డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త..
మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనుంది ప్రభుత్వం.. 16 వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించారు.. వీరిలో 15 వేల 941 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు.. అయితే, ఈ రోజు నియామక పత్రాల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమానికి డీఎస్సీ అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో పాటు హాజరుకానుండగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కొంతమందికి నియామక పత్రాలు అందించనున్నారు.. అంటే, టాప్ 20 అభ్యర్థులకు ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.. ఇక, మిగిలిన వారికి ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు నియామక పత్రాలు అందిస్తారు… ఏపీ సచివాలయం వెనక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.. ఈ కార్యక్రమంలో నియామక పత్రాలు అందిస్తారు… ఉద్యోగం పొందిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరుకానుండగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ సహా మరికొందరు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అయితే, అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు కూటమి ఎమ్మెల్యే లు.. ఎమ్మెల్సీ లు..
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. లిక్కర్ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ లకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు రద్దు చేయాలని సిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. నిందితుల తరపున వాదనలు నిరంజన్ రెడ్డి వినిపించగా సిట్ తరపున వాదనలు సిద్ధార్ధ లూథ్రా వినిపించారు. సిద్ధార్ధ లుథ్రా వాదనలలో భాగంగా నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ఉత్తర్వులు చట్ట విరుద్దమని అన్నారు. ఆగస్టు 11న సిట్ అదనపు చార్జి షీట్ దాఖలు చేసిందని అందులో ఈ నలుగురు నిందితుల పాత్ర గురించి వివరించినట్టు చెప్పారు. ఆగస్టు 18న ఏ33 బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్ ఏసిబి కోర్టు డిస్మిస్ చేసిందనీ 23న చార్జి షీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక, సెప్టెంబర్ ఒకటో తేదీలోపు అభ్యంతరాలు నివృత్తి చేశామన్నారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారన్నారు.. 18న రెగ్యులర్ బెయిల్ డిస్మిస్ చేసి సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తారన్నారు. నలుగురు బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయలని కోరారు. మరోవైపు, నిందితుల తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెగ్యులర్ బెయిల్ పై ఆదేశాలకు డిఫాల్ట్ బెయిల్ పై ఆదేశాలకు సంబంధం లేదన్నారు. రెగ్యులర్ బెయిల్ పై ఆదేశాలు అప్పటి పరిస్థితి ఆధారాల బట్టి ఉంటుందని.. తర్వాత ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ మంజూరు ఉత్తర్వులపై గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రభావం చూపవన్నారు. 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటానికి చట్టంలో అవకాశం ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు ముగియంతో లిఖిత పూర్వక వాదనలు శుక్రవారంలోపు సమర్పించాలని హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.. నాల్గో రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.. శక్తి సాధనకు ప్రతీక అయిన కాత్యాయని దేవి పూజిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దుర్గాదేవి నవ దుర్గలుగా అవతరించిందని విశ్వాసం. ఈ నవ దుర్గలలో ఆరవ అవతారమే కాత్యాయని అవతారంగా చెబుతారు.. వామన పురాణం ప్రకారం పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షికి సంతానం కలగకపోగా.. దుర్గా దేవి భక్తుడైన ఆయన.. సంతానం కోసం ఘోర తపస్సు చేసి దుర్గమ్మను ప్రసన్నం చేసుకుని అమ్మవారే తనకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నాడట.. దీంతో అమ్మవారు అంగీకరించిందని పురాణాలు చెబుతున్నాయి.. కాత్యాయన మహర్షి కిరణాల రూపంలోని త్రిమూర్తుల శక్తులకు తన తపః ప్రభావంతో ఒక స్త్రీ రూపాన్ని ఇస్తాడు. ఈ విధంగా కాత్యాయన మహర్షి వరం కూడా సార్ధకమవుతుంది. త్రిమూర్తుల శక్తుల అంశతో దుర్గాదేవి కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మిస్తుంది. కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి ఆమె కాత్యాయనిగా పిలువబడిందని చెబుతారు..
