మైనింగ్ శాఖపై సీఎం సమీక్ష.. వడ్డెరలకు గుడ్‌న్యూస్..
మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వడ్డెరలకు శుభవార్త చెప్పారు.. వడ్డెరలకు మైనింగ్ లీజ్‌కు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు… వడ్డేర్ల సొసైటీలకు 15 శాతం గనులు లీజ్‌కు ఇచ్చే అంశంలో దృష్టి పెట్టాలన్నారు చంద్రబాబు.. వడ్డేర్లకు ఆర్ధిక ప్రయోజనం కల్పించేలా లీజ్ కేటాయింపు విధానం ఉండాలన్నారు… రాష్ట్రంలో ఖనిజ సంపదపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు సీఎం చంద్రబాబు… మైనింగ్ పై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారుల తో సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో మైనింగ్ జరుగుతోన్న తీరును వివరించారు అధికారులు.. ఇక, గనుల శాఖపై, ఖనిజ సంపదపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ.. ఈ సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
100 రోజుల ప్రణాళిక అమలుపై డిప్యూటీ సీఎం కీలక సమీక్ష..
100 రోజుల ప్రణాళిక అమలుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్తలు, రాష్ట్ర అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో చర్చించారు.. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకువచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అధికార యంత్రాంగం, శాస్త్రవేత్తలతో సమాలోచనలు చేశారు.. మత్స్యకారులలో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉన్న అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు పవన్ కల్యాణ్.. తన క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ), విశాఖ శాస్త్రవేత్తలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు పవన్ కల్యాణ్.. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని సూచించారు.. ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని స్పష్టం చేశారు.. వీటితోపాటు మత్స్య సంపదను పెంపొందించడం తదితర అంశాలపై విశాఖ సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ గారి సలహాలు, సూచనలు తీసుకోవాలి.. ఆయన సూచనలను అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కు సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి..!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. న్యూయార్క్ వెళ్లేందుకు మిథున్ రెడ్డికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ 4గా ఉన్న మిథున్ రెడ్డి.. బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, ఈనెల 23వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.. 50,000 రూపాయల విలువచేసే రెండు జమీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక, న్యూయార్క్ లో ఎక్కడ బస చేస్తున్నారు అనే వివరాలను కోర్టుకు అందజేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..
ప్రధాని మోడీ ఏపీ పర్యటన విజయవంతం.. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు..
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రావడం ఇది నాలుగోసారి.. ఈ పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. వీటిలో కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చింది అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారు.. ప్రధాని సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని అభినందించారు. శ్రీశైలం మల్లన్న ఆలయం దర్శనంపై ప్రధాని మోడీ ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ప్రధాని మోడీ సైతం సూపర్ జీఎస్టీ కార్యక్రమాలను అభినందించారని తెలిపారు. అయితే, జీఎస్టీ నెల రోజుల పాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ..
గత రెండు మూడు రోజులుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ‘జీరో’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, మంత్రి నారాయణ విశాఖపట్నం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నారాయణను కలిశారు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్. వర్మ… వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. టెలీ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మండిపడ్డారు.. నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురంలో వున్న సమస్యలను ప్రస్తావించాను… పిఠాపురంలో జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి “జీరో” చేశామని నేను చెప్పాను అన్నారు మంత్రి నారాయణ.. అయితే, కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థం అయ్యేది అన్నారు. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు అని స్పష్టం చేశారు.. NDA కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది… ఇండిపెండెంట్ గా 50 వేల ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ అని కొనియాడారు.. పిఠాపురంలో జనసేన, టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి అని వెల్లడించారు మంత్రి నారాయణ..
తన తల్లిదండ్రుల సాక్షిగా.. హరీష్ రావుకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..
నిన్న(గురువారం) తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో ఇటీవల కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వివాదాలకు సంబంధించి రాద్దాంతం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తన తల్లిదండ్రుల సాక్షిగా హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా.. నిన్న క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలడా? అని ప్రశ్నించారు. క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదన్నారు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారని ఎద్దేవ చేశారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న ఇండివిజువల్ గా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదన్నారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ.. అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అని తెలిపారు. ప్రభుత్వంలో ఉండగా రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్ఎస్ అని విమర్శించారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే చురకలంటించారు.
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘దీపావళి’’పై ఉద్రిక్తత..
‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో గందరగోళం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వారం ప్రారంభంలో మాస్ కమ్యూనికేషన్ విద్యార్థి అఖిల్ కౌషల్ అక్టోబర్ 18న NRSC క్లబ్‌లో దీపావళి వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాశారు. అనుమతి ఇవ్వకుంటే విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ వద్ద దీపావళి జరుపుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. హోలీ సమయంలో తమకు అనుమతి ఇవ్వకుండా వర్సిటీ తప్పు చేసిందని, వారు మళ్లీ తెలివైన వారు అయితే మళ్లీ ఇదే తప్పును రిపీట్ చేయరని ఆయన అన్నారు. ఒక వేళ అనుమతి రాకుంటా యూనివర్సిటీ హిందూ విద్యార్థులు ఏఎంయూ ‘‘బాబ్-ఎ-సయ్యద్’’ గేట్ వద్ద వైభవంగా దీపావళి జరుపుకుంటారని అన్నారు.
పశువుల్ని దొంగించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం..
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లు, భారతీయుడిని హత్య చేశారు. ఆ తర్వాత ముగ్గురుని గ్రామస్తులు ప్రతీకార దాడిలో హతమార్చారు. ఇది భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదంగా మారింది. అక్టోబర్ 15న జరిగిన ఈ సంఘటన దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది. మృతులకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. తక్షణ, నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు చేయాలని కోరింది. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ముగ్గురు బంగ్లాదేశ్ వలసదారుల మరణాలకు ఢాకా నిరసన తెలిపింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యల్ని ‘‘హేయమైంది, ఆమోదయోగ్యం కానిది, మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన’’గా అభివర్ణించింది. బంగ్లాదేశ్ కథనాన్ని భారత్ కొట్టిపారేసింది. ఈ సంఘటన భారత్ భూభాగంలో మూడు కిలోమీటర్ల దూరంలో జరిగిందని, ముగ్గురు కూడా బిద్యాబిల్ గ్రామం నుంచి పశువుల్ని దొంగలించేందుకు ప్రయత్నించారని భారత్ విదేశాంగ శాఖ తెలిపింది. స్థానికులు వీరిని అడ్డుకున్నప్పుడు, పదునైన ఆయుధాలతో దాడి చేశారని, స్థానికులు తమను తాము రక్షించుకోవడానికి హత్య చేశారని తెలిపింది. అధికారులు వచ్చేసరికి ఇద్దరు కూడా చనిపోయారని, మూడో వ్యక్తి ఆస్పత్రిలో మరణించినట్లు వెల్లడించింది. ఇద్దరి మృతదేహాలను బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించినట్లు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఆ దేశంలో సైనిక పాలన.. కొత్త అధ్యక్షుడిగా కల్నల్..
జనరల్-జెడ్ నిరసనలు మరొక దేశంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. మడగాస్కర్‌లో జనరల్-జెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని రోజుల తర్వాత కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆండ్రీ రాజోలినా పదవీచ్యుతుడయ్యారు. ఆ దేశ ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైనిక పాలకుడు మైఖేల్ రాండ్రియానిరినా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో జనాలు హర్షధ్వానాలు చేసిన వీడియోలు బయటికి వచ్చాయి. పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా తిరుగుబాటును ఖండించారు. ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానం సైనిక పాలనను ధృవీకరించినప్పటికీ, ఆయన అధికారికంగా రాజీనామా చేయడానికి నిరాకరించారు. దేశంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెల్లుబిక్కిన జెన్-జెడ్ తిరుగుబాటు తర్వాత ఆయన దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన ప్రవాసంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారన్నది తెలియలేదు. దేశంలో తిరుగుబాటుకు ముందు వారాల తరబడి జెన్-జెడ్ నిరసనలు జరిగాయి. వాస్తవానికి ఈ నిరసనలు ప్రారంభంలో నిరంతర విద్యుత్, నీటి కొరత కారణంగా జరిగాయి, కానీ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా రూపాంతరం చెందాయి.
