రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్పందించిన జగన్.. సంచలన వ్యాఖ్యలు..
రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా సాగుతూ వస్తోంది.. కొన్ని సార్లు మంత్రులు.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీయడం.. అధికారులు.. వ్యవస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, రేషన్ బియ్యం అంశంపై స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంలో మంత్రులు వాళ్లవాల్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్‌పోస్టులు వాళ్లు పెట్టినవే .. పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే.. కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు.. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారు.. కానీ, ఆ షిప్ దగ్గరకు మాత్రం వెళ్లలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు..
వాట్సాప్ ద్వారా 153 సేవలు.. కార్యాచరణ సిద్ధం చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పౌర సేవల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. వారికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా.. వాట్సాప్ ద్వారానే ఏకంగా 153 సేవలను అందించేందుకు సిద్ధమైంది.. వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. వెబ్ సైట్ ద్వారా ఇక నుంచి ప్రభుత్వ సమాచారం వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆయన.. జనన, మరణ, ధృవీకరణ పత్రాల లాంటివి జారీ చేయటానికి అనుసరిస్తున్న విధానాన్ని రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందన్నారు.. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరి చేస్తున్నాం అని వివరించారు.. విధానాలను సగం నుంచి డిజిటలైజ్ చేయటం కాకుండా పూర్తిగా వాటి ప్రాసెస్ ను రీ-ఇంజనీరింగ్ చేయాల్సి ఉందన్నారు.. ప్రస్తుతం ప్రపంచంలో యూఏఈ మాత్రమే ఒకే ప్లాట్ ఫాంపై పౌర సేవలు అందిస్తోంది.. ప్రభుత్వ సమాచారం ఒకే చోట ఉండేలా apgov.in వెబ్ సైట్ లో పొందు పరుస్తాం.. ఇక, 153 పౌర సేవలు వాట్సప్ ద్వారా ఇచ్చేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేశామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వివరించారు మంత్రి నారా లోకేష్..
2024-29 ఏపీ మారిటైమ్ పాలసీ విడుదల.. అసలు టార్గెట్ అదే..
2024-29 ఏపీ మారిటైమ్ పాలసీని విడుదల చేసింది ప్రభుత్వం.. మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్.. రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన విధానం రూపొందించింది ప్రభుత్వం.. ఏపీ మారిటైమ్ విజన్ ను ఆవిష్కరించటంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానం తయారు చేసింది ప్రభుత్వం. సుదీర్ఘమైన తీరప్రాంతం, వ్యూహాత్మకంగా అనువైన ప్రాంతాన్ని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించేలా విధాన రూపకల్పన చేశారు.. 2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వేగా ఏపీని మార్చేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించారు.. ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు కల్పించేలా విధానాన్ని తయారు చేసింది సర్కార్.
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ పరీక్ష అంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ (ఎక్స్)లో టెన్త్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. 2025 మార్చి 17వ తేదీ నుంచి 31 తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.. SSC విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్! మార్చి 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. మీరు మెరుగ్గా ప్రిపేర్ అవ్వడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మేం ప్రత్యామ్నాయ రోజులలో పరీక్షలను ప్లాన్ చేశాము.. ఈ అదనపు సమయాన్ని చదువుకోవడానికి మరియు అద్భుతమైన స్కోర్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించుకోండి! అని సూచిస్తూ.. నా సోదరులు మరియు సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.. తెలిపారు మంత్రి నారా లోకేష్..
హెల్మెట్ తప్పనిసరి నిబంధనపై నిర్లక్ష్యం..! పోలీసులపై హైకోర్టు అసహనం..
ఆంధ్రప్రదేశ్‌లో హెల్మెట్ల తప్పనిసరిగా ధరించటాన్ని పోలీసులు అమలు చేయకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవటంలేదని.. అసలు పట్టించుకోవడంలేదన్నారు న్యాయమూర్తి.. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 667 మంది హెల్మెట్ ధరించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది హైకోర్టు.. అసలు, ఎందుకు హెల్మెట్లను ధరించే నిబంధన అమలు చేయటంలేదని పోలీసులను నిలదీసింది.. అయితే, ట్రాఫిక్ విభాగంలో 8 వేల మందికి సిబ్బంది అవసరం ఉండగా.. కేవలం 1,800 మంది మాత్రమే ఉన్నారనికోర్టుకు తెలిపారు పోలీసులు.. అంతేకాదు.. ఫైన్లు వేసినా కట్టడం లేదని హైకోర్టుకు విన్నవించారు.. ఇక, రవాణా శాఖ కమిషనర్ ను సుమోటోగా ఇంప్లీడ్ చేసింది ఏపీ హైకోర్టు.. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది..
పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్.. సీఎం కీలక ఆదేశాలు
పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ అక్రమ రవాణాను సీరియస్‌గా తీసుకుంటున్నాం అన్నారు.. రీసైక్లింగ్ నుంచి స్మగ్లింగ్ కు దారి తీస్తుందన్నారు.. పీడీఎస్ స్మగ్లింగ్ పైన డీ&ఎస్ కింద సెక్షన 301 కిందకు తెచ్చాం.. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ ఆపేయాలని స్పష్టం చేశారు… పీడీఎస్ స్మగ్లింగ్ పైన పీడీ యాక్టు తీసుకురావాలి.. రెగ్యలర్ రైస్, పీడీఎస్ రైస్ లను కలిపి అమ్మేస్తున్నారనేది ఒక వాదనగా ఉందన్నారు.. ఝార్ఖండ్ నుంచి కూడా పీడీఎస్ వస్తోంది.. పీడీఎస్ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, కూకటివేళ్లతో సహా పీడీఎస్ రైస్ మాఫియాను లేకుండా చేయాలి.. ప్రజలు తినే బియ్యాన్నే అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి పయ్యావుల.. వేరే దేశాల నుంచి కూడా పీడీఎస్ రాకూడదని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..
రాహుల్‌కు కేటీఆర్ లేఖ..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేసారు. ఆయన రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖలో కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో ప్రతివర్గాలకు ముప్పు తెస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతుల నుండి మహిళల వరకు అన్ని వర్గాలు కాంగ్రెస్ సర్కార్ వల్ల అరిగోస పడుతోందని చెప్పారు. ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పయనంలో రాష్ట్రం దిగజారిపోయిందని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నేతలు పట్టించుకోకుండా ఢిల్లీకి, ప్రభుత్వ అధికారులకు శ్రద్ధ చూపిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, తెలంగాణ పునర్నిర్మాణంపై బీఆర్‌ఎస్ గత పదేళ్లుగా సమర్థంగా పని చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో, మోసంతో నిండిపోయి, నియంతృత్వ విధానాలను అవలంబిస్తోందని చెబుతున్నారు. ఆయన, కాంగ్రెస్ దుష్ప్రచారంతో మాత్రమే అస్తిత్వం పోగొట్టుకొన్న నాయకులుగా, రేవంత్ రెడ్డిలాంటి నేతలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను మరచిపోయి, దారుణమైన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డికి ప్రతిస్పందనగా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చెరగిపోతుందని, ప్రజలు ఈ విధానాన్ని మన్నించబోరని హెచ్చరించారు. ఆయన, కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన రాజకీయాలు, పాత వ్యవస్థను కొనసాగించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.
మత ప్రచారం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మత ప్రచారం చేస్తూ పట్టుబడ్డాడు. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు బైబిల్లు పంచిపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ నాయకులు సదరు ప్రభుత్వ ఉద్యోగి బండారాన్ని బయటపెట్టారు. ఈ మేరకు బీజేపీ నేతలు సదరు ఉపాధ్యాయుడిపై ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు.. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు బైబిల్లను పంపిణీ చేశాడు. విద్యార్థిని, విద్యార్థులకు బైబిళ్లు పంచారు అన్న సమాచారం అందుకున్న స్థానిక బిజెపి పార్టీ నాయకులు.. బైబిల్ల ను విద్యార్థుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయ గదిలో ఉన్న మరో బైబిల్ల ప్యాకింగ్ ను స్వాధీనం చేసుకొని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగాల రాజుపై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు కోరారు.
భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య.. వరకట్న చట్టాలపై చర్యలకు లాయర్ల డిమాండ్..
బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్యతో పాటు ఆమె కుటుంబం వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నారు. తాను నిర్దోషినని అయినా కూడా న్యాయవ్యవస్థ ఆమెకే అనుకూలంగా ఉందని చెబుతూ 20 పేజీల లేఖ రాయడంతో పాటు 80 నిమిషాల వీడియోలో తాను అనుభవించిన వేధింపులను చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ కేసు నేపథ్యంలో వరకట్న వేధింపులకు సంబంధించి సెక్షన్ 498A దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాలని పలువురు లాయర్లతో పాటు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. లాయర్ అడ్వకేట్ వికాస్ పహ్వా బుధవారం ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని కోరారు. మూడు దశాబ్ధాలుగా క్రిమినల్ లాయర్‌గా గుర్తింపు పొందిన పహ్వా మాట్లాడుతూ.. కొందరు వ్యక్తిగతంగా సెక్షన్ 498A దుర్వినియోగం చేయడాన్ని తాను చూశానని చెప్పారు. వరకట్న వేధింపులకు సంబంధించిన వాస్తవ ఉదంతాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా సమస్యలు పరిష్కరించాలని భర్త, అతడి కుటుంబాలపై ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు నిరాధారమైనవి ఉన్నాయని, చట్టాన్ని తప్పుగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
ఢిల్లీ పీఠంపై ఆశ లేదు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం
ఇండియూ కూటమిలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా నాయకత్వ మార్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి నాయకురాలిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నియమించాలంటూ కూటమిలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలు దాదాపుగా ఇదే డిమాండ్‌ను చేస్తున్నాయి. మిత్రపక్షాల డిమాండ్‌ను కాంగ్రెస్ మాత్రం తోసిపుచ్చుతోంది. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలో బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే మమత వలనే సాధ్యమవుతుందని ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు డిమాండ్ చేస్తు్న్నాయి. అయితే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బెంగాల్‌లలో మమత బీజేపీని ఓడించగలిగారు గానీ.. దేశ వ్యాప్తంగా ఆమె ప్రభావం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో అయోమయం గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమబెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడారు. ఇండియా కూటమిలో నాయకత్వ మార్పు గురించి చర్చించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన నాయకత్వం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. వారంతా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని.. వారి పార్టీ కూడా బాగుండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే తనకు ఢిల్లీ కుర్చీపై ఆశలేదని.. కేవలం బీజేపీని ఓడించేందుకు ప్రత్యామ్నాయ వేదికగా ఉంటానని పేర్కొన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని.. కాబట్టి దాన్ని సరిగ్గా నడపాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఏటీఎంతో విత్‌డ్రా!
