ఎన్టీఆర్ జిల్లాలో మహిళ సూసైడ్ కలకలం.. సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యేకి వినతి..!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అబ్బూరి మాధురీ అనే మహిళ సూసైడ్ కలకలం రేపుతోంది.. సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి మాధురి.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెల్లడించింది.. చందర్లపాడు మండలం (విభరింతలపాడు) సంగళ్లపాలెంలో అబ్బూరి మాధురి.. తన కుటుంబంతో కలిసి ఉంటుంది.. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లగా ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ అవమానించటంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకుంటున్నానని.. తన సూసైడ్ కు రవితేజ కారణమని.. అతడిపై చర్యలు తీసుకోవాలని.. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను తన సెల్ఫీ వీడియోలో కోరింది మాధురి.. ఆ తర్వాత పురుగుల మందు తాగటంతో మాధురి మృతి చెందింది. సూసైడ్ కు ముందు మాధురి మాట్లాడిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
అధికారులపై హోంమంత్రి అనిత సీరియస్.. చర్యలు తప్పవు..!
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. విజయనగరం కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశానికి హాజరైన ఆమె.. డీఆర్సీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏదో కాకి లెక్కలతో కాగితాల దొంతులుగా ప్రెస్‌నోట్ మా కిచ్చి వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు.. కానీ, ఆ పేపర్లు తర్వాత చెత్త బుట్టలోకి వెళ్లిపోతున్నాయి.. అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు.. కానీ, ఇక ఇలాంటి పద్దతికి చెల్లు చీటు చెప్పండి… ఇక నుంచి ముందే కలెక్టర్ వద్ద గత డీఆర్సీలో ఏం చేశామో చర్చించండి.. ఎంత వరకు పూర్తి చేశామో ముందే బ్రీఫ్ చేసి పెట్టుకోండి అని ఆదేశించారు.. విజయనగరం వెనుకబడిన జిల్లా అంటారు.. ఎవ్వరన్నారు వెనుకబడిన జిల్లా అని… జిల్లాకి అన్ని వనరులు ఉన్నాయి.. వర్షపాతం అధికంగా ఉన్నాయి.. నీటి నిలువలు అధికంగా ఉన్నాయన్నారు హోంమంత్రి అనిత.. అధికారులు ఏం పని చేస్తున్నారో నాకు అర్ధం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ డీఆర్సీలో ప్రజాప్రతినిధులు ఏ సమస్యలు లేవనెత్తినా.. ఆ తర్వాత అది ఎంత మేర పరిష్కరించగలిగామో చెప్పాలి.. లేనిపక్షంలో కచ్చితంగా చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు.. ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలో హెవీ లోడ్స్ తో వెళ్లిన వాహనాలు ఎన్ని ఉన్నాయో ఆర్ అండ్ బీ, ఆర్టీవో సమన్వయంతో గుర్తించాలని అడిగా… కానీ, ఇంత వరకు ఎందుకు సమన్వయ సమావేశం పెట్టుకోలేదు? అని నిలదీశారు.. ఇలా అయితే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని ఆర్ అండ్ బీ అధికారులపై మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు..
దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది..
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తను సంగారెడ్డి సెంట్రల్ జైలులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిన్నారంలో ఏం జరుగుతుందో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను నాలుగుసార్లు ఎంపీగా అడిగినా సరైన సమాధానం లేదు అని పేర్కొన్నారు. దేశద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటికి అధికార యంత్రాంగం స్పందించడం లేదు అని ఆరోపించారు. దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అయితే, జిన్నారం, పటాన్ చెరుల్లో ఉన్న మదర్సాలలో చదువు చెప్పేందుకు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వకపోతే హిందూ బంధువులు విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతాం అని హెచ్చరించారు. జిన్నారం మదర్సాపై జిల్లా ఎస్పీ సరైన సమాధానం ఇవ్వకపోతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. మీరు దేశ ద్రోహులకు మద్దత్తు ఇస్తున్నారా అని రఘునందన్ రావు తెలిపారు.
