ప్రపంచకప్ విజేతలు.. మహిళా అంధుల క్రికెట్ జట్టుకు పవన్ కల్యాణ్ సన్మానం..
ప్రపంచ కప్ విజేతలుగా భారత్‌కు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును సన్మానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న ఈ మహిళా క్రీడాకారిణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు, కోచ్‌లకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులు అందించి ఘనంగా సత్కరించారు. అంధ మహిళా క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణమని ఈ సందర్భంగా ప్రశంసించారు పవన్ కల్యాణ్.. వారి ప్రాక్టీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తోందని, జట్టు ప్రతినిధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ కప్ విజేతల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్లు.. దీపిక (జట్టు కెప్టెన్), పాంగి కరుణా కుమారి ఉన్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామంలోని సమస్యలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని తంబలహట్టి తండాకు రహదారి అవసరమని ఆమె చెప్పగా, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణ కుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
2026 నాటికి వెలిగొండ పూర్తి చేసి నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం..
వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2026 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక రైతులతో కలిసి వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్‌లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్లి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల.. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. జగన్ పాలనలో వెలిగొండకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు మంత్రి నిమ్మల.. ప్రాజెక్టు నిర్మాణంపై గత ప్రభుత్వ హయాంలో తీవ్ర లోపాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తికాకుండానే జాతికి అంకితం చేసినట్టుగా ప్రకటించడం “దగా, మోసం” అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులో ఇంకా రూ.4,000 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పూర్తయినట్టుగా ప్రకటించడం చరిత్రహీన చర్య అన్నారు. ఇక, కూటమి ప్రభుత్వం విధులు చేపట్టిన తర్వాత హెడ్ రెగ్యులేటర్ వద్ద 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటింగ్ పనులు పూర్తి చేశామని.. కేవలం 18 నెలల్లో 3 కిలోమీటర్ల క్లిష్టమైన టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి అయ్యాయని వివరించారు నిమ్మల.. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు, గ్యాంట్రీల సంఖ్యను మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశాం.. ఫీడర్ కెనాల్‌లో అవసరమైన 45,000 క్యూబిక్ మీటర్ల హార్డు రాక్ పనుల్లో 28,000 క్యూబిక్ మీటర్ల పూర్తి చేశాం.. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్ల టెండర్లు పూర్తి చేశాం.. టెండర్ పనులు ఈ డిసెంబరు నుంచే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చాం.. తీగలేరు కెనాల్‌కు సంబందించి 600 మీటర్ల టన్నెల్ లైనింగ్, గేట్ల వ్యవస్థ నిర్మాణం కొనసాగుతుంది అన్నారు..
అలర్ట్.. మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో రాకపోకలు బంద్..!
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డులో ఈ రాత్రి నుండి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున మారేడుమిల్లి- చింతూరు ఘాట్ రోడ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్యాసింజర్ బస్సులు రాకపోకలు నిలిపి వేయనున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత.. చింతూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని, చింతూరు ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు, ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా వారిని ఆదుకుంటామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మృతులు కుటుంబాలకు ఏడు లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల 50 వేల రూపాయాలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడటమే ప్రమాదానికి గురి కారణాలుగా చెప్పారు. పొగ మంచు కారణంగా బస్సు బోల్తా పడి ఉండొచ్చునని వచ్చే నవంబర్ వరకు బస్సుకు రవాణా శాఖ జారీచేసిన ఫిట్‌నెస్ ఉందని అన్నారు.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమిస్తామని అన్నారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..
మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహాయాలపై కీలక చర్చలు జరపనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.. అదే రాత్రి కేంద్రంలోని కీలక నాయకులను, ఉన్నతస్థాయి అధికారులను ఆయన కలిసే అవకాశం ఉంది.. ఇక డిసెంబర్ 19న సీఎం చంద్రబాబు మొత్తం రోజంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌లో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు కానున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులు, ఆమోదాలు ఇలా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 18వ తేదీ రాత్రే కేంద్రంలోని పలువురు టాప్ లీడర్లతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పర్యటన కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి..
ఎన్నికల్లో ఓటమి.. సెల్ టవర్ ఎక్కి నిరసన..!
స్థానిక పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఖమ్మం జిల్లాలోని హర్యా తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాలోతు రంగా అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఎన్నికల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన, నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా సెల్ టవర్ ఎక్కారు. సెల్ టవర్ పై నుంచి మాలోతు రంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం తాను భారీగా ఖర్చు పెట్టానని, అయితే తమ ప్రత్యర్థి పార్టీ వారు రిగ్గింగ్‌కు పాల్పడి అక్రమంగా విజయం సాధించారని తీవ్రంగా ఆరోపించారు. మాలోతు రంగా సెల్ టవర్ పై నుంచి కిందకు దిగేందుకు ససేమిరా అంటుండటంతో హర్యా తండాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓటమి చెందిన అభ్యర్థిని సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి..
