ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేడు అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా “పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్”కు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
నేడు రాజమండ్రికి మంత్రి నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి (HRD), ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించనున్నారు.. పర్యటనలో భాగంగా ఉదయం 7.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, ఉదయం 8.05 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 8.10 గంటలకు విమానంలో ప్రయాణించి, ఉదయం 8.45 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల (Government Arts College)కు చేరుకుని, అక్కడ నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి చేరుకుని, అక్కడ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1.00 గంటల వరకు కొనసాగుతుంది. తదుపరి మధ్యాహ్నం 1.30 గంటలకు రాజమహేంద్రవరం చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 5.30 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని, 5.45 గంటలకు విమానంలో బయలుదేరి, సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తన నివాసానికి చేరుకుంటారు.
ఉత్కంఠ! నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ..
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. రెండ్రోజుల క్రితం 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తీర్పుపై స్పీకర్ తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్ లను కొట్టివేశారు. గత విచారణ సందర్భంగా.. స్పీకర్ నాలుగు వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్ పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్ కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని గట్టిగానే ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కర పిటిషన్ పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి సమాధాన మిచ్చారు. ఈ రోజు ఏం జరగనుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
నార్త్ కరోలినాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు విమానం స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో మాజీ NASCAR డ్రైవర్ గ్రెగ్ బిఫిల్ (55), అతని భార్య క్రిస్టినా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల కుమార్తె ఎమ్మా, ఐదేళ్ల కుమారుడు రైడర్‌గా గుర్తించారు. విమానం బయల్దేరే సమయంలోనే వాతావరణం అనుకూలంగా లేదు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. స్టేట్స్‌విల్లే విమానాశ్రయం చుట్టూ వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదు. అయినా కూడా విమాన ప్రయాణం ప్రారంభించినట్లు నివేదిక అందుతోంది. విమానం టేకాఫ్ అయిన 10:00 గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై వర్షం పడిందని అక్యూవెదర్ డేటా చూపించింది. బయలుదేరిన 15 నిమిషాల్లోనే విమానం విమానాశ్రయానికి తిరిగి రావడానికి ప్రయత్నించి. 10:15 గంటల ప్రాంతంలో రన్‌వేపై కూలిపోయిందని నివేదికలు సూచిస్తున్నాయి.
కోల్డ్‌ప్లే కచేరీలో కౌగిలింతపై మౌనం వీడిన క్రిస్టిన్ కాబోట్
ఈ ఏడాది ఆస్ట్రోనోమర్ సీఈవో ఆండీ బైరాన్-మాజీ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టిన్ కాబోట్ కౌగిలించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంత హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. జూలైలో జరిగిన కోల్డ్‌ప్లే కచేరీలో ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. అనంతరం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. అనంతరం కుటుంబాల్లో చిచ్చురేపి భాగస్వాములకు దూరం కావాల్సి వచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై క్రిస్టిన్ కాబోట్ మౌనం వీడారు. అనేక మీడియా సంస్థలతో జరిగిన ఇంటర్వ్యూల్లో అనేక విషయాలను పంచుకుంది. కోల్డ్‌ప్లే కచేరీలో జరిగిన సంఘటన ముమ్మాటికీ తప్పే అన్నారు. అదొక చెడ్డ పనిగా అభివర్ణించారు. అలా జరిగినందుకు విచారం వ్యక్తం చేసింది. అలా చేసినందుకు బాధ్యత వహించి.. వృత్తిని వదులుకున్నట్లు వెల్లడించింది. బాస్‌తో అనుచితంగా ప్రవర్తించినట్లు ఒప్పుకుంది. కెరీర్‌ను వదులకోవడమే తగిన మూల్యం అని తెలిపారు. ఈ ఘటనతో మానసికంగా.. శారీరికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నానని.. హెచ్‌ఆర్ చరిత్రలో ఇలా జరగడం తప్పేనని ఒప్పుకున్నారు.
రేపే T20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు ప్రకటన.. తుది జట్టులో గిల్, శాంసన్?
టీ20 వరల్డ్‌కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత రేపు ( డిసెంబర్ 20న) భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు ఇంకా ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ప్రకటించే జట్టే మెగా టోర్నీలో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల ముందున్న అతి పెద్ద సవాల్ ఆటగాళ్ల ఫాంతో పాటు సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన ఆందోళనగా శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌ల ఫామ్ మారింది. జట్టు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరిపై సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌ను ఇటీవల జట్టులోకి తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌కు ముందు అతనికి తిరిగి అవకాశం కల్పిస్తారా అనే ఆసక్తి నెలకొంది.
నేడే దక్షిణాఫ్రికాతో భారత్ చివరి టీ20.. ఈ సిరీస్ కైవసం చేసుకునేనా..?
