జగన్‌కు సూపర్ స్పెషాలిటీ, జనరల్ హాస్పిటల్‌కు తేడా తెలియదు..!
మెడికల్ కాలేజీల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ కు సూపర్ స్పెషాలిటీ, జనరల్ హాస్పిటల్ లకు తేడా తెలియదని విమర్శించారు ఎంపీ బైరెడ్డి శబరి.. నంద్యాల జీజీహెచ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపీ శబరి.. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నంద్యాల మెడికల్ కాలేజీలో హాస్పిటల్ ఎక్కడ ఉందో మాజీ సీఎం జగన్ , మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి చూపించాలని కోరారు. కాలేజీ లోపల హాస్పిటల్ ఉంటే ఆహా ఓహో అని ప్రశంసించి శిల్పారవిని శాలువాతో సన్మానించి, బొకే ఇస్తామని ఎద్దేవా చేశారమే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కేవలం పునాదులను ఫిల్లర్లను మాత్రమే నిర్మించిందని, ఇదే విధానంలో కాలేజీని నిర్మించడానికి 30 ఏళ్లు పడుతుందన్నారు ఎంపీ బైరెడ్డి శబరి. తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 8 నెలలో కాలేజీల్లో నిర్మాణాలు చేశామన్నారు.. పేదల కోసం మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని అప్పట్లో సీఎం జగన్ చెప్పారని గుర్తు చేశారు ఎంపీ బైరెడ్డి శబరి. కానీ బీ కేటగిరిలో ప్రైవేట్ కాలేజీల స్థాయిలో ఫీజులను ఎందుకు పెట్టారని, రూ 60 లక్షల నుండి రూ కోటి ఖర్చుపెట్టి పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. తల్లితో మాట్లాడని వారు… విగ్రహాలతో మాట్లాడుతున్నారని.. మెడికల్ కాలేజీలో కూడా విగ్రహం పెట్టారన్నారు ఎంపీ బైరెడ్డి శబరి.మనం కూడా వెళ్లి విగ్రహంతో మాట్లాడదామని వ్యంగంగా అన్నారమే. వైస్సార్సీపీ నేతలకు లండన్ లో ట్రీట్మెంట్ సరిపోవడం లేదని, రాష్ట్రంలోని ప్రతి హాస్పిటల్ లో సైక్రియటిక్ వార్డులను అభివృద్ధి చేయాలని మంత్రి సత్య కుమార్ ను కోరారు ఎంపీ బైరెడ్డి శబరి..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సచివాలయంలో ప్రమోషన్లు
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతత్వంలోని కూటమి సర్కార్.. సచివాలయంలో పనిచేసే 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, 2023లో గత ప్రభుత్వం అనాలోచితంగా ఉత్తర్వులు ఇచ్చిందంటున్నారు.. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు.. ఆ తప్పిదాలు సరిదిద్ది ప్రమోషన్లు పునరుద్ధరిoచినట్టుప్రబుత్వ వర్గాలు చెబుతున్నాయి.. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ద్వారా 50 మంది అధికారులకు ప్రమోషన్ వచ్చింది.. త్వరలో మరో 100 – 150 మంది అధికారులకు కూడా ప్రమోషన్లకు మార్గం సుగమo అయ్యిందంటున్నారు.. మొత్తంగా 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ.. మరో 150 మంది అధికారులకు ప్రమోషన్ల మార్గాన్ని క్లియర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్.
ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వేల సంఖ్యలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ఒక భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల నిరుద్యోగులలో ఆశలు చిగురించాయి. ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం , ఎంపిక ప్రక్రియ గురించి త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, శ్రామిక్ పోస్టులకు నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ (డ్రైవర్ పోస్టులకు), ఇంటర్వ్యూ వంటి ప్రక్రియల ద్వారా ఎంపిక జరుగుతుంది.
తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం.. విమోచన దినోత్సవ శుభాకాంక్షలు..
