ఆ ఏడుగురు ఎమ్మెల్యేల తీరు సరికాదు.. మంత్రి లోకేష్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. అయితే, కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు మంత్రి నారా లోకేష్.. మంత్రివర్గ భేటీకి ముందు ఎమ్మెల్యేల వివాదస్పద ఘటనలపై మంత్రులతో చర్చించారు.. ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాలను ప్రస్తావించారట.. మరోవైపు, రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ సిఫార్సు చేసిన కోటంరెడ్డి, సునీల్ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయట.. అనంతపురం, శ్రీశైలం ఎమ్మెల్యేలు సహా ఏడుగురి తీరు సరికాదని హితవు చెప్పారట లోకేష్.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్నారని మంత్రులకు తెలిపారు లోకేష్.. ఇక, పెరోల్ విషయాల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆచితూచి వ్యవహరించాలని హోమంత్రి వంగలపూడి అనితకు సూచించారట లోకేష్.. మరోవైపు, దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై ఫిర్యాదులను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు.. అర్హులు నష్టపోకుండా పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుందామని మంత్రులకు తెలియజేశారు మంత్రి నారా లోకేష్.
చంద్రబాబుతో అనంతపురం ఎమ్మెల్యే భేటీ.. జూ.ఎన్టీఆర్‌పై వ్యాఖ్యల విషయంలో వివరణ.. సీఎం సీరియస్ వార్నింగ్..
జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడిన తీరు ఇప్పుడు చినికి చినికి గాలివానలా మారింది.. ఓ వైపు జూనియర్ ఫ్యాన్స్ దగ్గుపాటి వార్నింగ్ లు ఇస్తూ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలని డెడ్ లైన్ పెట్టారు. ఇంకో వైపు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందనే చర్చ సాగుతుండగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో ఎమ్మెల్యేను తీవ్రంగా మందలించారు సీఎం.. ఈ విషయం అయినా.. పరిణితితో వ్యవహరించాలని హెచ్చరించారు.. ఇలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా. నియోజకవర్గంలోనూ అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలని హితవు చెప్పారు సీఎం చంద్రబాబు..
మంత్రులు, ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి.. కేబినెట్ భేటీలో క్లాస్ పీకిన సీఎం..
ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తరువాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన శ్రీకాంత్ పెరోల్ అంశం తో పాటు. శ్రీశైలం ఎమ్మెల్యే రాజ్ శేఖర్ రెడ్డి అంశం పై చర్చ జరిగింది.. ఎమ్మెల్యే లు జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు… సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ రకంగా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు… ఎమ్మెల్యేలు అత్యుత్సాహం తగ్గించు కోవాలన్నారు.. అవసరం అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా చర్యలకు వెనకాడే పరిస్థితి లేదన్నారు సీఎం చంద్రబాబు. ఇక, ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి కూడా మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. కొంతమంది మంత్రులు. అధికారులు ఫైల్స్ క్లియరెన్స్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు అన్నారు సీఎం చంద్రబాబు.. మంత్రుల పెర్ఫామెన్స్ పై వచ్చే కేబినెట్లో చర్చిస్తాం అన్నారు… మంత్రులు కూడా కొన్ని అంశాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని జరుగుతున్న పరిణామాలను వివరించారు.. ప్రభుత్వ పథకాలు జనంలోకి తీసుకు వెళ్లేలా దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.. కొంతమంది మంత్రులు శాఖలపై దృష్టి పెట్టి తమ పనితీరు మార్చు కోవాలని సీఎం చంద్రబాబు సూచించారు…
మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కీలక సూచనలు
ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించిన కీలక సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు మెగా డీఎస్సీ 2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి.. పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు చేపడతామని స్పష్టం చేసిన ఆయన.. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం దృఢ సంకల్పం అన్నారు.. మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చాం.. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చాం.. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే సమాచారం పొందాలని తెలిపారు..
రైల్వే ప్రయాణికుల అదనపు లగేజీపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి
కొన్ని రోజుల క్రితం ఎయిర్ లైన్స్ మాదిరిగా రైల్వేలలో కూడా అదనపు లగేజీకి ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఫస్ట్ క్లాస్ AC కోచ్‌లలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉందని, ఏసీ సెకండ్ క్లాస్ ప్రయాణీకులకు, ఈ పరిమితి 50 కిలోలు, థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, పరిమితి 40 కిలోల వరకు ఉంటుంది. అదేవిధంగా, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులు తమతో 35 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతిస్తారని నివేదికలు పేర్కొన్నాయి. విమానాశ్రయాల మాదిరిగానే, రైల్వే స్టేషన్లలో లగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే సౌకర్యం ప్రారంభించబడిందని మునుపటి నివేదికలు కూడా పేర్కొన్నాయి.
టీవీకే సభలో ఘోరం.. స్పృహతప్పి పడిపోయిన 400 మంది కార్యకర్తలు.. పలువురు మృతి
తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సంచలనంగా మారారు. గురువారం తమిళనాడు మధురైలో తమిళగ వెంట్రీ కజగం పార్టీ రెండవ వార్షికోత్సవ సభ విజయవంతం అయ్యింది. కానీ సభకు వచ్చిన వారిలో సుమారుగా 400 మంది విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 12 మంది పరిస్థితి విషయంగా ఉంది. పార్టీ రెండో మనాడును పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. సుమారుగా సభకు నాలుగు లక్షల మంది జనాలు వస్తారని అంచనా వేస్తే.. దానికి మించి ప్రజలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం.
