విశాఖ, బెజవాడ వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలకంగా ముందడుగు పడింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల మధ్య నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది.. ఈ ఒప్పందంపై మంత్రి నారాయణ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం ప్రతిపాదించామన్నారు. అయితే, గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా పక్కన పెట్టిందని విమర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్‌కు మెట్రో రైలు నిర్మాణమే పరిష్కారమని స్పష్టం చేశారు. కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం, మిగిలిన 60 శాతం అతి తక్కువ వడ్డీ లోన్ ద్వారా కేంద్రం నుంచి అందనున్నదన్నారు. ఈ లోన్‌కు ఈఎంఐలను మెట్రో కార్పొరేషన్ చెల్లించనుంది వెల్లడించారు మంత్రి నారాయణ.. ఇక, విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23 కిలోమీటర్ల మార్గానికి రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపడతామన్నారు మంత్రి నారాయణ.. వీఎంఆర్డీఏ 20 శాతం, కేంద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వారా నిధుల సమీకరణ జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. మరోవైపు, విజయవాడ మెట్రో ఫేజ్-1 కింద 35.04 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతామని, రూ.10,118 కోట్లతో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. CRDA 20 శాతం, కేంద్రం 20 శాతం, 60 శాతం లోన్ ద్వారా నిధులు సమీకరిస్తామన్నారు. విజయవాడ మెట్రోకు రేపు లేదా ఎల్లుండి టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. అయితే, విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 99.75 ఎకరాలు, విజయవాడ మెట్రో ప్రాజెక్టు కోసం 91 ఎకరాలు అవసరమవుతాయని, భూ సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు మంత్రి నారాయణ.. ప్రజలకు అత్యాధునిక రవాణా సదుపాయాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
పీ4 లోగో ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
పీ4పై అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పీ4 లోగోను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు.. #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆవిష్కరించారు. అయితే, ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నట్లు వివరించారు. బంగారు కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు..
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వల్లభనేని వంశీ.. సడలింపు ఇవ్వండి..!
మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. బెదిరింపులు, కిడ్నాప్ కేసులో అరస్ట్ అయిన వంశీపై ఆ తర్వాత వరుసగా 11 కేసులు నమోదు అయ్యాయి.. కొన్ని కేసుల్లో బెయిల్.. మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో.. 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.. అయితే, 2 కేసుల్లో వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు.. ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంలో విధించిన షరతుల్లో సడలింపు ఇవ్వాలని ఈ సారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఇక, వల్లభనేని వంశీ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.. ఇప్పటికే 3 కేసుల్లో బెయిల్ సందర్భంగా విధించిన షరతులు సడలించాలని దిగువ కోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ల మీద విచారణ ఈ నెల 29కి వాయిదా పడిన విషయం విదితమే..
మాకు మంచి ఫుడ్ పెట్టడం లేదు..! ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన విద్యార్థులు
ప్రభుత్వ స్కూళ్లతో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పుచేసి సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకుంటుది.. గతంలో ఉన్న మెనూను మార్చి.. విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించింది ప్రభుత్వం.. అయితే, మాకు స్కూల్‌లో పెట్టే ఫుడ్ బాగోలేదంటూ.. ఏకంగా ఎమ్మెల్యేకే ఫిర్యాదు చేశారు విద్యార్థులు.. దీంతో, రంగంలోకి దిగిన ఎమ్మెల్యే, ఆ పాఠశాలను విజిట్ చేసి.. ఆహారాన్ని పరిశీలించి.. ఆగ్రహం వ్యక్తం చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సింధూరరెడ్డికి ఓ ఫోన్ వచ్చింది.. మాకు వడ్డించే అన్నం, కూర బాగాలేదని విద్యార్థులు నేరుగాఎమ్మెల్యే సింధూర రెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.. ఇక, ఫోన్ కాల్ తో స్పందించి ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. పాముదుర్తి పాఠశాలలను విజిట్ చేశారు.. పాముదుర్తి ప్రాథమిక, హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు.. నాణ్యతలేని ఫుడ్ సరఫరాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.. మరోవైపు.. క్లాసులను పరిశీలించి.. విద్యార్థులను చెబుతున్న పాఠాలపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా ఓ క్లాస్‌లో బ్లాక్ బోర్డుపై ఎమ్మెల్యే సింధూరరెడ్డి.. నెమలి బొమ్మ వేయగా.. విద్యార్థులంతా చప్పట్లు కొట్టి అభినందించారు..
భారీ వర్షాలపై సర్కార్ హైఅలర్ట్.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.. బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై ఏపీ హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.. వాయుగుండం ఈరోజు పశ్చిమ బెంగాల్, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉండగా.. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది.. అయితే, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి అనిత.. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి స్వయంగా పరిశీలించారు. ఇక, అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా.. టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101గా ప్రకటించారు.. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు..
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వాటా కింద రూ. 4872 కోట్ల నిధులకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని రహదారి మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే అనేక ప్రతిపాదనలను రెడీ చేస్తోంది. అయితే, 2023- 24లో రూ. 1,900 కోట్లు, 2024- 25లో రూ. 3,272 కోట్ల నిధులను విడుదల చేయగా.. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా నిధులను కేంద్ర సర్కార్ కేటాయించింది. దీంతో రాష్ట్ర రహదారుల అభివృద్ధి మరింత తొందరగా జరిగే అవకాశం ఉంది.
హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవకతవకల కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్‌ను ఈరోజు (జూలై25) సాయంత్రం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్‌సీఏ స్కాం కేసులో ఏ2గా ఉన్న దేవరాజు.. ఉప్పల్ ఇన్ స్పెక్టర్ సమాచారంతో సీఐడీ నుంచి తప్పించుకున్నాడు. అతడ్ని పట్టుకోవడానికి 36 గంటల పాటు నిర్విరామంగా పని చేసి పూణెలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, భద్రాచలం, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నెల్లూరు, చెన్నై, కాంచీపూరం, బెంగళూరు, పూణె, యానాం నగరాల్లో తిరిగిన దేవరాజు.. ఇతర రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో దేవరాజును సీఐడీ అధికారులు పట్టుకున్నారు. కాగా, హెచ్‌సీఏపై కేసు నమోదైన తర్వాత దేవరాజు 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగినట్లు గుర్తించారు. ఇక, అతడ్ని పట్టుకోవడానికి 6 ప్రత్యేక బృందాలు గాలించాయి.
బీసీ రిజర్వేషన్లను బీజేపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది..
ఢిల్లీలో అఖిల భారత నాయకత్వంతో కీలక సమావేశాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిన్న ఖర్గే నివాసంలో తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది.. భారత్ జోడో యాత్రలో అసమానతలు గమనించి కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. కేంద్రంలో అధికారంలోకి రాకపోయినా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కుల గణన చేసింది అన్నారు. 56 ప్రశ్నలతో.. 150 ఇండ్లను ఒక బ్లాక్ గా చేసి, శాస్త్రీయ బద్దంగా కులగణన చేశాం.. సర్వేలో మూడున్నర కోట్ల ప్రజలు స్వచ్ఛందంగా తమ సమాచారం ఇచ్చారు.. బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ కు పంపించాం.. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాం.. తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి అద్భుతమైన సర్వేను సిద్ధం చేశారనీ అగ్రనాయకులు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..
కోవిడ్-19 వ్యాక్సిన్ దుష్ప్రభావాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. టీకా వల్ల గుండె జబ్బులు, గుండెపోటు కేసులు పెరిగాయని.. దీని వల్ల ఆకస్మిక మరణాలు పెరిగాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వివిధ అధ్యయనాలు దీని గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం (జూలై 25) లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ టీకా కారణంగా ఆకస్మిక మరణ ప్రమాదం పెరగలేదని స్పష్టం చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల నిర్వహించిన అధ్యయనం నివేదికను ఉటంకిస్తూ.. టీకా, పెరుగుతున్న మరణ కేసుల మధ్య ఎటువంటి సంబంధం కనుగొనబడలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్నారు. కోవిడ్ తర్వాత ఆసుపత్రిలో చేరడం, ఆకస్మిక మరణాల కుటుంబ చరిత్ర, జీవనశైలి సంబంధిత సమస్యలు ఆకస్మిక మరణానికి కారణమని నిపుణుల బృందం తేల్చిందని వెల్లడించారు.
‘‘ఇస్లాం స్టడీ చేయాలి, అరబిక్ నేర్చుకోవాలి’’.. ఇజ్రాయిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..?
ఇజ్రాయిల్ సైన్యంలో అన్ని రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్‌లోని సైనికులు, అధికారులు ఇస్లాం గురించి అధ్యయనం చేయడం, అరబిక్ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. అక్టోబర్ 07, 2023 నాటి నిఘా వైఫల్యం తర్వాత, మరోసారి అలాంటి దాడి జరుగొద్దని భావిస్తున్న ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి 100 శాతం AMAN (ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు హీబ్రూ భాషలో సంక్షిప్త రూపం) సిబ్బందికి ఇస్లామిక్ అధ్యయనాలలో శిక్షణ ఇవ్వబడుతుందని, వారిలో 50 శాతం మంది అరబిక్ భాషా శిక్షణ పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. AMAN చీఫ్ – మేజర్ జనరల్ శ్లోమి బైండర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.
వర్షాకాలంలో పారాసిటమాల్‌కు మంచి గిరాకీ.. దీని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా..?
వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో జబ్బులు బాగా పెరుగుతాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు అధికమవుతాయి. అయితే.. ఈ సీజన్‌లో పారాసిటమాల్ ట్యాబ్లెట్‌కు మంచి గిరాకీ ఉంటుంది. మనకు ఏ చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి లాంటిది ఉన్నపుడు వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటాం. ఒంట్లో వేడి పెరిగినపుడు, తలనొప్పి, పంటి నొప్పి, బెణుకులు, జలుబు, ఫ్లూ లాంటివి ఇబ్బంది పెడుతున్నపుడు వీటి నుంచి సత్వర ఉపశమనం కోసం ఏకైక పరిష్కారంగా పారాసిటమాల్ నే ఎంచుకుంటాం. ఈ ఒక్క ఔషధం అనేక రకాల సమస్యలను అదుపు చేస్తుంది. పారాసిటమాల్‌ను ఎసిటమైనోఫెన్ అని కూడా పిలుస్తారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దీని వినియోగం మరింత పెరిగింది.
అదిరే అభి డైరెక్షన్లో సముద్రఖని ‘కామాఖ్య’
తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం *కామాఖ్య* అనే శక్తివంతమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది, ఇందులో యూనిక్ కథాంశం, ఆకర్షణీయమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు. కామాఖ్య అనే టైటిల్ ఈ చిత్రానికి పవర్‌ఫుల్ నెస్ తీసుకువస్తోంది. అభినయ కృష్ణ ఈ చిత్రం కోసం ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశారు. ఆయన రూపొందించిన కథాంశం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుందని తెలుస్తోంది.
స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా
చాలా కాలం నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్‌కాస్ట్ వీడియో షూట్ చేశాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడిగితే, వెంటనే ఆయన ఏమాత్రం తడుముకోకుండా సెప్టెంబర్ నెలలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు. ఏదైనా లీక్ ఇవ్వమని అడిగితే, “లీక్ ఏమీ లేదు, షూటింగ్ మొదలు పెట్టబోతున్నామని” అన్నాడు.