గ్రూప్-1 ఉద్యోగాల ఫైనల్ ఫలితాలు విడుదల.. 562 అభ్యర్థుల ఎంపిక
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) ఇటీవల గ్రూప్-1 ఉద్యోగాల తుది ఎంపిక ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష గత ఏడాది అక్టోబర్ 21 నుండి 27 వరకు జరిగింది. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 నియామకాలు జరగడం ఇదే మొదటిసారి. ఈసారి, టాప్-10 ర్యాంకర్లలో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. ముఖ్యంగా తొలి ర్యాంకు సాధించిన లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, జిన్నా తేజస్విని, వంశీకృష్ణారెడ్డి, కృతిక, అనూష, హర్షవర్ధన్, శ్రీకృష్ణసాయి, నిఖిత, భవ్య.. అత్యున్నత పోస్టులైన డిప్యూటీ కలెక్టర్ (RDO) పోస్టులకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా లిస్ట్ టీఎస్‌పీఎస్సీ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇక ఉస్మానియా యూనివర్శిటీలో మెడిసిన్ పూర్తి చేసిన లక్ష్మీదీపిక, 900 మార్కులకు 550 మార్కులు సాధించి మొదటి ర్యాంకులో నిలిచారు. అలాగే, ఇప్పటికే మండల పంచాయతీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తేజస్విని మల్టీజోన్-1 కేటగిరీలో 532 మార్కులతో ఆర్డీవో పోస్టును సాధించారు. మొత్తం మీద జనరల్ మెరిట్ ర్యాంకులలో టాప్-10లో ఆరుగురు, టాప్-50లో 25 మంది, టాప్-100లో 41 మంది మహిళలు ఉన్నారు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఓ జయశంకర్
వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏఓ) భూపతి జయశంకర్, ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కోసం జయశంకర్ లంచం డిమాండ్ చేశారు. మొదటగా రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా, చివరికి రూ. 75 వేలకు అంగీకరించారు. లైసెన్స్ అనుమతులు ఇచ్చిన తర్వాత, మొదటి విడతగా రూ. 50 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. వికారాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా ఏసీబీ అధికారులు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో జయశంకర్‌ను అరెస్టు చేసి తదుపరి చర్యల కోసం తరలించారు. ప్రభుత్వ శాఖలలో లంచం తీసుకోవడం నేరం అని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
లడఖ్ హింసపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!
భారత్‌లో ఇప్పటిదాకా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ బుధవారం హఠాత్తుగా లడఖ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్ర హోదా పేరుతో నిరసనకారులు రోడ్లపైకి నానా బీభత్సం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా బీజేపీ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలపై దాడి చేసి తగలబెట్టారు. దీంతో నేపాల్‌లో మాదిరిగా జెన్-జెడ్ తరహాలో హింస చెలరేగింది. దీంతో ఒక్కసారిగా కేంద్రం అప్రమత్తం అయింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించారు. దీంతో భారీగా భద్రతా దళాలు మోహరింపు హింస చెలరేగకుండా ఆపగలిగారు. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసన దీక్ష చేస్తున్నాడు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోనమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా కేంద్రం గుర్తించింది. కొన్ని గుంపులను హింసకు ప్రేరేపించినట్లుగా అనుమానిస్తోంది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం అరబ్ స్ప్రింగ్ తరహా ఉద్యమాన్ని కోరుకుంటున్నట్లు సోనమ్ ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా నేపాల్‌లో జరిగిన జెన్-జెడ్ ఉద్యమాన్ని కూడా పదే పదే ప్రస్తావించడంతో బుధవారం హఠాత్తుగా హింస చెలరేగినట్లుగా కేంద్రం భావిస్తోంది. సోనమ్.. అరబ్ స్ప్రింగ్ తరహా నిరసన, నేపాల్‌లో జనరల్ జెడ్ నిరసనల తరహా రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించాడని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
యూఎన్‌లో కుట్ర జరిగింది.. కారకాల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు
ట్రంప్.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈ హోదాలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పక్కా నిఘా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి భద్రత కలిగిన ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితిలో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ 23 నుంచి ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలుకు హాజరయ్యేందుకు ప్రథమ మహిళ మెలానియాతో కలిసి ట్రంప్ న్యూయార్క్‌లోని యూఎన్ కార్యాలయానికి వచ్చారు. పైకి వెళ్లేందుకు మెలానియా, ట్రంప్ ఎస్కలేటర్ ఎక్కారు. ఇద్దరూ ఎక్కగానే సడన్‌గాఎస్కలేటర్ ఆగిపోయింది. దీంతో ఇద్దరూ కూడా అవాక్కయ్యారు. ఒకింత షాక్‌కు గురయ్యారు. దీంతో చేసేదేమీలేక మెలానియా మెట్లు ఎక్కి వెళ్లిపోయారు. మెలానియా వెంట ట్రంప్ కూడా మెట్లు ఎక్కేసి వెళ్లిపోయారు. దీన్ని ఘోర అవమానంగా ట్రంప్ భావించారు. ఎస్కలేటర్ ఎందుకు ఆగిందంటూ చేతి సైగలు చేశారు.
వేళ్లు లేకుండానే..ఆర్టిఫిషియల్ ఫింగర్స్..