రాత్రి 8 గంటలకు మోడీ ప్రెస్‌మీట్.. సర్వత్రా ఉత్కంఠ
ప్రధాని మోడీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మోడీ ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడతారా? లేదంటే ఇంకేమైనా కీలక ప్రకటన చేస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ చోటుచేసుకుంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధిపతులు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఉగ్రవాదులకు అండగా నిలిచిన పాకిస్థాన్‌కు భారత్ త్రివిధ దళాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. శత్రువుల నుంచి ఎలాంటి దాడులు ఎదురైనా తమ దళాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో అణు కేంద్రం ధ్వంసం అయినట్లు వస్తున్న వార్తలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది.
కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి.. ప్రతీ పాక్ నగరంపై భారత్ దాడి..
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది భారత్. ఇటు ఉగ్రవాదుల స్థావరాలను నాశం చేస్తూనే, మరోవైపు పాక్ మిలిటరీకి గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతను కూడా భారత్ బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు తమ మిలిటరీ శక్తిని చూస్తూ గర్వపడిన పాకిస్తాన్‌కి భారత్ గర్వభంగం చేసింది. తమతో పెట్టుకుంటే పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్‌లో కూడా దాడులు చేస్తామని నిరూపించింది. పాకిస్తాన్ ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్ కోట్, సర్గోదా, బహవల్పూర్, గుజ్రాన్ వాలా ఇలా ప్రతీ పాకిస్తాన్ నగరంపై భారత్ దాడులు చేసింది. ఈ నగరాల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు, మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ప్రధానంగా పాకిస్తాన్‌లో నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి. పంజాబ్, సింధ్, బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా. అయితే, ఈ నాలుగింటిలో పంజాబ్‌పై భారత్ విస్తృతంగా దాడులు చేసింది. నిజానికి పాకిస్తాన్ లో రాజకీయ, సైనిక నాయకత్వం అంతా పంజాబ్ నుంచే వస్తుంది. మిగిలిన ప్రావిన్సుల్లోని ప్రజల్ని రెండో శ్రేణిగా వీరు చూస్తుంటారు.
భారత్‌కి ప్రయోగశాలగా మారిన పాక్.. టర్కీ, చైనా ఆయుధాలు ఎక్స్‌పోజ్..
‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. భారత్ యాక్షన్‌లోకి దిగితే ఎలా ఉంటుందనే విషయం పాకిస్తాన్‌కి బాగా అర్థమైంది. ఇన్నాళ్లు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరిస్తూ వస్తున్న పాకిస్తాన్‌కి, అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఇదెలా ఉంటే, పాకిస్తాన్‌పై దాడి ఇప్పుడు టర్కీ, చైనాలకు నొప్పి కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ రంగం ఈ రెండు దేశాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ రెండు దేశాలకు చెందిన డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్ భారీగా కొనుగోలు చేసింది. అయితే, భారత్ జరిపిన దాడుల్లో ఈ రెండు దేశాల ఆయుధాలు, పరికరాలు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి. అదే సమయంలో భారత్ స్వయంగా అభివృద్ధి చేసుకున్న మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్‌తో పాటు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు చాలా సమర్థవంతంగా పనిచేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ భారత్‌కి ఇప్పుడు ఒక ప్రయోగశాలగా మారింది. ఎప్పుడైతే, ఆపరేషన్ సిందూర్ మొదలైందో భారత్ దేశంలో తయారైన ఆయుధాలను రియల్ టైమ్‌లో వినియోగించింది. ఇవి చాలా సమర్థవంతంగా పాకిస్తాన్ డ్రోన్లను, క్షిపణులను నిర్వీర్యం చేశాయి.