యుద్ధం ముగింపు ఉత్తుత్తి మాటలేనా?.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
రష్యా – ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. దాదాపు 500కు పైగా డ్రోన్లతో తమ దేశంలోని పశ్చిమ ప్రాంతాలపై మాస్కో దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మాస్కో-కీవ్‌ల యుద్ధం ముగింపు కోసం ట్రంప్.. పుతిన్, జెలన్స్కీలతో వేరువేరుగా చర్చలు జరిపారు. ఈ రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలుకుతాయని ప్రపంచం అనుకుంటుంటే ఈ దాడి జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
పాకిస్తాన్ తో మ్యాచ్ లపై కేంద్రం కీలక ప్రకటన.. ద్వైపాక్షిక మ్యాచ్ లు, ఆసియా కప్ పై ఏం చెప్పిందంటే?
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని, పాకిస్తాన్ జట్టును కూడా భారతదేశానికి రావడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు , ఆసియా కప్, ఐసిసి టోర్నమెంట్లు వంటి బహుళ-దేశాల టోర్నమెంట్లను విడివిడిగా పరిగణిస్తారు. ఈ టోర్నమెంట్లు తటస్థ వేదికలో జరిగితే భారతదేశం వాటిలో పాల్గొనవచ్చు. భారత విధానంలో ఎటువంటి మార్పు లేదని, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రశ్నే లేదని క్రీడా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆసియా కప్ బహుళ దేశాల టోర్నమెంట్ కాబట్టి, టీం ఇండియా అందులో ఆడుతుంది. ఈ నిర్ణయం తర్వాత, భారతదేశం- పాకిస్తాన్ పోరు ఆసియా కప్ లేదా ఐసిసి టోర్నమెంట్ల వంటి వేదికలపై మాత్రమే కనిపిస్తాయని స్పష్టమైంది. ఆ అధికారి మాట్లాడుతూ – భారత జట్లు, ఆటగాళ్ళు, పాకిస్తాన్ జట్లు లేదా ఆటగాళ్ళు కూడా పాల్గొనే అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంటారు. అదేవిధంగా, పాకిస్తాన్ జట్లు, ఆటగాళ్ళు భారతదేశంలో జరిగే బహుళ-దేశాల టోర్నమెంట్లలో ఆడటానికి అనుమతి ఉంటుందని తెలిపారు.
సింహం వేట మొదలైంది.. డీఎంకేతోనే పోటీ : విజయ్
టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. టీవీకే పార్టీ మానాడు కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తమిళనాడులో సింహం వేట మొదలైంది. ఇక నుంచి రణరంగమే జరుగుతుంది. తమిళనాడులోని ప్రతి ఇంటి డోర్ కొడుతాం. అందరినీ కలుపుకునిపోతాం. ఏ పార్టీతోనూ మేం చేతులు కలపం. ఒంటరిగానే పోరాడుతాం. రాబోయే తమిళ నాడు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. భావజాల బీజేపీతో అస్సలు చేతులు కలపం. డీఎంకేతోనే మాకు పోటీ అంటూ తేల్చి చెప్పారు విజయ్. తనను ఎంత మంది విమర్శిస్తే అంత ఎత్తుకు ఎదుగుతానంటూ తెలిపారు. తాను కులానికి, మతానికి అతీతుడిని అన్నారు. కేవలం తమిళనాడుకే తన ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజకీయంగా తనను విమర్శిస్తే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలిపేది లేదు. ఆ పార్టీకి భావజాలం ముఖ్యం. తమిళనాడు అస్తిత్వాన్ని కదిలించే ప్రయత్నం ఎవరు చేసినా ఊరుకునేది లేదు. ఇప్పుడున్న పార్టీలు అన్నీ తమిళనాడు భావాన్ని తగ్గించేందుకు చూస్తున్నాయి. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ఢిల్లీలో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఆయన పాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆర్ ఎస్ ఎస్ లాంటి వారి ముందు ఆయన తల వంచుతున్నారు అంటూ చెప్పారు టీవీకే చీఫ్ విజయ్. రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ గా పాలిటిక్స్ లో బిజీగా ఉంటానని తెలిపారు.
సినీ పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రెజీనా కసాండ్రా
అందం, అభినయం కలగలిసిన తార రెజీనా కసాండ్రా.. శివ మనసులో శృతి చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ భామ ఆ తరువాత రొటిన్ లవ్‌స్టోరీ, కొత్తజంట, పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో తెలుగులో అగ్ర కథానాయికల జాబితాలో చేరింది. కేవల తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇటీవల అజిత్‌లో కలిసి నటించిన తమిళ చిత్రం విదా మయూర్చితో పాటు బాలీవుడ్ చిత్రం జాట్తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రెజీనా కసాండ్రా. ఇప్పటి వరకు అన్ని తరహా పాత్రలను పోషించిన ఈ అందాల భామ త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో ముందుకు రానుంది. భారతీయ సినీ పరిశ్రమలో ప్రవేశించి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఓ రెండు చిత్రాలతో పాటు తమిళంలో మూడు సినిమాలు, కన్నడ, హిందీ భాషల్లో రెండు చిత్రాలతో బిజీగా ఉంది
మంచాన పడ్డ ‘వెంకీ’ సినిమా కమెడియన్ రామచంద్ర
ఈ మధ్య చాలా మంది నటులు మంచాన పడుతున్నారు. రీసెంట్ గానే ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఇప్పుడు మరో నటుడు మంచాన పడ్డాడు. రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమా ఇప్పటికీ ఫేమస్. ఆ సినిమాలో వెంకీ పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బొద్దుగా ఉండే వ్యక్తి రమణ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అతను అప్పట్లో చాలా ఫేమస్. అతని అసలు పేరు రామచంద్ర. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పుడు అవకాశాలు లేక వేరే పనులు చేసుకుంటున్నాడు. తాజాగా అతను మంచం మీద నుంచి నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనకు పక్షవాతం వచ్చింది. దీంతో ఆయనకు రెండు కాళ్లు సరిగ్గా నడవరావట్లేదు. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.