Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

నీట్‌ ఆధారంగా నర్సింగ్‌ ప్రవేశాలు.. సీఎం ఆమోదం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో నర్సింగ్ ప్రవేశాలను NEET-UG పరీక్ష ఆధారంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ మార్గాన్ని అనుసరించడానికి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.. 2026 – 27 విద్యాసంవత్సరంలో నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు National Eligibility cum Entrance Test (NEET-UG) రాయాల్సి ఉంటుంది. వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమావేశం చేపట్టి, నర్సింగ్ ప్రవేశాలకు ఉత్తమ విధానాన్ని రూపొందించడానికి సమీక్ష నిర్వహించారు. ఇక, ఈ నిర్ణయం రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ప్రవేశ ప్రక్రియను కేంద్రం ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కీలకంగా మారనుంది..

రేపే ఏపీ బడ్జెట్‌.. 10.30కి కేబినెట్‌.. 11.15కి బడ్జెట్‌ 2026-27
2026-27 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ను రేపు ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్ఱభుత్వం… రాష్ట్ర అసెంబ్లీలో ఉదయం 11:15కి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మొత్తం దాదాపు రూ.3.45–3.50 లక్షల కోట్లు ఉండే అవకాశముందని అంచనాలున్నాయి.. అయితే, బడ్జెట్‌కు ముందే.. అంటే రేపు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షనత ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్‌ 2026-27కు ఆమోదముద్ర వేయనుంది మంత్రివర్గం.. ఆ తర్వాత ఉదయం 11.10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. 11.15కి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.. శాసన మండలిలో ఆర్థిక బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టే అవకాశం ఉంది.. ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమ, మరియు ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిపెట్టుకుని రూపొందించినట్టుగా తెలుస్తోంది.. ఈ బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. “సూపర్ సిక్స్” హామీలలో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతుంది ప్రభుత్వం.. ఇక, రేపు మధ్యాహ్నం 12.50 కి వ్యవసాయ ప్రత్యేక పద్దును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. శాసన మండలిలో వ్యవసాయ పద్దును మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నారు..

700 వార్డుల్లో గెలుపు.. కాంగ్రెస్ వైఫల్యాలకు ఇది నిలువుటద్దం.!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార పక్షం ఎన్ని అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని ఆయన మండిపడ్డారు. దాదాపు 700కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దమని ఆయన అభివర్ణించారు. అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, డబ్బు రాజకీయాలకు భయపడకుండా కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిచి సత్తా చాటారని, బీఆర్ఎస్ నాయకులకు హరీష్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా ప్రజా తీర్పును మార్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికుల కృషి వెలకట్టలేనిదని ఆయన ప్రశంసించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పామును వదిలిన వ్యక్తి.. 50 రోజుల తర్వాత..
గత సంవత్సరం చివర్లో మహారాష్ట్రలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని రెస్ట్‌రూమ్‌లో ఒక వ్యక్తి పామును వదిలివేసాడు. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF), ఇతర భద్రతా సంస్థలు, విశ్వసనీయ సమాచారంతో కలిసి గాలింపు చేపట్టారు. ముంబైకి ఆనుకుని ఉన్న థానేలోని ముంబ్రా ప్రాంతంలో RPF నిందితుడిని పట్టుకుంది. ఈ సంఘటన డిసెంబర్ 27, 2025న జరిగింది, రైలు నంబర్ 22225 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని కోచ్ C-16 రెస్ట్‌రూమ్‌లో ఒక పాము కనిపించింది. రైలు తన ప్రయాణాన్ని కొనసాగించిందని, సోలాపూర్ స్టేషన్‌లో పామును సురక్షితంగా రక్షించామని అధికారులు తెలిపారు, అయితే ప్రయాణికులు రెస్ట్‌రూమ్‌లో పాము చూసి భయపడిపోయారని తెలిపారు. సెంట్రల్ రైల్వే, RPF నుండి అందిన సమాచారం ప్రకారం నిందితుడు నాసిక్ నివాసి అని అధికారులు తెలిపారు. CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 50 రోజుల దర్యాప్తు తర్వాత, నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని జగన్ అర్జున్ భలే (37) గా గుర్తించారు. అతను మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నివాసి. ఫిబ్రవరి 12న ముంబ్రాలో అతన్ని అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌లో ఎయిర్‌ హోస్టెస్‌ నియామకానికి వింత నిబంధన..
పాకిస్తాన్‌లో ఎయిర్ హోస్టెస్ నియామకాలపై ఇటీవల వెలువడిన ప్రకటనలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కొన్ని విమానయాన సంస్థలు మహిళా అభ్యర్థులకు “అవివాహిత” అనే నిబంధనను అర్హతగా పేర్కొనడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శారీరక దృఢత్వం, విద్యార్హత వంటి ప్రమాణాలు విమానయాన రంగంలో తప్పనిసరి. అయితే, అక్కడి కొన్ని ఎయిర్‌లైన్స్ అదనపు నిబంధనలు విధించడం చర్చకు దారితీసింది. కొన్ని విమానయాన సంస్థలు ఎయిర్ హోస్టెస్‌గా నియమించుకునే మహిళా అభ్యర్థులు అవివాహితులై ఉండాలి అని స్పష్టంగా పేర్కొన్నాయి. విమానయాన రంగంలో శారీరక ఫిట్‌నెస్, ఎత్తు, భాషా ప్రావీణ్యం వంటి ప్రమాణాలు సాధారణమే అయినప్పటికీ, వైవాహిక స్థితిని అర్హతగా నిర్ణయించడం అరుదుగా కనిపించే విషయం. నివేదికల ప్రకారం, Pakistan International Airlines గతంలో మహిళా క్యాబిన్ క్రూ పోస్టుల కోసం నిర్వహించిన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అవివాహిత మహిళలకే అర్హత కల్పించినట్లు సమాచారం.