దక్షిణాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 19న) చివరి టీ20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే టీ20 సిరీస్ దక్కించుకున్నట్టు అవుతుంది. అటు పర్యాటక జట్టుకు మాత్రం సిరీస్ గెలిచే ఛాన్స్ లేదు. కాకపోతే, లాస్ట్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేసే అవకాశం మాత్రం ఉంది. ఇక, ప్రాక్టీస్ సమయంలో గాయపడిన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20కి అందుబాటులో ఉండడని ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఆ మ్యాచ్ రద్దు కావడంతో.. తను జట్టుతో పాటే అహ్మదాబాద్‌కు చేరడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కానీ ఆఖరి టీ20లో అతను ఆడే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. సంజూ శాంసన్‌ను డగౌట్ కే పరిమితం చేస్తూ వరుసగా విఫలమవుతున్న గిల్‌ను ప్రతీ మ్యాచ్‌లో ఆడిస్తుండడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి ప్లేస్ లో శాంసన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే ఛాన్స్ ఉంది. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లేమి కూడా కొనసాగుతూనే ఉంది. సారథిగా జట్టును విజయపథంలో నడిపిస్తున్నా, వ్యక్తిగత ఆట తీరు మాత్రం దారుణంగా ఉంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఇక, పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరడం సానుకూలాంశంగా చెప్పాలి. మరో పేసర్ హర్షిత్‌ను కొనసాగిస్తారా? లేక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారా? అనేది వేచి చూడాలి.
తెలుగులో వారం గ్యాప్ లో రిలీజ్ అవుతున్న కన్నడ బిగ్గెస్ట్ మల్టీస్టారర్
కన్నడ ఇండస్ట్రీలో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌గా 45 తెరకెక్కుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో శాండల్‌వుడ్ టాప్ హీరోలు ముగ్గురు నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ , రియల్ స్టార్ ఉపేంద్ర , వర్సటైల్ యాక్టర్ రాజ్ B. శెట్టి , కలిసి మల్టీస్టారర్‌గా ఆకట్టుకోనున్నారు. 45 సినిమాపై కన్నడ సినీ లవర్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం. రమేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సంగీత బాధ్యతను కూడా అర్జున్ జన్యనే తీసుకోవడం విశేషం. ఫిలాసాఫికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కస్తూబమణి హీరోయిన్‌గా నటిస్తోంది. లాస్ట్ ఇయర్ యుఐ సినిమాతో ఉపేంద్ర, భైరతి రణగల్తో శివరాజ్ కుమార్ మంచి జోష్‌లో ఉన్నారు. ఇక రుధిరం ఫ్లాప్ తర్వాత రాజ్ బి. శెట్టికి ఈ సినిమా చాలా కీలకంగా మారింది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఈ సినిమాకు టొరంటోకు చెందిన మార్జ్ అనే వీఎఫ్ఎక్స్ సంస్థ పనిచేస్తుండటం మరో ప్లస్ పాయింట్. 45 సినిమా మన జీవితం, మన ఎంపికలు, వాటి ఫలితాలపై ఆధారపడిన ఫిలాసాఫికల్ డ్రామాగా రూపొందింది. ప్రతి మనిషి జీవితంలో వచ్చే టర్నింగ్ పాయింట్లు, ఒక నిర్ణయం ఎలా భవిష్యత్తునే మార్చేస్తుందో బలమైన కథనంతో చూపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కన్నడతో పాటు తమిళం, హిందీ భాషల్లో డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా, జనవరి 1 న తెలుగు లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
షూటింగ్ సెట్‌లో వింత అనుభవాలు.. భారీ కారు ప్రమాదం!
డిసెంబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న విభిన్న కథా చిత్రం ‘జిన్’. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో చిన్మయ్ రామ్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు చిన్మయ్ రామ్ తన మనోగతాని మీడియాతో పంచుకున్నారు. దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ, ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “నేను కన్నడ చిత్ర పరిశ్రమలో 17 ఏళ్లుగా ఉన్నాను. అక్కడ రెండు సినిమాలు కూడా చేశాను. అయితే నా మిత్రుడు పర్వేజ్ సింబాకు ఒకరోజు వచ్చిన ఒక వింత కలలో నుంచి ఈ ‘జిన్’ కాన్సెప్ట్ పుట్టింది. ఆ పాయింట్ వినగానే నాకు చాలా కొత్తగా అనిపించి ఈ కథను సిద్ధం చేశాను” అని ఆయన తెలిపారు. తెలుగులో తన తొలి ప్రయత్నం ఇంత భారీగా జరుగుతుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి నిర్మాత నిఖిల్ ఎం. గౌడ ఇచ్చిన సహకారమే కారణమని దర్శకుడు కొనియాడారు. “నిఖిల్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎక్కడా రాజీ పడకుండా సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారు” అని పేర్కొన్నారు. ఇక సాంకేతిక నిపుణుల గురించి చెబుతూ.. సంగీత దర్శకుడు అలెక్స్ ఈ చిత్రానికి ‘మొదటి హీరో’ అని, సునీల్ విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.