నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్‌వీ-డీ2
ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంతో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2ని ఇవాళ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగి ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి ప్రయోగించనున్నారు.. గత ఏడాది ఆగస్టు 7న ప్రయోగత్మకంగా నిర్మించి ప్రయోగించిన మొదటి ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్ సాంకేతిక సమస్య వలన సరైన కక్షలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది ఇస్త్రో.. అయితే, లోపాలను సరిదిద్దిన తర్వాత ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ ను రూపొందించారు శాస్ర్తవేత్తలు.. అడ్వాన్స్ టెక్నాలజీతో వున్నా ఈ రాకెట్ ద్వారా మనదేశానికి సంబందించిన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-02 తోపాటు మరో రెండు చిన్న ఉపాగ్రహాలను భూమధ్య రేఖకి 450 కిలోమీటర్లు ఎత్తులోని భూ వృతకార కక్షలోనికి ప్రవేశపెట్టనున్నారు.. ఇక, శ్రీహరిలో షార్‌లో రాకెట్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ప్రయోగం విజయవంతమైతే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే దేశంగా భారత్ సరికొత్త రికార్డు నమోదు చేయనుంది.. రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం EOS-07, దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించిన 8.7కిలోల బరువు గల ఆజాదీశాట్-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్-01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో.
నేడు సీబీఐ కోర్టు ముందుకు నిందితులు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.. దీనికోసం కడప జైల్‌లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు.. నిందితులను నాలుగు వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు.. ఇక, ఉదయం 10:30 గంటలకు ఈ ముగ్గురు నిందితులు తోపాటు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కూడా సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేకా కేసు విచారణ కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో.. తొలిసారిగా వివేక హత్య కేసులోని ఐదుగురు నిందితులు ఇవాళ సీబీఐ కోర్టు ముందు హాజరు కానున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ప్రక్రియ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ప్రారంభించిన నేపథ్యంలో ఐదుగురు నిందితులను న్యాయమూర్తి ప్రత్యక్షంగా, కోర్టులో భౌతికంగా చూడన్నారు. తదుపరి న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ముగ్గురు నిందితులైన సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను తిరిగి కడప జైలుకు తీసుకెళ్తారా? లేక హైదరాబాద్‌లోని మరో జైలుకు తరలిస్తారా? అనేది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిందితులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సమాచారంతో గురువారం సాయంత్రమే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన భార్య తులసమ్మ, కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి శివశంకర్ రెడ్డిని కలిశారు.. శివశంకర్ రెడ్డి అనుచరులు కూడా చాలామంది హైదరాబాద్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది..
వారికి గుడ్‌న్యూస్.. ఇవాళే ఖాతాల్లోకి డబ్బులు
మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించబోతోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్… వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధం అయ్యింది.. ఇవాళ బటన్ నొక్కి ఆ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. గతేడాది అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య వివాహాలు చేసుకుని.. అర్హత ఉన్న వివిధ వర్గాలకు చెందిన యువతులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.. అక్టోబర్ – డిసెంబర్ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ, ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఈ ఆర్ధిక సాయం అందిస్తున్నారు.
గోడదూకిన రేవంత్ రెడ్డి.. అందరూ షాక్..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో పాదయాత్ర చేస్తున్నారు. సంఘిన సంక్షేమ గురుకుల పాఠశాలకు గోడ దూకి వెళ్లారు. ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. విద్యార్థులు రేవంత్ రెడ్డి గోడ దూకి రావడం చూసి ఆనందం ఆకాశాన్నంటాయి. వారిని కలవడానికి గోడదూకి రావడంతో షాక్ కు గరయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వికలాంగుడైన బాల ఇంటికి వెళ్లి ఎల్లంపేట స్టేజీ తండాలో రేవంత్ రెడ్డిని కలిశారు. నడవలేని, మాట్లాడలేని 21 ఏళ్ల వికలాంగ బాలుడు తన తల్లి సంరక్షణలో ఉన్నాడు. బాలు తండ్రి చనిపోయాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బాలు తల్లి భూక్య తులసి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వితంతు పింఛన్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి రూ.10 వేల సాయం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాజాగా ప్రగతి భవన్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై మరోసారి హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మియాపూర్‌లో ఎమ్మెల్సీ కవితకు 500 కోట్ల భూమి ఎలా వచ్చిందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌కు భూమి కేటాయించారని ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రభుత్వ భూములను కేటీఆర్, బీఆర్‌ఎస్ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు.ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. నిషేధిత జాబితాలోని భూములను ఆ జాబితా నుంచి తొలగించి బదిలీ చేసిన వారి పేర్లను వెల్లడించాలి. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు.