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. భారత దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినా.. ఆ ఫలాలు పొందటానికి తెలంగాణ ప్రజలకు మరో 13 నెలలు సమయంపట్టిందని గుర్తుచేశారు.. నిజాం నిరంకుశ పాలనపై భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్ మూలంగా తెలంగాణకు స్వేచ్ఛ దక్కి విమోచన కలిగిందని చెప్పుకొచ్చారు.. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పవన్ కల్యాణ్… ఇక, నిజాం ఏలుబడిలో రజాకార్లు ఊళ్ల మీదపడి సాగించిన అకృత్యాల వల్ల ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది.. దానికి వ్యతిరేకంగా.. రజాకార్లపై రైతాంగం చేసిన సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు పవన్ కల్యాణ్.. రజాకార్లు చెలరేగిన తీరు, వారికి నాయకత్వం వహించిన కాసీమ్ రజ్వీ.. ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తానని విర్రవీగిన విధానం… వల్లభాయ్ పటేల్ ఏ విధంగా కట్టడి చేసింది.. ఈ తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు.. నిజాం పాలనపై రైతులు, సామాన్య ప్రజలు చేసిన పోరాటం తాలూకు స్ఫూర్తి నేటి తరంలోనూ ఉందన్నారు.. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఎల్అండ్‌టి మెట్రో ప్రాజెక్టు నుంచి వెనక్కి.. సీఎం బెదిరింపులే కారణం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్‌టి కంపెనీ తప్పుకోవడానికి సీఎం రెవంత్ రెడ్డి వ్యవహార శైలి, బెదిరింపులే కారణమని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ప్రకారం, ఎల్అండ్‌టి సంస్థపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, ముడుపుల కోసం వేధించడంతో కంపెనీ కార్యకలాపాలను రాష్ట్రం నుంచి వెనక్కి తీసుకుంటోందని చెప్పారు. “ఒకప్పుడు ఎల్అండ్‌టి సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించాడు. ఈ తరహా మాటలు, చర్యలు ప్రైవేట్ కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేస్తాయి. ప్రభుత్వానికి బాధ్యత లేకపోతే, కంపెనీలకు ఎందుకు ఉంటుంది?” అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ మరో కీలక వ్యాఖ్య చేస్తూ, త్వరలోనే రేవంత్ రెడ్డి వివాదాస్పద ఎమ్మార్ సంస్థ ఆస్తులను అమ్మకానికి పెట్టబోతున్నారని తెలిపారు. ఆ వ్యవహారంలో ఎంత కమిషన్ తీసుకున్నారో త్వరలోనే వెలుగులోకి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందుకు తెచ్చి, వాటిని సెటిల్ చేసుకుంటూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. ప్రైవేట్ పార్ట్స్‌పై తన్ని..!
హైదరాబాద్ నగరంలోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుని కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న రిషాంత్ రెడ్డి అనే విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, ర్యాగింగ్ సమయంలో తోటి విద్యార్థులు రిషాంత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, అతని ప్రైవేట్ పార్ట్స్‌పై తన్నినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో విద్యార్థి రక్తస్రావానికి గురైనా, పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లితండ్రులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ర్యాగింగ్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ర్యాగింగ్ వంటి ఘటనలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ ఘటనతో పాఠశాల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మహిళల ఆరోగ్యమే సమాజ అభివృద్ధికి పునాది
రాష్ట్ర మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ, మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యమహిళ క్లినిక్స్ ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ క్లినిక్‌లలో అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయించడంతో పాటు, చికిత్స మరియు మెడిసిన్ కూడా అందజేస్తున్నామని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 2012-13లో ప్రారంభమైన మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేన్సర్ కేసులు, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న బ్రెస్ట్ కేన్సర్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్ల ద్వారా స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. అలాగే ఎన్‌సీడీ క్లినిక్స్ ద్వారా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
“విష్ణువు”పై సీజేఐ గవాయ్ వాఖ్యలు వివాదాస్పదం.. రాష్ట్రపతికి న్యాయవాది లేఖ..
ఖజురహోలోని విష్ణు విగ్రహానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. ఖజురహోలోని పురాతన విష్ణువు విగ్రహం ధ్వంసం చేయబడిందని, దీనిని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయబడింది. ఖజురహోలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే, కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం, ఇది భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) కిందకు వస్తుందని, వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు క్షమించండి’’ అని అన్నారు.
‘‘ఖాన్’’ ముంబై మేయర్ కావద్దు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ముంబై నగర భద్రత కోసం ఒక ‘‘ఖాన్’’ నగర మేయర్ కాకూడదని ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి బీజేపీ ముంబై చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి పియూష్ గోయల్ హాజరైన బీజేపీ విజయ్ సంకల్ప్ మేళావాలో అమీత్ సతం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ముంబై సురక్షితంగా ఉంచడమే యుద్ధం. విదేశీ చొరబాట్లు పెరుగుతున్నాయి. వారు తమ రంగును మారుస్తున్నారు. కొన్ని నగరాల మేయర్ల ఇంటిపేర్లు చూడండి. ముంబైకి అదే పరిస్థితి కావాలా..?’’ అని ఆయన ప్రశ్నించారు. సతం చేసిన ఈ వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాల్లో వలసల్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనల గురించి అని భావిస్తు్న్నారు. ఇంటి పేరు వ్యాఖ్యల పాకిస్తాన్ మూలాలు కలిగిన లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌ను సూచిస్తోంది. ముంబై బీజేపీ చీఫ్ తన విమర్శల్ని కొనసాగిస్తూ.. ‘‘వెర్సోవా-మాల్వానీ పరిస్థితి ముంబైలోని ప్రతీ ప్రాంతానికి వ్యాపించవచ్చు. ప్రతీ ముంబై పౌరుడి ఇంటి ముందు ఒక బంగ్లాదేశీయుడు ఉంటాడు. రేపు, ప్రతీ వార్డులో హరూన్ ఖాన్ ఎన్నిక కావచ్చు. ఖాన్ ముంబైకి మేయర్ కావచ్చు. అది జరగనివ్వొద్దు’’ అని ప్రజల్ని కోరారు.