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
పండగల వేళ తమ సేల్ ను పెంచుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు డిస్కౌంట్లు, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రమోషన్‌లను అందిస్తుంటాయి. ఇవి కస్టమర్‌లను తక్షణ కొనుగోలుకు ప్రోత్సహిస్తాయి. దాదాపు ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో స్కామర్లు దోపిడీకి తెరలేపుతుంటారు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి మోసాలకు గురికావొద్దంటే డిజిటల్ చెల్లింపు సెక్యూరిటీ చిట్కాలపై అవగాహన కలిగి ఉండాలంటున్నారు టెక్ నిపుణులు. UPI చెల్లింపు, భారత్ బిల్ పే, రూపే కార్డ్, FASTag, ఇతర సేవలను అందించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మీ లావాదేవీలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి కొన్ని భద్రతా చిట్కాలను యూజర్లతో పంచుకుంది.
బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్.. కేవలం 1 రూపాయికే కొత్త సిమ్.. 2GB 4G డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్
టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌కు కంపెనీ దీపావళి బొనాంజా 2025 అని పేరు పెట్టింది. ఈ ఆఫర్ కింద, కంపెనీ తన కొత్త వినియోగదారులకు కేవలం 1 రూపాయలకు BSNL 4G మొబైల్ సేవను అందిస్తోంది. దీపావళి బొనాంజా ఆఫర్ కింద, వినియోగదారులు కంపెనీ రూ.1 ప్లాన్‌లో 1 నెల వ్యాలిడిటీని పొందుతారు. దీనితో పాటు, BSNL కస్టమర్లు ప్రతిరోజూ 2GB 4G డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. దీపావళి బొనాంజా 2025 పరిమిత కాల ఆఫర్ అని BSNL పేర్కొంది. వినియోగదారులు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15, 2025 వరకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. BSNL దీపావళి ఆఫర్‌లో భాగంగా, కంపెనీ తన కొత్త కస్టమర్లకు కేవలం 1 రూపాయికే BSNL 4G సిమ్ కార్డును అందిస్తోంది. ప్రయోజనాలు ఏంటంటే?
దుల్కర్ సల్మాన్ కు భారీ ఊరట
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కేరళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. భూటాన్ నుంచి అక్రమంగా కార్లను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. రీసెంట్ గా ఐటీ అధికారులు కేరళలోని సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ సహా చాలా మందికి చెందిన 20 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. దీంతో దుల్కర్ సల్మాన్ హైకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను విచారించిన కోర్టు.. కారు రిలీజ్ పై వారంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఐటీ అధికారులను ఆదేశించింది. దీంతో ఆ పేపర్లను ఐటీ అధికారులకు దుల్కర్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే దుల్కర్ సల్మాన్ తో పాటు మరో వ్యక్తికి చెందిన కారును రిలీజ్ చేసేందుకు ఐటీ అధికారులు సమ్మతించారు. కాకపోతే ఆ కారు విలువలో 20 శాతం బ్యాంక్ గ్యారెంటీని పెట్టిన తర్వాత రిలీజ్ చేయనున్నారు. మలయాళంకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు కోర్టులో తమ కార్ల కోసం పిటిషన్లు వేశారు. తక్కువ ధరకు వస్తుందనే నెపంతోనే భూటాన్ నుంచి లగ్జరీ కార్లను తెచ్చుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దుల్కర్ విషయానికి వస్తే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్లతోనే వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు దుల్కర్.
కాంతార-1 బీభత్సం.. ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందంటే..?
రిషబ్ శెట్టి హీరోగా స్వీయ డైరెక్షన్ లో వచ్చిన హై ఓల్టేజ్ మూవీ కాంతార చాప్టర్ 1. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. మొదటి పార్టు కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. రికార్డుల పరంగా దుమ్ములేపింది ఆ సినిమా. దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 అంచనాలకు తగ్గట్టే ఆకట్టుకుంది. ఇందులో రిషబ్ సరసన రుక్మిణీ వసంత్ నటించింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు నాట మంచి విజయం అందుకుంది. రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు కన్నడ సినిమా తెలుగునాట ఎక్కువ వసూలు చేయడం అంటే కేజీఎఫ్ 2 తర్వాత ఇదే. అటు హిందీలోనూ ఈ మూవీ రికార్డు నెలకొల్పింది. హిందీలో కాంతార చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. చూస్తుంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేలాగా కనిపిస్తోంది. ప్రస్తుతం దీపావళికి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఆ వీకెండ్ కూడా కాంతారకు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1 ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దెబ్బకు హోంబలే సంస్థకు భారీ లాభాలు వచ్చి పడ్డాయి. ఇప్పటి వరకు కాంతార చాప్టర్ 1 తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది.