మరో ముఖ్యమైన హామీ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్.. రేపే ఖాతాల్లో నిధులు జమ..!
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఓ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది సర్కార్.. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింప జేయనున్నారు.. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తారు.. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.. విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కాగా, సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం అమలుపై నిర్ణయం తీసుకుంది..
ఎయిర్‌పోర్టులపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా చేస్తామంటోన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్‌పోర్ట్) టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించండి అని కేంద్ర పౌర విమానయాన శాఖకు సూచించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం డిజైన్లు విభిన్నంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.. విజయవాడ విమానాశ్రయ పనుల పురోగతిపై ఆరా తీశారు.. నిర్దేశిత గడువులోగా టెర్మినల్ భవనం పూర్తి చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడ, విశాఖ సహా రాష్ట్రంలోని వివిధ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్‌గా పాల్గొన్నారు..
కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌ది కీలక పాత్ర.. జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది..!
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది చాలా కీలక పాత్ర.. పాలసీ మేకింగ్, వాగ్దానాల అమలు విషయంలో పవన్ కల్యాణ్ అన్నిటినీ సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. కూటమిలో జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది.. ప్రజలకోసం కూటమికి జనసేన ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు జనసేన పీఏసీ చైర్మన్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.. కూటమి ఏడాది పాలన పై NTVతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కొన్ని ఛాలెంజెస్ పాలనలో ఉన్నాయి.. గతంలో వ్యవస్థలను దుర్వినియోగం చేసి అర్చక పాలన చేశారు.. గాడితప్పిన వ్యవస్థను సెట్ చేస్తూ.. ప్రజల కోసం అంకితభావంతో పనిచేయడానికి కొంత సమయం పడుతుందన్నారు.. ఆర్థికంగా రాష్ట్రం చాలా దెబ్బతింది. ఎప్పుడూ లేనివిధంగా అప్పులు, ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.. ఇవి అన్ని అధిగమించి సంక్షేమం చేస్తున్నాం.. ఇప్పుడు జాగ్రత్తగా, పద్ధతిగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిని కలిపి ముందుకు వెళ్తున్నాం. టీమ్ వర్క్‌తో సవాళ్ల మధ్య కూడా స్మూత్ గవర్నెన్స్ కొనసాగుతోందని తెలిపారు.
నేను బీఆర్ఎస్ పార్టీని వీడడానికి కారణం అదే!
ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు తప్పించుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదని, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయిన బాధ్యుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ బ్లండర్ కాళేశ్వరం అని, కాళేశ్వరంలో అవినీతి జరిగినా ప్రాజెక్ట్ కూడా మిగలలేదు అని ఎద్దేవా చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కాళేశ్వరం కూడా ఓ కారణం అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరి దాన్యం దిగుబడి పెరగలేదు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అన్ని విధాలుగా తప్పు. మేడిగడ్డను బ్యారేజ్‌గా కాకుండా.. డ్యాంగా వాడుకోవడం వల్లనే దెబ్బతింది. అప్పుడు కాళేశ్వరంపై గొప్పలు చెప్పుకుని.. ఇప్పుడు కేసీఆర్ తప్పించుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వయం ప్రత్యక్షం అయిందా?. గవర్నర్ కేసీఆర్ గారిని కాళేశ్వర్ రావు అని పిలిచారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రైతు ప్రతి ఏడాది 91 వేలు రూపాయలు లబ్ధి పొందుతున్నారు. బీజేపీ ఎంపీలు వేస్ట్ అని ఆరోపిస్తున్నారు. తెలంగాణను ఆదుకుంటుంది కేంద్రం. నవోదయ స్కూల్స్, టూరిజం నిధులు, పీఎం శ్రీ, పీఎం కుసుమ్ పథకం కింద మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చాయి’ అని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
“నా చెల్లిని ఉరితీయాలి”.. సోనమ్ సోదరుడి డిమాండ్..
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో భర్త రాజా రఘువంశీని చంపినట్లు ఆయన భర్త సోమన్ రఘువంశీ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజా మే 23 నుంచి కనిపించకుండాపోయారు. చివరకు జూన్ 02న మేఘాలయ కాసీ హిల్స్‌లో మృతదేహంగా దొరికాడు. విచారణలో భార్య సోనమ్, ఆమె లవర్ రాజ్ కుష్వాహా మర్డర్‌కి ప్లాన్ చేసినట్లు తేలింది. ముగ్గురు కిరాయి హంతకులు హత్యకు పాల్పడ్డారు. చివరకు, సోనమ్ జూన్ 08న పోలీసులు ముందు లొంగిపోయింది. అయితే, సోనమ్ ని తమ కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నామని, ఇకపై ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె సోదరుడు గోవింద్ అన్నారు. ఆమె దోషి, ఆమెను ఉరితీయాలని ఆమె కుటుంబం కోరుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం, ఇండోర్‌లోని సోమన్ అత్తమామల ఇంటికి వెళ్లిన గోవింద్, రాజా రఘువంశీ తల్లిదండ్రుల్ని ఓదార్చారు.
“పాకిస్తాన్ ఒక అద్భుత భాగస్వామి”.. అమెరికా నిజ స్వరూపం ఇదే..
అమెరికాకు భారత్, పాకిస్తాన్ ఒకటే అని చెప్పకనే చెప్పింది. అమెరికు చెందిన ఒక టాప్ జనరల్ మాట్లాడుతూ.. వాషింగ్టన్‌కు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై అమెరికా పోరాటానికి ఆ ప్రాంతంలో భాగస్వామిగా పాకిస్తాన్ ఖచ్చితంగా అవసరమని అన్నారు. అమెరికా పాకిస్తాన్‌తో, భారత్‌తో సంబంధాలను కలిగి ఉండాలని, మనకు భారతదేశంతో సంబంధం ఉంటే, పాకిస్తాన్‌తో లేదని నేను నమ్మనని, దానికి ఉన్న సానుకూలత ఆధారంగా సంబంధాల ప్రయోజనాలను మనం చూడాలని అన్నారు. హౌస్ ఆర్మ్ఢ్ సర్వీసెస్ కమిటీలో జరిగిన సమావేశం సందర్భంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ మైఖేల్ కురిల్లా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పాకిస్తాన్ ‘‘ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు’’ ఈ ప్రాంతంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని ప్రశంసించారు. పాకిస్తాన్ ను ‘‘అద్భుత భాగస్వామి’’ అని వర్ణిస్తూనే, వాషింగ్టన్ అందించిన పరిమిత నిఘా సహాయంలో ఐఎస్ఐఎస్-ఖొరాసన్ కు వ్యతిరేకంగా చురుకైన ఉగ్రవాద పోరాటం చేసిందని పాకిస్తాన్‌ని కొనియాడారు.
“రేర్ ఎర్త్ మెటీరియల్స్”పై చైనాతో డీల్ పూర్తయింది..
వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా, చైనాల మధ్య ముందస్తుగా రేర్ ఎర్త్ మెటీరియల్, చైనా విద్యార్థులకు వీసాలపై డీల్ పూర్తయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ట్రూత్ సోషల్ పోస్టులో.. బీజింగ్ అమెరికాకు అయస్కాంతాలు, కావాల్సిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరా చేస్తుందని, బదులుగా అమెరికా చైనీస్ స్టూడెంట్స్‌కి యూఎస్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు. యూఎస్ 55 శాతం సుంకాలను, చైనా 10 శాతం సుంకాలను పొందుతుందని, ఈ సంబంధం అద్భుతంగా ఉందని ఆయన తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. మే నెలలో కీలకమై రేర్ ఎర్త్ మెటీరియల్ కారణంగా ఇరు దేశాల మధ్య సుంకాల సంధి పట్టాలు తప్పింది. దీని తర్వాత ఇరు దేశాల మళ్లీ చర్చలు ప్రారంభించాయి. దీని తర్వాత చైనా అరుదైన ఖనిజాలపై చైనా ఎగుమతి పరిమితుల్ని తొలగించడానికి అంగీకరించింది.
గంభీర్ స్పెషల్ ట్రైనింగ్.. అందరి టార్గెట్ ఒక్కడే!
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. శుభ్‌మాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ గెలవడం కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు చాలా అవసరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి WTC ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది. దాంతర్వాత భారత్ ఆడబోయే టెస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇంగ్లాండ్ టెస్ట్ గంభీర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. నెట్స్‌లో ఆటగాళ్లకు కఠోర శిక్షణనిస్తున్నాడు. ఈ సెషన్ లో గంభీర్, రిషబ్ పంత్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంగ్లాండ్ పై రిషబ్ పంత్ కు మంచి ట్రాక్ రికార్డుంది. ఇంగ్లాండ్ తో ఆడిన 12 మ్యాచ్‌లు, 21 ఇన్నింగ్స్‌లలో 781 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ,4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ పిచ్ లపై పంత్ కు మంచి అవగాహన ఉంది. పైగా ఈ సిరీస్ లో సీనియర్ ప్లేయర్లు లేకపోవడంతో జట్టు విజయ అవకాశాలు పంత్ పైనే ఆధారపడి ఉన్నాయి.
MAAతో కలిసి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ఆపరేషన్ సంకల్ప్’
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సహకారంతో ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB), మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , మరియు సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించబడింది. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి TGANB డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్యా గారు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి గారు, TGANB ఎస్పీ శ్రీ పి. సీతారామ, మరియు డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (DEPWD) డైరెక్టర్ శ్రీమతి శైలజ గారు వంటి ప్రముఖులు హాజరు అయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే మా లక్ష్యం దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అని ఆపరేషన్ సంకల్ప్ టీం చెబుతోంది.
బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అంబాసిడర్ గా ఉపాసన
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం ఉంటుంది. ఇది మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ మహిళలు భయపడకుండా, గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక. ఈ రోజు మనం ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టుతున్నాం. టెక్నాలజీని సాధారణ మహిళల జీవితాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను ఒక ఉద్యమంగా మార్చే మొదటి అడుగు ఇది. భారత్‌లో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతోంది. ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. భారత మహిళల్లో 50 శాతం మందికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ లేటు స్టేజ్ గుర్తించబడుతుంది. ఇది ముఖ్యంగా స్క్రీనింగ్ తగిన సేవలు లేని సముదాయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా ట్రైన్డ్ హెల్త్‌కేర్ వర్కర్లు ఇప్పుడు నేరుగా మహిళల వద్దకు వెళ్లనున్నారు.