. ఈ ఘటనతో పెద్దవం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక.. 1,500 మంది మహిళలకు చీరలు పంపిన పవన్..
రాఖీ పౌర్ణమి శుభ వేళ.. పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపించారు పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించి మరోసారి మంచి మనస్సు చాటుకున్నారు.. అయితే, ఊహించని రక్షాబంధన్ కానుకకి ధన్యవాదాలు తెలిపారు పిఠాపురం ఆడపడుచులు.. ఇక, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాటలో పార్టీ నాయకులు మరికొందరు రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో రక్షాబంధన్ కానుకలు పంపిణీ చేశారు.. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వితంతువులకు సోదరుడిగా నేను ఉన్నాను అనే భరోసా కల్పించడంతో పాటు.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా, ప్రతి ఆడపడుచునూ గౌరవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని స్థానిక నాయకులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కల్యాణ్ తరఫున ఇంటింటికి వెళ్లి.. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ కానుకలు అందించారు జనసైనికులు.. భర్తలను కోల్పోయిన తర్వాతు బంధువులు కూడా చిన్నచూపు చూస్తున్న తమను గౌరవిస్తూ.. అక్కచెల్లెళ్లుగా స్వీకరించి చీరలు పంపించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు సదరు మహిళలు.. పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు..
30 ఏళ్లుగా ఏకగ్రీవం.. ఆసక్తికరంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక..
కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి.. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే.. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసిన అక్కడ ఏకగ్రీవమే.. అయితే, 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్ల గాను 2,500 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విత్ డ్రా సమయం అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రం అయ్యాయి… అయితే అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో 2750 ఓట్లు సాధించింది టీడీపీ.. 1995, 2001, 2006 సంవత్సరాలలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఇక, 2021లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.. 2021లో పులివెందుల జడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది… ఈ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే, ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగదేశం భావిస్తుందట… పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమ సత్తా చాటాలని టీడీపీ హ్యుహరచనలు చేస్తోందట… ప్రస్తుతం పులివెందుల జడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లు ఉన్నాయి… అసెంబ్లీ ఎన్నికలలో పులివెందుల జడ్పీటీసీ పరిధిలో టిడిపికి 25 శాతం ఓటు బ్యాంకు ఉంది.. అంతేకాకుండా 2016 జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 2600 ఓట్లు మాత్రమే వచ్చాయి.. ప్రస్తుతం కూడా 25 శాతం ఓటు బ్యాంకు ప్రకారం అంటే దాదాపు 2600 ఓట్లు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి.. ఎటు చూసినా పులివెందులలో టీడీపీకి బలం లేదు అని చెప్పవచ్చు… కానీ, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని తెలుగుదేశం నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు..
అడవి వీడి అన్న చెంతకు.. 40 ఏళ్ల తర్వాత రాఖీ కట్టిన చెల్లి..
ఓ చెల్లి.. నాలుగు దశాబ్దాల తర్వాత తన అన్నకు రాఖీ కట్టింది.. సామాజిక న్యాయం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి అడవిలో పోరుబాట పట్టిన ఆ చెల్లి.. 40 ఏళ్లుగా ప్రతి ఏటా రాఖీ పండుగ రోజున తోడబుట్టిన అన్నను తలుచుకొని రాఖీ కట్టలేక పోతున్నాను అనే బాధను పంటి కింద దిగబట్టుకుని నాలుగు దశాబ్దాల అనంతరం ఈ రోజు తోడబుట్టిన అన్నకు రాఖీ కట్టింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన పసుల వసంత అలియాస్ బత్తుల గాంబాలు అలియాస్ శాంతక్క దండకారణ్యంలో నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు.. కేంద్ర కమిటీ సభ్యురాలిగా.. నార్త్ బస్తర్ డివిజన్ ఇంఛార్జ్‌గా కూడా పనిచేసి అనారోగ్యంతో కొద్ది నెలల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు.. ఈ క్రమంలో నాలుగు నెలల తర్వాత కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి తిరిగి వచ్చారామె.. అయితే, ఆమె జీవితంలో ఈ రాఖీ పౌర్ణమి మర్చిపోలేని రోజుగా మారింది. నాలుగు దశాబ్దాలుగా కలవని తోడబుట్టిన అన్న బత్తుల రాజంకు రాఖీ కట్టి భావోద్వేగానికి గురైంది.. అన్నకు రాఖీ కడుతుండగా.. ఇటు వసంత.. అటు రాజం.. ఇద్దరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు అన్న, చెల్లి.. మొత్తంగా సామాజిక న్యాయం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి అడవి బాట పట్టిన ఆ చెల్లి.. 40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ కట్టి మురిసిపోయింది..
హుస్సేన్ సాగర్ నాలాకు భారీ వరద నీరు.. అధికారులు అప్రమత్తం
హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ సరస్సు దగ్గర నీటి స్థాయిలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సమీపంలోని కాలనీలకు వరద నీరు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్‌నగర్, సబర్మతినగర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని బట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం, వరద నీటి నిల్వ స్థాయి పెరుగుతున్న కారణంగా, ఈ ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉంది.
500 అమ్మాయిలను రే*ప్ చేసి పూడ్చి పెట్టారు.. ధర్మస్థల ఘటనపై నారాయణ హాట్ కామెంట్స్
కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పారిశుద్ధ్య ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తన 20 ఏళ్ల సర్వీసులో, వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నిటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలే ఉన్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మృతదేహాలు పూడ్చి పెట్టిన 15 అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఇలా చేస్తే 20 శాతం డిస్కాంట్..!
పండుగ సీజన్‌లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వేశాఖ.. పండుగ సమయంలో తిరుగు ప్రయాణ టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది.. అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్లలో తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.. అక్టోబర్ 13-26 మధ్య.. నవంబర్ 17 నుండి డిసెంబర్ 1 వరకు అదే రైలు నుండి తిరిగి వచ్చే ప్రయాణాలకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును అందించే పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది. ఆగస్టు 14 నుండి బుక్ చేసుకున్న టిక్కెట్లపై ఈ డిస్కౌంట్ ఉంటుంది.. కానీ, రాజధాని, శతాబ్ది, దురంతో మొదలైన ఫ్లెక్సీ ఫేర్ రైళ్లలో రిబేట్ వర్తించదు. ARP (ముందస్తు రిజర్వేషన్ వ్యవధి) తేదీ 13 అక్టోబర్ 2025 కోసం బుకింగ్ ప్రారంభ తేదీ 14.08.2025 అవుతుంది’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 13 అక్టోబర్ 2025 మరియు 26 అక్టోబర్ 2025 మధ్య రైలు ప్రారంభ తేదీకి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి.. ఆ తర్వాత నవంబర్ 17 మరియు డిసెంబర్ 1, 2025 మధ్య రైలు ప్రారంభ తేదీకి కనెక్టింగ్ జర్నీ ఫీచర్ ఉపయోగించి తిరుగు ప్రయాణ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.. కానీ, అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP), తిరుగు ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి వర్తించదని స్పష్టం చేసింది.
నిర్మాతల నిర్ణయం అంగీకరించట్లేదు.. రేపు ఫెడరేషన్ నిరసన
సినీ కార్మికుల వేతనాల పెంపుపై తాజాగా నిర్మాతల మండలి ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంపై ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.2వేలు, అంతకంటే తక్కువ వేతనం ఉన్న వారికి మూడు విడతల్లో వేతనాలు పెంచుతామని ఫిలిం ఛాంబర్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయించించింది. ఈ నిర్ణయంపై తాజాగా ఫెడరేషన్ సీరియస్ అయింది. ఈ నిర్ణయం ఫెడరేషన్ సభ్యులను విడదీసే విధంగా ఉందంటూ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అన్నారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు వేతనాలు పెంచాల్సిందే అంటూ డిమాండ్ చేసింది ఫెడరేషన్. నిర్మాతలు చెబుతున్న దాని ప్రకారం కేవలం 10 సంఘాలకే వేతనం పెంపు ఉంటుందని.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు ఫెడరేషన్ సభ్యులు.
నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.. పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ!
మెగాస్టార్ చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించాలి. నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను.
వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైమ్ లో ప్రమోషన్లలో జోరు పెంచారు. ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. హిందీలో రన్ టైమ్ 53 నిమిషాల, 24 సెకన్లు కాగా.. తెలుగు, తమిళ భాషల్లో 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లుగా ఉంది. చూస్తుంటే తెలుగు కంటే హిందీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.
సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతల కీలక ప్రకటన
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో నిర్మాతల మండలి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో వేతన పెంపుపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో పలు ఆంక్షలతో కూడిన కీలక నిర్ణయాలను ప్రకటించారు.