శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో ఫిబ్రవరి కోటా టికెట్ల విడుదల..
తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. కాసేపట్లో శ్రీవారి దర్శనంతో పాటు.. ఇతర సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల కానుండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేస్తారు.. ఇక, మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు కోటా విడుదల కాబోతోంది.. మరోవైపు.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పెట్టనుంది టీటీడీ.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు..
వాటిపైనే ఫిర్యాదులు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్..
తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ ఫిర్యాదులలో గణనీయమైన సంఖ్యలో @KAKINADAPOLICE మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి వస్తున్నాయని తెలిపారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ ఫిర్యాదులపై దృష్టి సారించి, కఠినంగా వ్యవహరించాలని నేను కోరుతున్నాను అన్నారు. ఇక, ఈ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు పోలీసు సూపరింటెండెంట్‌లను కోరుతున్నాను అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి, మా ప్రభుత్వం నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తీసుకొచ్చింది.. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు మరియు టైటిల్ వెరిఫికేషన్ మరియు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని తెలిపారు.. మా NDA ప్రభుత్వం ప్రభుత్వ భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం మరియు రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ.. రాజధానిలో కార్నివాల్, లేజర్ షో
ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు. ఈ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు దినోత్సవం, వచ్చే నెల 7, 8, 9వ తేదీలలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో కార్నివాల్, లేజర్ షో, భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపరిపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పథకాల వివరాలను ప్రజలకు చేరవేసేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని, మహిళలు, చిన్నారులు భాగస్వాములు కావాలన్నారు. ఉత్సవాల్లో గ్రామం నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల విజయగాథలను తమ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
పాపకు కంట్లో నలక పడిందంటే సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ప్రాణం తీశారు..
ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారి కంట్లో నలక పడిందని ఆసుపత్రికి వెళితే ప్రాణం తీసిన ఘటన నగరంలో కలకలం రేపింది. హన్విక కుటుంబ సభ్యులు ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి హన్వికకు కంట్లో నలక పడింది. దీంతో ఆ విషయం తల్లిదండ్రులకు తెలిపింది హన్విక. కంట్లో నలక ఎక్కువగా కుచ్చుకుంటుందని కన్నీరుపెట్టుకుంది. దీంతో హన్విక తల్లిదండ్రులు ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్దకు తీసుకుని వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్విక ను ఆనంద్ ఐ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే హన్వికను పరిశీలించిన వైద్యులు ఏకంగా సర్జరీ చేయాలని పేరెంట్స్ కు సూచించారు. సర్జరీ మాట వినగానే కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. కంట్లో నలక పడితే సర్జరీ ఏంటని అడిగితే.. సరైన సమాధానం రాలేదు. దీంతో చిన్నారికి ఏం జరుగుతుందో అని సరే అన్నారు తల్లిదండ్రులు. అయితే వైద్యం చేయడం కోసం సర్జరీకి ముందు హన్వికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజక్షన్ డోస్ ఎక్కువ కావడంతో హన్విక మృతి చెందింది.
50 స్థానాలకు ఉపఎన్నికలు.. అందరి చూపు వయనాడ్, యూపీ వైపు..
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అందరి చూపు వయనాడ్, యూపీలో జరగబోయే ఉప ఎన్నికలపై నెలకొంది. వయనాడ్, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గెలుపొందడంతో ఆయన వయనాడ్ సీటుని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వయనాడ్‌లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ – 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 50 స్థానాలకు బైపోల్స్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌లోని 06 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. కలకత్తా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి ఘటన నిరసనల తర్వాత ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి పరీక్షగా మారాయి.
నన్ను ఏ శక్తి ఆపలేదు.. అన్ని మార్గాల్లోనూ పోరాటం చేస్తా
గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి తనపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్‌ను రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా తనను నిలువరించలేదని వెల్లడించారు. అలాగే, అన్ని మార్గాల్లోనూ తను పోరాటం చేస్తానని నెతన్యాహూ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. మానవాళికి రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన ప్రపంచ క్రిమినల్ న్యాయస్థానం.. మానవాళికే శత్రువుగా మారిందని విమర్శలు గుప్పించారు. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని, మాజీ రక్షణ మంత్రి గాల్లాంట్‌లపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా మండిపడింది. ఐసీసీ నిర్ణయాన్ని తాము తిరస్కరిస్తున్నట్లు వైట్ హౌస్ తేల్చి చెప్పింది.