పీఎఫ్ ఖాతాదారులకు కార్మికశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నగదు విత్‌డ్రాను మరింత సులభతరం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీఎఫ్ కస్టమర్లు ఇకపై ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు లేబర్ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు. జనవరి, 2025 నుంచి ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారు, బీమా చందాదారులు ఏటీఎంల ద్వారా క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సుమితా దావ్రా పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. క్లెయిమ్‌లు వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం అని చెప్పారు. ఏటీఎంల ద్వారా చందాదారులు, లబ్ధిదారులు ఈ నగదును సులభంగా తీసుకోవచ్చన్నారు.
విదర్భ బౌలర్లను ఊచకోత కోసిన అజింక్య రహానే.. సెమిస్‌లోకి దూసుకెళ్లిన ముంబై
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ముంబై, విదర్భ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్‌లో అభిమానులు మరోసారి అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌ను ఆస్వాదించారు. అయితే, స్టార్ ప్లేయర్లతో అలరించిన ముంబై జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు చేరిన మూడు జట్లను ఖరారు అయ్యాయి. ముంబై కంటే ముందు బరోడా, మధ్యప్రదేశ్ కూడా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లో ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. అథర్వ టైడే అత్యధికంగా 66 పరుగులు చేశాడు. అలాగే, అపూర్వ వాంఖడే 33 బంతుల్లో 51 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో శుభమ్ దూబే 19 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ముంబై తరఫున అథర్వ అంకోలేకర్, సూర్యాంశ్ షెడ్గే చెరో 2 వికెట్లు తీశారు.
చైనాలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న’మహారాజా’
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది మహారాజా. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ప్రశంసలతో పాటు భారీగా కాసులను వెనకేసుకుంది. జస్ట్ 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సుమారు 170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టుకుంది. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ టాప్ నాచ్. బార్బర్‌గా, సగటు తండ్రిగా ఆయన యాక్టింగ్ సింప్లీ, సూపర్బ్. స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ కావడంతో నాట్ ఓన్లీ తమిళ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు కూడా బొమ్మను హిట్ చేశారు. ఈ సినిమాను కర్మ అండ్ రిట్రీబ్యూషన్ పేరుతో చైనాలో రిలీజ్ చేస్తే అక్కడి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. మౌత్ టాక్‌తో దూసుకెళ్లిపోతుంది. నవంబర్ 29న 40 వేల స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ జస్ట్ పది రోజుల్లోనే 55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. 12 రోజుల్లో సుమారు 70 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. చైనాలో ఈ రేంజ్ కలెక్షన్స్ ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాకు దక్కలేదు. 2018లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తర్వాత హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ చిత్రంగా మహారాజా నిలిచింది. ఇక చైనా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 13వ చిత్రంగా రికార్డులు సృష్టించింది. అంతేకాదు తమిళ ఇండస్ట్రీ నుండి హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన తొలి చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. గతంలో మెర్సల్, రోబో లాంటి సినిమాలు ఈ మేర ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రేర్ రికార్డు మక్కల్ సెల్వన్ సృష్టించినట్లయ్యింది. చైనా మార్కెట్‌లో కోలీవుడ్ సత్తా చాటి.. మరిన్ని ఇండియన్ సినిమాలకు మార్గం చూపించినట్లయ్యింది.
హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్
అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 రిలీజ్ నేపథ్యంలో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో అల్లు అర్జున్ ను చూసేందుకు సంధ్య థియేటర్ కు అభిమానులు భారీగా తరలివచ్చిన క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) మృతి చెందగా ఆమె కుమారడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేసు నమోదు చేసిన చిక్కడ్‌పల్లి పోలీసులు అందుకు కారకులైన చిత్ర హీరో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంఫై కేసులు నమోదు చేసారు. కాగా అల్లు అర్జున్ పై నమోదయిన కేసులో హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ దాఖలు చేసాడు. తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటీషన్‌లో కోరిన అల్లు అర్జున్. ఆ రోజు జరిగిన అవాంఛనీయ ఘటనపట్ల అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం స్పందిస్తూ వారి కుటుంబానికి తమను అండగా ఉంటాను అని కూడా హామీ ఇచ్చాడు. అల్లుఅర్జున్ కేసులో ఏ విధమైన తీర్పు వస్తుందోనని అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంట నెలకొంది.