నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా గృహాల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రజావేదికలో పక్కా గృహాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.. అలాగే సోషల్ మీడియా ప్రతిభావంతులతో కూడా ముచ్చటించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు చంద్రబాబు.. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని చిన్నమండెం ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా పూర్తి చేసింది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు..
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.. 17 నెలల్లో 2.50 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేక పోతుందంటూ వైసీపీ మండిపడుతోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ నిరనన ర్యాలీలకు హాజరు కావాలని కోరింది. 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలసి నిరసన ర్యాలీలు చేపట్టనుంది వైసీపీ. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నూతన మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే, ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవంటూ వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై నేడు అవిశ్వాసం.. ఆమెపై వైసీపీ వేటు..
కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ పై నేడు అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనుంది.. చైర్‌పర్సన్ అరుణ పై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది కౌన్సిలర్లు.. ఆర్జీవో మల్లిబాబు ప్రత్యేక అధికారిగా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది.. వైసీపీ తరఫున చైర్‌పర్సన్‌గా ఉంటూ, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారని అరుణను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ.. అయితే, మున్సిపాలిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉండగా ఇద్దరు చనిపోయారు, ఒకరు రాజీనామా చేశారు.. ఎమ్మెల్యే చినరాజప్పకు ఓటు ఉంటుంది… దాంతో మొత్తం 29 ఓట్లు ఉన్నాయి.. అందులో వైసీపీకి 25 మంది కౌన్సిలర్ల బలం ఉండగా.. ఎమ్మెల్యేతో కలిపి టీడీపీకి కేవలం నలుగురు సభ్యులు బలం మాత్రమే ఉంది.. దాంతో అవిశ్వాస తీర్మానంలో గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.. 19 మంది బలం ఉంటే అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభిస్తుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి.. చాలా వరకు కూటమి సర్కార్ కైవసం చేసుకున్న విషయం విదితమే..
ఏపీలో మరో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు.. మహిళ మృతితో..!
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖపట్నం నుంచి మదనపల్లికి మహిళలను తీసుకొచ్చిన కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలను మదనపల్లిలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అయితే.. కిడ్నీ తొలగించడంతో యమున అనే మహిళ మృతి చెందింది. యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖకు చెందిన పద్మ.. ఇద్దరు మహిళలను మదనపల్లికి తీసుకొచ్చింది. వారికి ఆపరేషన్ చేసిన తర్వాత యమున మృతి చెందింది. దీంతో.. అక్రమ ఆపరేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లి పోలీసులు కిడ్నీ రాకెట్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ లో కీలక నిందితుడిగా నీరజ్ అనే వ్యక్తిని గుర్తించారు. మరోవైపు కిడ్నీ ముఠాతో కలిసి పని చేస్తున్న గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు కిడ్నీ ముఠాకు పద్మ అనే మహిళ సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పద్మ పరారీలో ఉండగా.. ఆమె కోసం గాలిస్తున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. భక్తుల ఆగ్రహం!
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం వేకువజాము నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో.. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. ఆలయం చుట్టూ పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. అలాగే భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడె మొక్కలు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణం, ఉత్తర భాగాలలో ప్రాకారం.. పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే తొలగించారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం తెల్లవారుజామున మెయిన్ గేట్‌ను ఇనుప రేకులతో మూసివేశారు. దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసి వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నిన్న అర్ధరాత్రి పొద్దు బోయాక ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు” అని మంత్రి కొండా సురేఖ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే లేదా అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె పేర్కొన్నారు. తన వ్యాఖ్యల కారణంగా వారికి ఏదైనా అవాంఛిత అభిప్రాయం కలిగి ఉంటే అందుకు చింతిస్తున్నానని, తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ తెలిపారు. నిజానికి, నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, ఆమె వెంటనే స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం గమనార్హం. ఎప్పుడో నాగార్జున కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చాలా కాలం తర్వాత ఇలా స్పందించడం గమనార్హం. ఈ అంశం మీద నాగార్జున ఫ్యామిలీ కోర్టుకు కూడా వెళ్లారు. ఇక ఈ ట్వీట్‌తో ఈ వివాదం సద్దుమణగవచ్చని భావిస్తున్నారు.
సరస్వతీదేవి మహాపూజ, పుస్తకపూజ.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ 2025 దిగ్విజయంగా కొనసాగుతోంది. విశేష పూజలు, అనుగ్రహ భాషణం, ప్రవచనాలు, కళ్యాణం, వాహన సేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో గత రెండు వారాలుగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. కోటి దీపోత్సవం రేపటితో ముగియనుంది. దీపాల పండుగలో నేడు 12వ రోజు. నేటి విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి (శ్రీపీఠం, కాకినాడ), పూజ్యశ్రీ భాస్కరానందజీ మహారాజ్ (మహామండలేశ్వర్, బృందావనం) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై బాసర సరస్వతీదేవి మహాపూజ, కోల్‌కతా కాళీ కుంకుమ పూజ ఉంటుంది. భక్తులచే సరస్వతి పుస్తక పూజ చేపించనున్నారు. వరంగల్ భద్రకాళీ కల్యాణోత్సవం, డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం జరగనుంది. చివరగా సింహ వాహనం, పల్లకీ సేవ ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సాయంత్రం 5.30కు కోటి దీపోత్సవం కార్యక్రమాలు ఆరంభం అవుతాయి.
దుబాయ్ ఎడారిలో రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త దంపతులు హత్య.. అసలేం జరిగిందంటే..!
రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త రోమన్ నోవాక్, అతని భార్య అన్నా నోవాక్ దుబాయ్‌లో హత్యకు గురయ్యారు. దుబాయ్ ఎడారిలో శరీరం ముక్కలు ముక్కలుగా నరికివేయబడినట్టుగా మృతదేహాలు కనిపించాయి. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులతో సమావేశానికి వెళ్తున్నట్లుగా అక్టోబర్ 2న రోమన్ నోవాక్ దంపతులు దుబాయ్‌కు వెళ్లారు. కారు డ్రైవర్ ఒమన్ సరిహద్దుకు దగ్గరగా హట్టా ప్రాంతంలో ఒక సరస్సు దగ్గర దింపాడు. అక్కడ నుంచి రెండో వాహనంలో బయల్దేరి వెళ్లారు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే తాను ఒమన్ సరిహద్దులోని పర్వతాల్లో చిక్కుకున్నానని.. తనకు డబ్బులు అవసరం అంటూ పరిచయస్తులకు రోమన్ నోవాక్ సందేశం పంపించాడు. దీంతో బంధువులు వెతుక్కుంటూ వచ్చినా సమాచారం లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేయగా.. ఒకసారి హట్టాలోనూ.. ఇంకోసారి ఒమన్‌లో.. మరొకసారి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అక్టోబర్ 4 నుంచైతే పూర్తిగా సిగ్నల్స్ కట్ అయిపోయాయి.
మంచి ఫామ్‌లోనే ఉన్నా.. సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వ్యక్తిగతంగా తాను మంచి ఫామ్‌లో ఉన్నా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుందని.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకమని సిరాజ్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ సందర్భంగా భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్ చేసింది. ‘డబ్ల్యూటీసీ 2025-27లో దక్షిణాఫ్రికాతో ఆడనున్న రెండు టెస్టులు టీమిండియాకు కీలకం. డిఫెండింగ్ ఛాంపియన్ ప్రొటీస్ ఇటీవల పాకిస్థాన్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. టెస్ట్ సిరీస్‌పై మేం మంచి విశ్వాసంతో ఉన్నాం. భారత జట్టు ఫామ్‌లో ఉంది. ప్లేయర్స్ అందరూ బాగా ఆడుతున్నారు.ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణించాం. స్వదేశంలో వెస్టిండీస్‌పై సత్తాచాటాము. దక్షిణాఫ్రికాపై కూడా విజయం సాధిస్తామని భావిస్తున్నా. ఇక వ్యక్తిగతంగా మంచి ఫామ్‌లో ఉన్నా. దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది. టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని మహ్మద్ సిరాజ్ చెప్పాడు.
మీడియా చంపేసిన నటుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..
ఈ మధ్యకాలంలో వార్తలు అందరికన్నా ముందు మేమే అందించాలనే ఉద్దేశంతో మీడియా సంస్థలు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మానేశాయి. ఈ నేపథ్యంలోనే, నిన్న శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర మరణించినట్లుగా బాలీవుడ్‌లో ముందు ప్రచారం మొదలైంది. అది నిజమేనని తెలుగు మీడియా పోర్టల్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాయి. అయితే, ఇదే విషయాన్ని ఖండిస్తూ ఆయన కుమార్తెలలో ఒకరైన హీరోయిన్ ఈషా డియోల్ స్పందించారు. “దయచేసి మా తండ్రి గురించి ఇలాంటి వార్తలు రాయకండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. ఇంతలోనే ఇలా మరణించారు అనే వార్తలు దయచేసి పుట్టించకండి” అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక, ధర్మేంద్ర భార్య హేమమాలిని సైతం “ఇది ఏమాత్రం క్షమించరానిది” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చాలా బాధ్యతగా మెలగాల్సిన మీడియా సంస్థలు సైతం ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఇలా వార్తలు ప్రచురించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు. మొత్తం మీద, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్రను బతికుండగానే మీడియా చంపేసింది. ఇక ఆయన పరిస్థితి నిలకడగా ఉండడంతో, ఈరోజు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు వైద్యులు.
3 గంటలే నిద్రనా.. మరీ ఇంత అరాచకం ఏంటి స్వామి?
నాని హీరోగా, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, సినిమా అనౌన్స్‌మెంట్ గ్లిమ్స్‌లో నాని వాడిన పదజాలం అయితే అందరికీ షాక్ కలిగించింది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని ఏంటి, ఇలాంటి సినిమా చేయడం ఏంటి? అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, ఈ సినిమా షూట్ పలు కారణాలతో అనుకున్నంత వేగంగా జరగలేదు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ వాయిదా కూడా పడవచ్చని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా షూట్‌కి ముందే భారీ రేటుకు అమ్ముడుపోయింది. ఈ క్రమంలో ఓటీటీ సంస్థ ఒక రేటు ఫిక్స్ చేసింది, అలాగే రిలీజ్ డెడ్‌లైన్ కూడా ఫిక్స్ చేసింది. ఆ డెడ్‌లైన్ రీచ్ అయ్యేందుకు టీం చాలా కష్టపడుతోంది. రోజుకు 3 గంటలు మాత్రమే నిద్ర పోయి షూట్ పూర్తి చేస్తున్నారు అని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో జరుగుతోంది. భారీ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేశారు. రోజుకు మూడు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని, మిగతా సమయంలో షూట్‌కి సమయం వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు..
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. ముంబై జుహాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ జాతీయ మీడియాతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 61 ఏళ్ల గోవిందా మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, వెంటనే కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆయనను ఆస్పత్రిలో చేర్చగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. 990లలో బాలీవుడ్‌లో అత్యధిక హిట్స్ అందించిన హీరోల్లో గోవిందా ఒకరు. కామెడీ, డ్యాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన గోవిందా, గత కొంతకాలంగా సినిమాల నుంచి కొంచెం దూరంగా ఉన్నా, రియాలిటీ షోలు, పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో వచ్చిన ఈ వార్తతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. తిరిగి తెరపై కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.