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
భారత్- పాకిస్తాన్ మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం రోజుల పాటు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కానీ, శనివారం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో.. భారత్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అన్ని రంగాలూ షేర్ మార్కెట్ లాభాల్లో కదలాడుతుంది. కాగా, స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి భారీ లాభాల్లో ఉంది. సుమారు 2,950 పాయింట్ల లాభంతో 82, 404 దగ్గర ముగిసింది సెన్సెక్స్. ఇక, 912 పాయింట్ల లాభంలో 24,920 వద్ద నిఫ్టీ ముగిసింది. అయితే, ఒకే రోజు స్టాక్ మార్కెట్లు సుమారు 3 శాతం లాభాలకు పైగా పెరుగుదల కనిపించింది. భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణతో మార్కెట్‌లో జోష్ పెరిగింది. మరోవైపు, అమెరికా- చైనా మధ్య కూడా టారిఫ్ చర్చలు సానుకూలంగా ముగిసాయి. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో.. యూఎస్- చైనా దేశాలు 90 రోజుల పాటు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం అమెరికా దిగుమతుల మీద చైనా 125 శాతం సుంకాలను విధిస్తోంది. తాజా ఒప్పందంతో 115 శాతం తగ్గింపు అంటే అమెరికా దిగుమతులపై చైనా పన్నులు పది శాతానికి దిగి రానున్నాయి. ఇక, చైనా దిగుమతులపై అమెరికా 145 శాతం పన్నులను విధించినప్పటికీ.. తాజా ఒప్పందంతో ఆ పన్నులు 30 శాతానికి దిగి వస్తాయి.
కొత్త ఫీచర్ లాంచ్ చేసిన ట్రూకాలర్.. ఏఐ టెక్నాలజీతో..
కొత్త నంబర్ వచ్చిందా? ఎవరిది అయిఉంటుంది అని ట్రూకాలర్‌లో వెతికేస్తున్నారు.. కొంతమంది ట్రూకాలర్ యాప్ వాడడంతో.. ముందే.. ఆ నెంబర్ ఎవరిదో పసిగడుతున్నారు.. అయితే, ధృవీకరించబడిన వ్యాపారాల నుండి సందేశాలను ఫిల్టర్ చేయడానికి ట్రూకాలర్ AI- ఆధారిత సందేశ IDలను పరిచయం చేసింది.. ట్రూకాలర్‌లో ఈ ఐడీలు ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చింది.. స్పామ్ టెక్స్ట్‌లతో నిండిపోయిన ఇన్‌బాక్స్‌లోని ప్రామాణిక సందేశాలను ఫిల్టర్ చేయడంలో వినియోగదారులకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ట్రూకాలర్ ఈ రోజు ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. మెసేజ్ IDలుగా పిలువబడే ఈ ఫీచర్ ద్వారా SMS ఇన్‌బాక్స్‌ను స్కాన్ చేయడానికి, ధృవీకరించబడిన వ్యాపారాల నుండి ఓటీపీలు, డెలివరీ అప్‌డేట్స్, టికెట్ బుకింగ్ స్టేటస్ సహా మరికొన్ని సేవలకే పరిమితం కాకుండా.. అన్ని సందేశాలను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తుంది. ట్రూకాలర్ ప్రకారం, ఈ సందేశాలు ఇన్‌బాక్స్‌లో ఆకుపచ్చ చెక్ మార్క్‌తో చూడవచ్చు.. ట్రూకాలర్ భారతదేశంతో పాటు 30 ఇతర దేశాలలో సందేశ ID లను ప్రవేశపెట్టినట్టు చెబుతోంది.. ముఖ్యమైన వ్యాపార సందేశాలను గుర్తించడానికి SMS ఇన్‌బాక్స్ స్కాన్ చేయడానికి ఈ ఫీచర్ AI, LLMలు ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీతో ప్రాసెసింగ్ చేయడం వల్ల వినియోగదారు డేటా సురక్షితంగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.. ట్రూకాలర్‌లోని మెసేజ్ ఐడీలు ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకే పరిమితం కాకుండా అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఇది ఇంగ్లీష్, హిందీ, స్వాహిలి మరియు స్పానిష్‌తో సహా అనేక ప్రపంచ, భారతీయ భాషలకు మద్దతుతో ప్రవేశపెట్టబడింది. ట్రూకాలర్ ఇతర ముఖ్యమైన సందేశాలను కూడా గుర్తించి హైలైట్ చేయగలదు, అవి సాంప్రదాయ SMS వర్గం వెలుపల ఉన్నప్పటికీ. మెసేజ్ ఐడీలు AIని ప్రభావితం చేసే సందేశాలలోని కీలక వివరాలను కూడా గుర్తించి ముఖ్యమైన వాటిని హైలైట్ చేస్తుంది.. తద్వారా వినియోగదారుడు వెంటనే స్పందించడానికి వీలు కల్పిస్తుంది..