ఉక్రెయిన్ కోసం హైపర్ సోనిక్ మిస్సైల్స్ ఉత్పత్తిని పెంచండి.. పుతిన్ ఆదేశాలు..
ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రష్యా తన ఆయుధ తయారీని పెంచింది. ముఖ్యంగా హైపర్ సోనిక్ క్షిపణుల తయారీని పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన ఒక రోజు తర్వాత రష్యా అధినేత పుతిన్ శుక్రవారం మాట్లాడుతూ.. మాస్కో హైపర్‌సోనిక్ ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని పోరాట పరిస్థితుల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇటీవల ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ఉపయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇచ్చాడు. దీంతో ఉక్రెయిన్ ఈ క్షిపణులను రష్యాలోని సుదుర లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైంది. రష్యా గురువారం తెల్లవారుజామున ఉక్రెయిన్ నగరం డ్నిప్రోపై కొత్త తరం ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ధ్వని కంటే 10 రెట్ల వేగం ‘‘మాక్ 10’’తో ప్రయాణించే ఈ క్షిపణిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని పుతిన్ ఆదేశించారు.
నా మొగుడు గొప్ప బౌలర్.. సంజనా ఫన్నీ కామెంట్! నవ్వుకోవాల్సిందే
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదటిరోజు ముగిసేసరికి 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్స్ పడగొట్టాడు. నాథన్ మెక్‌స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా సహా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను అవుట్ చేశాడు. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై.. డీలా పడ్డ టీమిండియాలో బుమ్రా తన సంచలన బౌలింగ్‌తో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్ ‘బౌలింగ్’తో జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా జట్టును శాసించిన జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కామెంటర్స్, ఫాన్స్, మాజీ క్రికెటర్స్ అతడిని పొగిడేస్తున్నారు. బుమ్రాపై అతని సతీమణి, స్పోర్ట్స్ ప్రెసెంటెర్ సంజనా గణేషన్ ప్రశంసల జల్లు కురిపించారు. తన భర్త గొప్ప బౌలర్ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ‘గ్రేట్ బౌలర్, ఈవెన్ గ్రేటర్ బూటీ’ అని సంజనా రాసుకొచ్చారు. బుమ్రా గొప్ప బౌలర్ అని, అతని పిరుదులు కూడా అని ఫన్నీగా పోస్ట్ పెట్టారు. ఇందుకు బుమ్రా బటాక్స్ హైలెట్ అయ్యే ఫోటో పెట్టడం విశేషం. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
కంగువా దెబ్బకు నిర్మాతకు అండగా నిలవనున్న సూర్య.. ఇంతకీ ఏం చేశాడంటే ?
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ భామ దిశా పటాని, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. క్రీస్తుశకం 1000 – 1100సంవత్సరాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పిరియాడికల్ మూవీగా కంగువాను దర్శకుడు తెరకెక్కించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా.. మొదటిరోజే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్ లో ది బెస్ట్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మాత్రం తేలిపోయిందనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితం దాదాపు 12 నిమిషాల పాటు రన్ టైమ్ ను ట్రిమ్ చేసిన మేకర్స్.. రెండో వారంలో వసూళ్లు పుంజుకుంటాయన్న ఆశతో ఉన్నారు కానీ అలాంటి పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మిస్ యూ అంటున్న హీరో సిద్ధార్థ్.. ఎవరిని మిస్ అవుతున్నాడో ?
టాలీవుడ్‌లో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన లవర్ భాయ్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగులో చేసింది కొన్ని సినిమాలే చేసినా, ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్‌తో పాటు సింగింగ్ టాలెంట్ తోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వరుసగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాడు. గతేడాది ‘చిన్నా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో సిద్దార్థ్.. ‘ఇండియన్ 2’తో డిజాస్టర్ అందుకున్నాడు. తాజాగా సిద్దార్థ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ యూ’. ఎన్ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఇటవల హీరో శివకార్తికేయన్, హీరో మాధవన్ విడుదల చేశారు. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 23న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మిస్తున్నారు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.