రేపటి నుంచి గూడ్స్ రవాణా బంద్.. లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు
ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 9వ తేదీ నుంచి అంటే.. రేపటి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.. టెస్టింగ్, ఫిట్‌నెస్ చార్జీలు తగ్గించాలని ఆందోళనకు దిగుతోంది.. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్‌నెస్ ఫీజులు పెంపు విరమించాలని బంద్‌కు పిలుపునిచ్చింది.. కేంద్ర ప్రభుత్వం పెంచిన లారీ టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులను వెంటనే తగ్గించకపోతే 12 ఏళ్లు దాటిన వాహనాలన్నింటినీ రోడ్లపైకి రానీయకుండా ఆపేసే పరిస్థితి వస్తుందని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు హెచ్చరించారు. 20 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్‌నెస్ ఫీజును కేంద్రం ఒక్కసారిగా రూ.33,040కు పెంచింది.. 12 ఏళ్లు దాటిన లారీలకు కూడా భారీగా రుసుములు పెరగడంతో వాహన యజమానులు నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈశ్వరరావు.. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్రం తప్పనిసరిగా అమలు చేయాలి అనే నిబంధన లేదని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై చొరవ తీసుకుని ఉపశమనం కల్పించాలి డిమాండ్ చేశారు.. ఫిటెనెస్ ఫీజులను తగ్గించకుంటే ఈ నెల 9 నుంచి నిరసన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆందోళన భాగంగా సరకు రవాణా, రైల్వే గూడ్స్‌షెడ్లు, షిప్‌యార్డ్స్‌లో నడిచే దాదాపు 10 వేల వాహనాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా సరకు రవాణాపై తీవ్రంగా పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు..
కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం.. మంగళగిరిలో ఉద్రిక్తత..
గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళగిరి యాదవపాలెంలో కృష్ణుడి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం తనదేనంటూ మునగపాటి వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లారు.. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కృష్ణుడి విగ్రహం తొలగించాలని ఆదేశించింది. ఇక, కోర్టు ఆదేశాలతో మంగళగిరి మున్సిపల్ సిబ్బంది వచ్చారు. ఇదే సమయంలో యాదవ సంఘాల నేతలు అక్కడకు చేరుకున్నారు. విగ్రహం తొలగిస్తే మరోచోట ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘాల నేతలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాలున్నాయని అధికారులు చెప్పారు. కొంత సమయం ఇస్తే తామే తొలగిస్తామని యాదవ సంఘం నేతలు కోరారు. విగ్రహం తొలిగించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.
నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్ షురూ.. తొలి రోజు షెడ్యూల్ ఇదే..
రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ఈరోజు (డిసెంబర్ 8) మధ్యాహ్నం 1.30కు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12.30కు ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. 1:30 కు వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను వివరిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3 వేల మంది ఇందులో పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందంతో విడివిడిగా సమావేశమవుతారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం కలుసుకుంటారు. ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్. ఐకియా ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ MSME, ఎలక్ట్రానిక్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ రంగ ప్రతినిధులు, SIDBI, వరల్డ్ బ్యాంక్, వెస్ట్రన్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు, వంతార, VinGroup ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాయబారులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు..
పార్లమెంట్‌లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1 న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ఇక సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని మోడీ ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లో చర్చ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ‘వందేమాతరం’లోని అనేక ముఖ్యమైన విషయాలను హైలైట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 1937లో వందేమాతం గీతంలోని కీలకమైన చరణాలను తొలగించిందని.. విభజనకు బీజాలు వేసిందని ఆరోపించారు. తాజాగా మరోసారి లోక్‌సభ వేదికగా హస్తం పార్టీని లక్ష్యంగా చేసుకోవచ్చని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై 10 గంటలు చర్చకు కేటాయించబడింది. ప్రధాని మోడీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. అనంతరం గౌరవ్ గొగోయ్, ప్రయాంకాగాంధీతో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రసంగించనున్నారు. ఇక రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు.
హమాస్- లష్కరే తోయిబా మధ్య సంబంధాలు.. ఉగ్రవాద సంస్థగా భారత్ ప్రకటించాలి..
హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ఇటీవల భారత్‌ను అధికారికంగా కోరింది. హమాస్- లష్కరే తోయిబా (LeT) మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది. తాము ఇప్పటికే లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థ జాబితాలో చేర్చినందున, భారత్ కూడా ఇదే విధంగా స్పందించి హమాస్ ని తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని పేర్కొనింది. న్యూఢిల్లీ తీసుకునే నిర్ణయం దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే, హమాస్- లష్కరే తోయిబా వంటి గ్రూపుల వ్యవస్థలు, నెట్‌వర్క్‌లు, వాటి అనుసంధానాలపై భారత ప్రభుత్వం స్పష్టమైన అవగాహన కలిగి ఉందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ సంస్థలను ఉగ్రవాద గ్రూపులుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొనింది. అలాగే, ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (IRGC), హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయడానికి అంతర్జాతీయ నేరగాళ్ల నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయని టెల్ అవివ్ ఆరోపించింది. ప్రత్యక్షంగా దాడులు చేయకుండా, డ్రగ్ మాఫియా, మానవ అక్రమ రవాణాదారులు లాంటి నేరగాళ్లను ఉపయోగించి దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు ప్రధాన బ్యాంకులు..
రేపో రేటు మరోసారి తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది.. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది, రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే కస్టమర్లకు ఉపశమనం కలిగించేది. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. అయితే, ఆర్బీఐ ప్రకటన తర్వాత, ఐదు ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.. బ్యాంకుల నిర్ణయం ద్వారా వడ్డీ రేట్లు మరింత చౌకగా మారాయి. వీటిలో ఐదు ప్రధాన బ్యాంకులు ఉన్నాయి.. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే.. కొన్ని ప్రముఖ బ్యాంకులు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి.. రెపో రేటు తగ్గింపు తర్వాత వెంటనే , బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లింక్డ్ లెండింగ్ రేటు (RBLR)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది, అంటే 8.35 శాతం నుండి 8.10 శాతానికి. కొత్త రేట్లు డిసెంబర్ 5 నుండి అమల్లోకి వచ్చాయి. రెపో-లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (RBLR)ను 8.20 శాతం నుండి 7.95 శాతానికి తగ్గించింది. అదనంగా, ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు డిసెంబర్ 6 నుండి అమలులోకి వస్తాయి. BoB రెపో ఆధారిత రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది, దీనితో ఈ భాగం 8.15 శాతం నుండి 7.90 శాతానికి తగ్గింది. డిసెంబర్ 6 నుండి అమలులోకి వచ్చేలా ఈ కొత్త వడ్డీ రేట్లను బ్యాంక్ అమలు చేసింది. రెపో రేటు తగ్గింపు తర్వాత కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా తన కస్టమర్లకు అన్ని కాలపరిమితి గల MCLR తగ్గింపును అందించింది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ తన MCLRను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది, అంటే 9.55 శాతం నుండి 9.45 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. కొత్త రేట్లు డిసెంబర్ 7 నుండి అమలులోకి వస్తాయి.
వీసా, రూపే, మాస్టర్ ATM కార్డ్ లలో.. ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందంటే?
దాదాపు బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డులను యూజ్ చేస్తున్నారు. అయితే డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల మాదిరిగా లోన్స్ ను అందించవు, కానీ మాల్స్, షాపింగ్ మాల్స్‌లో వాటిని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు రకాల డెబిట్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి వీసా, మాస్టర్ కార్డ్, రూపే, మాస్ట్రో. ఈ డిజిటల్ యుగంలో కాంటాక్ట్‌లెస్, వర్చువల్ డెబిట్ కార్డులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. రుపే, వీసా, డెబిట్ కార్డులు అందించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీసా, మాస్టర్ కార్డ్ కార్డులను దేశీయంగా, విదేశాలలో ఉపయోగించవచ్చు. వీసా డెబిట్ కార్డులు భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మాస్టర్ కార్డ్ రెండవ స్థానంలో ఉంది. రెండు కార్డులు వినియోగదారులకు మెరుగైన భద్రతా ఫీచర్లను, బోనస్ రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. భారతదేశంలో వీసా కార్డులు.. వీసా క్లాసిక్, వీసా గోల్డ్, వీసా ప్లాటినం, వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫినిట్. ఈ కార్డులు ATM విత్ డ్రాలు, ఆన్‌లైన్ షాపింగ్, నగదు రహిత చెల్లింపులకు ఉపయోగపడతాయి. RuPay భారత డెబిట్ కార్డుగా పాపులారిటీ పొందింది. ఇది NPCI ద్వారా సృష్టించబడిన భారత స్వంత చెల్లింపు నెట్‌వర్క్. ఇది తక్కువ ఛార్జీలను వసూలు చేస్తుంది. మాస్ట్రో కార్డును 1991లో మాస్టర్ కార్డ్ ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెల్లింపులు చేయవచ్చు. డెబిట్ కార్డు తీసుకునే ముందు, కార్డుపై వార్షిక ఛార్జీలు, అంతర్జాతీయ లావాదేవీలకు సౌకర్యం ఉందా లేదా, ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే పరిమితి, గరిష్ట ఖర్చు పరిమితిని తెలుసుకోవడం ముఖ్యం.