ఆపరేషన్ సింధూర్పై డీజీఎంవో ప్రెస్మీట్.. కోహ్లీ రిటైర్మెంట్పై చర్చ
ఆపరేషన్ సింధూర్ గురించి ఇవాళ డీజీఎంవోలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ మీటింగ్ లో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఓ క్రికెట్ స్టోరీ చెప్పుకొచ్చారు. మన ఎయిర్ ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కఠినమైన అంశమని తెలిపారు. ఈ అంశాన్ని ఆయన వివరిస్తూ.. క్రికెట్ లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అయితే, ఈరోజు విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.. అతను నా ఫెవరేట్ క్రికెటర్ అని పేర్కొన్నారు. అయితే, 1970 దశబ్దంలో యాషెస్ సిరీస్ ఒకటి జరిగింది.. ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అప్పుడు, ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను ఆసీస్ బౌలర్లు జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీలు కూల్చేశారు.. దీంతో ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఓ నానుడి వెలుగులోకి వచ్చింది.. యాషెస్ టూ యాసెస్, డస్ట్ టు డస్ట్, ఇఫ్ థామో డోంట్ గెట్ యా, లిల్లీ మస్ట్ అనే ప్రావర్బ్ పుట్టిందన్నారు.
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ షూట్ రీ స్టార్ట్..
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ షూటింగ్ ఈ రోజు రీ స్టార్ట్ అయింది. మూవీ టీమ్ ఓ పోస్టర్ తో ఈ అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టర్ లో సుజిత్, అతని టీమ్ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సెట్స్ లో పవన్ కల్యాణ్ ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి వేరే నటులతో చేస్తున్నారు. త్వరలోనే పవన్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ప్రకటించింది. ‘మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించేద్దాం’ అంటూ ప్రకటించింది. పవన్ కల్యాణ్ వరుసగా డేట్లు ప్రకటించారంట. వీలైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేసేసి సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చెప్పారంట. ఓ వైపు హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్.. ఇప్పుడు ఓజీని పూర్తి చేసేసి మళ్లీ రాజకీయాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ స్టార్ట్ అయి రెండేళ్లు కావస్తోంది. కానీ ఎన్నికల టైమ్ లో పవన్ బిజీ అయిపోవడం వల్ల ఆగిపోయింది. ఈ సారి మాత్రం బ్రేక్ లేకుండా కంప్లీట్ చేయబోతున్నారు. త్వరలోనే మూవీ షెడ్యూల్ ను ప్రకటించనున్నారు.
చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. అతని మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొన్న విగ్రహం ఆవిష్కరణకు చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, క్లీంకార ఈ వేడుకకు హాజరయ్యారు. చరణ్, అతని పెట్ డాగ్ ను కలిపేసి మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. రామ్ చరణ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరణ రోజు పెద్దగా ఫొటోలు ఏవీ బయటకు రాలేదు. ఫ్యాన్స్ కొందరు తీసిన పిక్స్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అందులో కూడా రామ్ చరణ్ ఒక్కడే కనిపించాడు. తాజాగా చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కలిసి రామ్ చరణ్ మైనపు విగ్రహంతో దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోఫాలో రామ్ చరణ్ తన పెట్ డాగ్ తో కూర్చుని ఉన్నట్టు మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహంతో చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన కలిసి పిక్స్ దిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ అందరూ ఈ ఫొటోలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా టాలీవుడ్ నుంచి ముగ్గురే ఈ ఫీట్ అందుకున్నారు. మున్ముందు మరింత మంది హీరోలు ఈ ఫీట్ అందుకుంటారేమో చూడాలి.