మీ Google ఖాతాను ఇంకా ఎవరైనా వాడుతున్నారా? ఇలా చెక్‌ చేయండి..
ఇప్పుడు దేనికైనా గూగుల్‌ చేస్తున్నారు.. చివరకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌ చేసి లాగిన్‌ కావాలన్నా జీమెయిల్‌ కావాల్సిందే.. అయితే, మీ Google ఖాతా కేవలం ఒక లాగిన్ మాత్రమే కాదు.. అది మీ Gmail, Photos, Drive, YouTube వంటి వ్యక్తిగత డేటాకు గేట్‌వే. ఎవరైనా అనధికారికంగా యాక్సెస్ పొందితే, మీ సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో గూగుల్ ఖాతాలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు వంటి అనేక పరికరాల్లో ఉపయోగిస్తారు. అందుకే మీ ఖాతా ఎక్కడెక్కడ లాగిన్ అయి ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్రౌజర్‌లో myaccount.google.com ఓపెన్ చేయండి.. మీ Google ఖాతాతో లాగిన్ అవ్వండి.. Security (భద్రత) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. అక్కడ Your Devices / Manage Devices అనే విభాగాన్ని ఎంచుకోండి. ఇప్పుడు మీ ఖాతా లాగిన్ అయిన పరికరాల జాబితా కనిపిస్తుంది.

కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్.. 17 ఏళ్ల నిరీక్షణ ఫలించేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) కి రాజస్థాన్ రాయల్స్ (RR) కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. IPL తొలి ఎడిషన్‌లో టైటిల్ గెలుచుకున్న జట్టు, అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా కంటే ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ కే మొగ్గుచూపింది. ఫ్రాంచైజీ పరాగ్‌ను రెగ్యులర్ కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమైన సంజు సామ్సన్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గత సంవత్సరం సంజు సామ్సన్ గాయపడినప్పుడు అస్సాంకు చెందిన రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పుడు సంజు సామ్సన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి మారాడు. రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్ రాజస్థాన్ రాయల్స్‌లో చేరారు. 24 ఏళ్ల పరాగ్ గత సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎనిమిది మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లలో రాజస్థాన్ కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. ఆ మ్యాచ్‌లలో పరాగ్ 38.57 సగటుతో పరుగులు చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై అతను కెరీర్‌లో అత్యుత్తమ 95 పరుగులు చేశాడు. పరాగ్ కెప్టెన్సీలో, రాజస్థాన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్, కోచ్ ఇద్దరినీ మార్చింది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార్ సంగక్కర కోచ్‌గా నియమితులయ్యారు. గత సంవత్సరం, రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రియాన్ పరాగ్ 2019లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఏడు సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. రాజస్థాన్ 17 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేదు. ఫ్రాంచైజీ చివరిసారిగా 2008లో తన మొదటి సీజన్‌లో ట్రోఫీని దక్కించుకుంది.

భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌కు మరో గండం..
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ వరల్డ్ ఎదురుచూస్తోంది. ఈ నెల 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడబోతున్నారు. మొత్తం టోర్నీకే ఈ మ్యాచ్ హైలెట్‌గా నిలువనుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతంగా ఎదురుచూస్తు్న్నారు. భారత ఫ్యాన్స్ మరోసారి పాకిస్తాన్‌పై ఆధితప్యం చూపించాలని కోరుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థిపై ఉన్న రికార్డును కొనసాగించాలని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. Accuweather.com ప్రకారం, ఆదివారం కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పగటిపూట వర్షం పడే అవకాశం 93 శాతం, ఉరుములు మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం 26 శాతం ఉందని తెలిపింది. మొత్తం సుమారు 12.1 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. పాకిస్తాన్ బాయ్‌కాట్ నిర్ణయం తర్వాత యూ-టర్న్ తీసుకోవడంతో భారత్‌తో మ్యాచ్‌ మార్గం సుగమం అయింది. అన్ని అడ్డంకులు, వివాదాలు దాటిన తర్వాత వరణుడు అడ్డుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

AIతో సినిమా ప్లాన్‌ చేసిన స్టార్‌ డైరెక్టర్.. త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభం..
స్టార్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కృత్రిమ మేధస్సు (AI)తో సినిమా చేయాలనే ప్రణాళికను వెల్లడించారు. AIను ముప్పుగా కాకుండా సృజనాత్మక భాగస్వామిగా స్వీకరించాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే AIతో చెప్పాలనుకున్న కథ సిద్ధంగా ఉందని, 4–5 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ను త్వరలో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. AI ఒక గొప్ప సాధనం అవుతుందని, దీనితో ఇంతకు ముందు చేయలేని అనేక విషయాలు సాధ్యమవుతాయని చెప్పారు. పూర్తి స్థాయి AI సినిమా తీయడం సులభం కాదని, అది కూడా అంతే శ్రమతో కూడుకున్న ప్రక్రియ అని స్పష్టం చేశారు. ముందుగా చిన్న ప్రాజెక్ట్‌తో ప్రయోగాత్మకంగా ప్రారంభించి నేర్చుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హిరానీ మాట్లాడుతూ, “AI ఒక గొప్ప సాధనం కానుంది. దానితో త్వరలోనే స్నేహం చేయాలి. ఇది ఇక్కడే ఉంటుంది,” అని అన్నారు. పూర్తి స్థాయి AI సినిమా తీయడం సులభం కాదని, అది కూడా అంతే శ్రమతో కూడుకున్న ప్రక్రియ అని చెప్పారు. ముందుగా 4–5 నిమిషాల చిన్న సినిమా రూపొందించి, ఆ ప్రక్రియలో నేర్చుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. “నా దగ్గర చెప్పడానికి మంచి కథ ఉంది. ఆసక్తికరమైన ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుంది,” అని పేర్కొన్నారు.

మాస్ మహారాజాకు పవర్ ఫుల్ హిట్స్ ఇచ్చిన పవర్ స్టార్! ఎలాగో చూసేయండి..
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కాల్సిన మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి తెలుసా. అయితే ఆ సూపర్ హిట్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చేయలేదు. ఈ విషయాలను స్వయంగా పూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ వదులుకున్న రెండు చిత్రాలు.. రవితేజ దగ్గరికి వెళ్లి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌గా నిలిచాయని పూరి తెలిపారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి, వాటి వెనక ఉన్న కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ ఒక ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి మూడు సినిమాల కథలను ముందుగా పవన్ కళ్యాణ్‌ను వినిపించినట్లు తెలిపారు. “పవన్ కల్యాణ్ గారికి ఈ కథలు చెప్పినప్పుడు ఆయన చాలా ఎంజాయ్ చేశారు. సబ్జెక్టులు బాగున్నాయి అన్నారు కానీ, ఎందుకో అప్పుడు అవి పట్టాలెక్కలేదు. ఆయన ఈ కథలను వద్దని అనలేదు, కానీ చేయలేదు” అని తెలిపారు. పవన్ కల్యాణ్ వదులుకున్న ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజ వద్దకు వెళ్లాయని, అవి రవితేజ కెరీర్‌కు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. నిజానికి మాస్ మహారాజా రవితేజ స్టార్ కాకముందు నుంచి తనకు మంచి మిత్రుడని చెప్పారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే రవితేజ కచ్చితంగా స్టార్ అవుతాడని నమ్మేవాడిని, ఆ టైంలోనే రవితేజకు తనతో సినిమా చేస్తానని చెప్పే వాడినని అన్నారు. కానీ రవితేజ తన మాటలు నమ్మలేదని, అయితే ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కథలు రవితేజను ‘మాస్ మహారాజా’గా నిలబెట్టాయని గుర్తు చేశారు. ‘పోకిరి’ సినిమా విషయానికి వస్తే మహేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లో ప్రత్యేక సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version