40 దేశాలపై చైనా బెలూన్‌తో నిఘా.. లిస్టులో భారత్, జపాన్
అమెరికా, చైనాల మధ్య స్పై బెలూన్ వివాదం నడుస్తూనే ఉంది. చైనా బెలూన్ సాయంతో పలు దేశాలపై గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. చైనా ఆర్మీ ఏకంగా బెలూన్ ప్లీట్ ను నిర్వహిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కనిపించింది. దీన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. దీనిపై ప్రస్తుతం అక్కడి అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. బెలూన్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఏ శాటిలైట్ తో ఈ బెలూన్ కనెక్ట్ అయి ఉందనే వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే చైనా ఈ బెలూన్ల సహాయంతో 5 ఖండాల్లో 40 దేశాలపై నిగా పెట్టినట్లు అమెరికన్ అధికారి వెల్లడించారు. బెలూన్ తయారీదారులు చైనా సైన్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారని యూఎస్ఏ భావిస్తోంది. అయితే చైనా మాత్రం వాతావరణ పరిశోధన కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకుంది. అమెరికా ఆరోపణలను చైనా తోసిపుచ్చుతోంది.
టర్కీ భూకంపంలో 21 వేలకు చేరిన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
టర్కీ, సిరియా భూకంపంలో అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చాయి. ఏకంగా 1000కి మించి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీ, సిరియాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం 21,051 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. సహాయకచర్యల్లో అత్యంత కీలకమైన మూడు రోజులు గడిచిపోవడంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. 1939 తర్వాత టర్కీలో వచ్చిన భారీ భూకంపం ఇదే. టర్కీ దక్షిణ ప్రాంతం భూకంపానికి తీవ్రంగా ప్రభావితం అయింది. ఓ అంచనా ప్రకారం టర్కీ దక్షిణ ప్రాంతం కోలుకునేందుకు 20 ఏళ్లు పట్టనుంది. ఈ భూకంపం వల్ల దాదాపుగా 2 కోట్లకు పైగా మంది ప్రభావితం అవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచానా వేసింది. భూకంప ధాటికి టర్కీ భూభాగం 5-6 మీటర్లు పక్కకు జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు టర్కీకి ప్రపంచం నుంచి సాయం అందుతోంది. ఇప్పటికే భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది. రెస్క్యూ సిబ్బందితో పాటు వైద్య సహాయాన్ని టర్కీకి అందించింది. టర్కీకి 1.78 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందజేస్తామని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అమెరికా 85 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్లుగా ప్రకటించింది.
లేఆఫ్ ప్రకటించనున్న యాహూ.. 20 శాతం ఉద్యోగులకు ఉద్వాసన
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం నడుస్తూనే ఉంది. రోజుకో టెక్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అని ఐటీ ఉద్యోగులు గుబులు పడిపోతున్నారు. ఉన్నపలంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ఉద్యోగులు. ఇప్పటికే టెక్ దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ లు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలతోనే ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతోనే కంపెనీలు ఇలా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ జాబితాలో మరో టెక్ కంపెనీ చేరింది. యాహూ తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా తన ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువమందిని తొలగించాలని అనుకుంటోందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ తొలగింపు వల్ల యాహూ యాడ్ టెక్ ఉద్యోగుల్లో 50 శాతం మందిపై అంటే దాదాపుగా 1600 కంటే ఎక్కువ మంది ప్రభావితం కానున్నారు.