ఐపీఎల్ 2026 వేలానికి ముందే అర్షద్ ఖాన్ చరిత్ర!
మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను (6/9) నమోదు చేశాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో గతంలో టి రవితేజ (హైదరాబాద్), అర్జన్ నాగవాసల్లా (గుజరాత్) నెలకొల్పిన రికార్డు (6/13) బ్రేక్ అయింది. సంచలన బౌలింగ్ చేసిన అర్షద్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ బౌలర్ టి రవితేజ 2023 అక్టోబర్‌లో 13 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ బౌలర్ అర్జన్ నాగవాసల్లా కూడా 13 పరుగులకే 6 వికెట్స్ తీసుకున్నాడు. ఈ ఉమ్మడి రికార్డును తాజాగా అర్షద్ ఖాన్ బద్దలు కొట్టాడు. 2015లో సర్వీసెస్‌కు చెందిన డిఎస్ పూనియా (6/14), అదే సీజన్‌లో బరోడాకు చెందిన స్వాప్నిల్ సింగ్ (6/19) కూడా 6 వికెట్స్ పడగొట్టారు. కొత్త బంతితో టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసిన అర్షద్.. డెత్ ఓవర్లలో మూడు వికెట్లు తీసి చండీగఢ్‌ను 134/8కి పరిమితం చేశాడు. ఆపై హర్ష్ గవాలి (74) పరుగులు చేయడంతో మధ్యప్రదేశ్ 14 ఓవర్లలో విజయం సాధించింది. అర్షద్ ఖాన్ అద్భుత స్పెల్ ఇప్పుడు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. దేశీయ క్రికెట్‌లో ఎడమచేతి వాటం సీమర్‌లకు ఇది ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ ప్రదర్శన అర్షద్ కెరీర్‌కు కాలిసి రానుంది. 26 ఏళ్ల అర్షద్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందే అర్షద్ చెలరేగడంతో అతడిపై భారీ అంచనాలు ఉండనున్నాయి.
బాక్సాఫీస్ నంబర్లు కాదు..పాత్రలే ముఖ్యం
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కృతి సనన్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి నటించిన ‘తేరే ఇష్క్ మే’ చిత్రంతో ఆమె ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ముక్తి అనే పాత్రలో కృతి అద్భుతమైన నటనను కనబరిచి, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతి తన కెరీర్ మరియు పోటీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.. ‘మన పనిని పదిమంది మెచ్చుకున్నప్పుడు వచ్చే ఆనందం, శక్తి మరెక్కడా దొరకదని కృతి పేర్కొంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, ఒక నటిగా తనకు ఇంతలా ప్రేమ దక్కుతుందని ఊహించలేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో రేసు గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎవరితోనూ పోటీ పడటం లేదు. బాక్సాఫీస్ నంబర్ల కోసం పరుగు తీయడం కంటే, నా పనిని నేను ఆస్వాదించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాను. కెరీర్‌లో ఒక స్థాయికి చేరుకున్నాక మన ప్రతిభ ఏంటో ప్రేక్షకులకు అర్థమవుతుందనే నమ్మకం నాకుంది’ అని స్పష్టం చేసింది. తాను ప్రస్తుతం ఉన్న స్థితితో సంతృప్తి చెందకుండా, వృత్తిపరంగా తనని తాను ఇంకా మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు కృతి వెల్లడించింది. మొత్తానికి గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా బాక్సాఫీస్ లెక్కల కంటే నటనకే పెద్దపీట వేయడం కృతి సనన్ పరిణతిని చూపిస్తుంది. ఈ వైఖరి ఆమెను భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రల వైపు నడిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అఖండ 2 రిలీజ్ కు మూడు తేదీలను ఫైనల్ చేశారు మేకర్స్. ఒకసారి ఆ డేట్స్ ను పరిశీలించి చూస్తే..