గూగుల్ 200 మంది AI కాంట్రాక్టర్ల తొలగింపు
గూగుల్ యొక్క AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను తొలగించినట్లు వైర్డ్ నివేదించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో తొలగింపులు కొనసాగుతున్నాయి. వరుసగా గత మూడు నెలలుగా వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించిన గూగుల్, తాజాగా 200 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. . AI ప్రాజెక్టులలో పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్టర్లను గూగుల్ తొలగించింది. గూగుల్ యొక్క జెమిని నుండి వచ్చిన ప్రతిస్పందనలను సమీక్షించడం, సవరించడం, గూగుల్ సెర్చ్ కోసం AI- జనరేటెడ్ సారాంశాలను మెరుగుపర్చడం వంటి పనులపై కాంట్రాక్టర్లు పనిచేశారు. లేఆఫ్‌కు గురైన వారు జెమిని, ఏఐ టూల్స్ ప్రాజెక్టులలో ఉన్నవారే కావడం గమనార్హం. అయితే, ఎలాంటి సమాచారం లేకుండా, ముందస్తు హెచ్చరిక ఇవ్వకుండానే తమను ఉద్యోగాల నుంచి తొలగంచారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. ఇలా మారిందేంటి..?
ఒకప్పుడు ఆ బ్యూటీ తెలుగులో వరుస సినిమాల్లో మెరిసింది. 90స్ కిడ్స్ కు ఆమె బాగా తెలుసు. ఆమె చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మెలోడీ సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ రేంజ్ లో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ఆమెను చూస్తే అసలు ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ భామ.. ఇప్పుడు ఇలా ఎందుకు మారిందో అర్థం కావట్లేదని ఆమె ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ హీరోయిన్ రవళి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిందే. ఆ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆమె చేసిన దాంట్లో ఒరేయ్ రిక్షా, శుభాకాంక్షలు, జయభేరి లాంటి సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. 18 ఏళ్లకే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులోకి వచ్చి పెళ్లి సందడి మూవీతో బాగా పాపులర్ అయింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీని వదిలేసింది. యాక్టింగ్ పక్కన పెట్టి ఫ్యామిలీ, పిల్లలతో గడుపుతోంది. చాలా కాలం తర్వాత నేడు తిరుమల దర్శనానికి వచ్చింది. అక్కడ ఆమెను చూసిన వారంతా ఫొటోలు తీయగా వైరల్ అవుతున్నాయి.
ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
మౌళి తనూజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసుకునే దగ్గరి నుంచి సినిమాలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేదాకా ఎదిగాడంటే మామూలు విషయం కాదు. సినిమా బాగుంటే చిన్న సినిమానా.. పెద్ద మూవీనా అని చూడకుండా ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకుంటారు. అది కామన్. కానీ ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. మౌళి తన సినిమాను ప్రమోట్ చేసుకున్న విధానం. సొంతంగా కంటెంట్ క్రియేటర్ అయిన మౌళికి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. దాన్ని కరెక్ట్ గా వాడుకున్నాడు మౌళి. అంతకు ముందు కూడా సినిమాలకు ప్రమోట్ చేసిన అలవాటు ఉంది. అందుకే తన సినిమాకు సొంతంగా ప్రమోషన్ కంటెంట్ రాసుకుని మరీ ప్రమోట్ చేశాడు. అతనితో పాటు జై కృష్ణ తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి కామెడీగా చేసిన కంటెంట్ ప్రమోషన్ మామూలుగా వైరల్ కాలేదు. లిటిల్ హార్ట్స్ సినిమాను కూడా కామెడీ రీల్స్ తో ప్రమోట్ చేయడం వల్లే ఎక్కువ మందికి సినిమా రీచ్ అయింది. పెద్ద స్టార్లు వచ్చి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకుండా.. తన సొంత ట్యాలెంట్ తోనే మౌళి ఈ మూవీని ప్రమోట్ చేసిన విధానం బాగుంది. ఒక సినిమాలో తాను హీరో అనే విషయాన్ని కూడా మర్చిపోయి.. సాదా సీదాగానే తన సినిమాను ప్రమోట్ చేశాడు. అది అందరికీ సాధ్యం కాదు. హీరోలు అంటే కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకొని ప్రమోషన్ల కోసం స్టైల్ గా నాలుగు ఇంటర్వ్యూలు ఇవ్వడం కామన్. అది కాదు కావాల్సింది జనాలకు. కొత్తగా ప్రమోట్ చేసి జనాలకు సినిమా గురించి తెలియజేయడం. అదే మౌళి చేశాడు. మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత కూడా కామన్ గానే థియేటర్ల చుట్టూ తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేశాడు. స్టేజి మీదకు ఎక్కినా తాను హీరోలా కాకుండా కామన్ యువకుడిగా ప్రవర్తించి అందరి దృష్టిలో సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు. ఇలా ప్రమోట్ చేయడం వల్లే మూవీకి ఎక్కువ రీచ్ వచ్చింది. ఈ విషయంలో అతన్ని చూసి అందరూ నేర్చుకోవాల్సిందే.