సాంకేతికత రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికి అది కొన్ని సార్లు అనర్థాలకు దారితీస్తుంది. నేరగాళ్లు సులువుగా తప్పింకునేలా టెక్నాలజీ ఎలా ఉపయోగపడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేరాలు జరిగినప్పుడు నింధితుని ఆనవాళ్లను పోలీసులు వెతుకుతారు. అక్కడ నుండి కచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తారు…జరిగినప్పుడు నింధితుని ఆనవాళ్లను పోలీసులు వెతుకుతారు. అక్కడ నుండి కచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తారు…తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏకంగా ఆర్టిఫిషియల్ ఫింగర్స్ తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఒక రబ్బర్ మాదిరిగా ఉన్న ఆ ఆర్టిఫీషియల్ ఫింగర్స్ ను వేళ్లకు తొడుక్కుంటే నిజమైన వేలు మాదిరిగానే కనిపిస్తున్నాయి. వాటిపై ఫింగర్ ప్రింట్స్ సైతం ఉండటం ఆశ్చర్యకరం. అయితే ఇలాంటివాటిని తొడుకుని నేరాలకు పాల్పడితే అసలు నిందితులు ఎవరు అని పట్టుకోవడం కూడా అంత సులభం కాదు. కాబట్టి ఇలాంటివి వస్తే చాలా ప్రమాదం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీని ఇలాంటి పనులకు ఉపయోగించకూడదు అని సూచిస్తున్నారు.
ఓజీ ఓవర్సీస్ రివ్యూ.. ఏంటి గురూ ఇలా ఉంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఓవర్సీస్ లోను ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఓజి టాక్ ఎలా ఉందంటే.. పవర్ స్టార్ పవర్ఫుల్ ఎంట్రీతో సాలిడ్ స్టార్ట్ అందుకున్న సినిమా ,మొదటి 20నిముషాలు అదరగొడుతుంది. కానీ ఆ తర్వాత నుండి కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ లో పవర్ స్టార్ కు నాలుగైదు ఎలివేషన్స్ తో ఫ్యాన్స్ కు ట్రేట్ ఇచ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ తెరపై కనిపించేది 20 – 25 నిమిషాలే. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. పవర్ స్టార్ కెరీర్ బెస్ట్ సీన్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫస్టాప్ డీసెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. సెకండాఫ్ ను హైతో స్టార్ట్ చేసిన దర్శకుడు ఒక్క పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ మినయించి ఎక్కడా కూడా సెకండాఫ్ ను సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రియాంక మోహన్ పాత్ర మైనస్. ప్రతి సీన్ ను ఎలివేషన్ లాగా డిజైన్ చేయడం ఫ్యాన్స్ ఓకే జనరల్ ఆడియెన్స్ కావాల్సింది కథ, కథనం. ఇక్కడ అదే లోపించింది. ఈ సినిమాకు సరైన న్యాయం చేసిందంటే తమన్. ప్రతి సీన్ కు అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొట్టాడు. పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. సుజీత్ డైరెక్షన్ బాగుంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా యావరేజ్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది.
నా కెరీర్‌లో ప్రత్యేక పాత్ర ఇదే
తెరపై సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ, వరుస అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటున్న కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్. త్వరలో ‘కాంతారా: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో యువరాణి కనకవతి పాత్రలో మెరిసి, అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంలో రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. “నా కెరీర్‌లో ప్రత్యేకమైన పాత్రలలో యువరాణి కనకవతి ఒకటి. మన జానపద కథలను ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి సినిమాలో అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కనక వతి రాజవంశానికి చెందిన అమ్మాయి అయినా, ఆమెలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఇందులో ఆమె దయ, ధైర్యం చూడడం వల్ల నేనూ లొంగిపోయా. థియేటర్లలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలనుకుంటున్నారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని రుక్మిణి వసంత్ తెలిపారు.
సాయి పల్లవి, ఏసుదాస్ కి కలైమామణి పురస్కారం
కళారంగంలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రతి సంవత్సరం సత్కరించడం తమిళనాడు ప్రభుత్వ ఆనవాయితీ. ఆ క్రమంలో బుధవారం ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను కలైమామణి పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాది 30 మందికి చొప్పున, మూడు సంవత్సరాలకు కలిపి మొత్తం 90 మంది కళాకారులు ఈ గౌరవాన్ని అందుకోనున్నారు. 2021 సంవత్సరానికి సౌత్ ఇండస్ట్రీలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి, అలాగే నటుడు ఎస్. సూర్యలను ఎంపిక చేశారు. సినీ రంగంలో వీరిద్దరి కృషిని గుర్తించిన ఈ అవార్డు, వారి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. అలాగే ప్రస్తుతం సంగీత ప్రపంచంలో ట్రెండింగ్ కంపోజర్‌గా కొనసాగుతున్న అనిరుధ్ రవిచందర్‌కు 2023 సంవత్సరానికి కలైమామణి అవార్డు దక్కింది. తన వినూత్నమైన మ్యూజిక్ స్టైల్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అనిరుధ్‌కు ఇది ప్రతిష్టాత్మక గౌరవంగా భావిస్తున్నారు. జాతీయ విభాగంలో, భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండ్‌గా నిలిచిన కె.జె. యేసుదాస్‌కు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పురస్కారంను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గౌరవం ఆయన సంగీత పయనానికి మరింత ప్రత్యేకతను జోడించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్‌లో చెన్నైలో జరిగే అవకాశం ఉంది. ప్రతిభను గుర్తించి గౌరవించే ఈ వేదికపై అనేక మంది కళాకారులు ఒకే చోట చేరి సంబరాలు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.