డిసెంబర్ 25: డిసెంబర్ 25న రిలీజ్ డేట్ అనుకుంటే 24 రాత్రి ప్రీమియర్లతో సినిమా విడుదలైతే, 4 రోజుల లాంగ్ వీకెండ్ ప్లస్ ప్రీమియర్లతో కలిపి హాలిడే విడుదల దొరుకుతుంది. కాబట్టి రిలీజ్ డే అడ్వాంటేజ్ వలన డే 1 గ్రాస్ కాస్త గట్టి నంబర్ ఉంటుంది. ఇక జనవరి 1వ తేదీ రెండవ వారంలో వస్తుంది కాబట్టి అది కూడా భారీ అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు సెకండ్ వీకెండ్ కూడా మంచి వసూళ్లు రాబట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే, రెండవ వారాంతం తర్వాత ప్రీ-ఫెస్టివల్ ఎఫెక్ట్ కారణంగా సినిమా దాదాపుగా బాక్సాఫీస్ రన్ ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మరోపక్క సినిమాను 25రిలీజ్ చేస్తే అప్పటివరకు ఇప్పుడున్న బజ్ ఉంటుందా అనే అనుమానం ఉంది. ఎందుకంటే ఇంకా 2 వారాల కంటే ఎక్కువ గ్యాప్ ఉంది. ప్రమోషన్ల మళ్ళీ చేయాలి. డిసెంబర్ 12: డిసెంబర్ 12న 11వ రాత్రి ప్రీమియర్లతో, ఎక్కువ ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాగు భారీ హైప్ ఉంది. సో టీమ్ జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టిన సరిపోతుంది. కానీ మొదటివీకెండ్ మరియు సెకండ్ వీకెండ్ లో సెలవులు లేవు. కానీ మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. 3వ మరియు 4వ వారంలో హాలిడే అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్. భారీగా థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయి కాబట్టి లాంగ్ రన్ ఉంటే రికవరీ కాస్త ఏక్కువ ఉంటుంది. సో డిసెంబర్ 12 బెస్ట్ ఛాయిస్.
హిందీ బిగ్‌బాస్ విన్నర్‌గా గౌరవ్ ఖన్నా.. భారీగా ప్రైజ్‌మనీ, కారు..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ప్రసిద్ధ రియాలిటీ షో బిగ్ బాస్ 19వ సీజన్ విజేతను ప్రకటించింది. తాన్యా మిట్టల్, ప్రణిత్ మోర్, అమల్ మాలిక్ వంటి బలమైన పోటీదారులను అధిగమించి టీవీ సూపర్ స్టార్ గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. గౌరవ్ విజయంతో బిగ్ బాస్ 19 సీజన్ ముగిసింది. షో ప్రారంభమైన మొదటి రోజు నుంచే గౌరవ్ ఖన్నా తన జ్ఞానం, ప్రశాంత స్వభావం, వ్యూహాన్ని ప్రదర్శించాడు. బిగ్ బాస్ గురించి ఖన్నాకు ఓ అభిప్రాయం ఉంది.. షో అంతటా ఎటువంటి వివాదంలో పాల్గొనలేదు. తన అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశాడు. టాస్క్‌లలో ప్రతిభ కనబరిచాడు. ఎట్టకేలకు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా.. గత సంవత్సరం బిగ్ బాస్ 18 విజేతగా నిలిచిన కరణ్‌వీర్ మెహ్రాకు రూ. 50 లక్షల నగదు లభించింది. అలాగే.. ఈసారి, బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకున్న గౌరవ్ ఖన్నా సైతం రూ.50 లక్షలు బహుమతిగా అందుకున్నాడు. ట్రోఫీ, రూ. 50 లక్షల ప్రైజ్ మనీతోపాటు ఓ కారును కూడా సొంతం చేసుకున్నాడు. గౌరవ్ ఖన్నా ఇప్పటికే సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఫర్హానా భట్, తన్యా మిట్టల్, ప్రణీత్ మోర్, అమాన్ మల్లిక్ లను ఓడించి షో విజేతగా నిలిచాడు.