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన సొంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అభ్యర్థి ఓటమికి బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై, తమ వెనుక కొన్ని శక్తులను ఉంచి నడిపించాయని ఆయన ఆరోపించారు. ఓటమిపై సమీక్ష నిర్వహించి, రెండో విడత స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు పార్టీ సింబల్స్ కాకుండా వ్యక్తిని చూసి ఓటు వేస్తారని అనిరుధ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థి గత రెండు ఎన్నికల్లో కూడా ఓటమిపాలవడం, ఈసారి ఆ వ్యక్తికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తన ఓటమికి స్వయం విమర్శ చేసుకుంటూ, తాను ఇతర గ్రామాల ఇష్యూస్‌లో ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల, సొంత ఊరే కదా సపోర్ట్ చేస్తారులే అనుకొని కొంచెం నిర్లక్ష్యం జరిగిందేమోనని అనుకుంటున్నానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.
దేశంలో తొలి డిజిటల్ జనగణన 2027లో..
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న మూడు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ నిర్ణయాలలో దేశంలో జరగబోయే జనగణన (Census)కు సంబంధించిన కీలక మార్గదర్శకాలు ఉన్నాయి. మంత్రి వైష్ణవ్ ప్రకటించిన వివరాల ప్రకారం, రాబోయే జనగణన దేశ చరిత్రలోనే మొట్టమొదటి డిజిటల్ జనగణన కానుంది. ఈ జనగణన ప్రక్రియకు సంబంధించి మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా నిర్ణయించడం జరిగింది. ఈ భారీ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది, రెండవ దశ ఫిబ్రవరి 2027లో పూర్తవుతుంది. ముఖ్యంగా, ఈసారి జరగబోయే జనగణనలో ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చారు. అదేమిటంటే, ఈసారి జనగణనలో కులం ఆధారిత గణనను కూడా చేర్చనున్నారు. ఈ చారిత్రాత్మక జనగణన నిర్వహణ కోసం కేంద్ర మంత్రివర్గం ఏకంగా రూ.11,718 కోట్లకు సంబంధించిన బడ్జెట్‌ను కూడా ఆమోదించింది. కేబినెట్ తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాల గురించి మాట్లాడుతూ.. మంత్రి వైష్ణవ్ దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలను కూడా ప్రస్తావించారు. దేశంలో దేశీయంగా ఉత్పత్తి పెరగడం వలన, ఆర్థికపరమైన నిర్ణయాల సానుకూల ఫలితంగా దేశానికి సుమారు రూ.60,000 కోట్ల విదేశీ కరెన్సీ ఆదా అవుతోందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
మద్రాస్ హైకోర్టు జడ్జికి మాజీల మద్దతు.. ఇండియా కూటమిపై విమర్శలు..
తమిళనాడు తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్యస్వామి దేవాలయ దీపం వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల, మద్రాస్ హైకోర్టు జడ్జి జీఆర్ స్వామినాథన్ సంచలన తీర్పు ఇచ్చారు. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించాలని ఆదేశించారు. డీఎంకే ప్రభుత్వ వాదనల్ని పట్టించుకోలేదు. 100 ఏళ్లకు పైగా సంప్రదాయంగా వస్తున్న కొండ దిగువన ఉన్న స్తంభానికి బదులుగా, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించారు. కొండపైన ఉన్న స్తంభం కూడా ఆలయ ఆస్తి అని స్పష్టం చేశారు. అయితే, ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది. న్యాయమూర్తిని తొలగించాలంటూ ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే పార్టీలకు సంబంధించిన 100 మందికిపైగా ఎంపీలు మద్దతు తెలుపుతూ రెండు రోజుల క్రితం స్పీకర్ ఓంబిర్లాకు ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని ఇచ్చారు. ఈ తీర్మానం ఇచ్చిన బృందంలో అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ, కనిమొళిలు ఉన్నారు. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఈ తీర్పు మత ఉద్రిక్తతల్ని పెంచుతుందని డీఎంకే వాదిస్తోంది. మధురైకి సమీపంలో ఉన్న కొండపై 6వ శతాబ్ధానికి చెందిన సుబ్రమణ్య స్వామి ఆలయం ఉంది. అదే కొండపై 14వ శతాబ్ధానికి చెందిన ఒక దర్గా ఉంది. దీంతో వివాదం రాజుకుంది.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల భేటీకి శశి థరూర్ డుమ్మా.. వరసగా మూడోసారి..
రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి శశి థరూర్ మరోసారి గైర్హాజరయ్యారు. ఆయన ఇలా చేయడం వరసగా ఇది మూడోసారి. పార్టీ కార్యకలాపాలు, సమావేశాలకు థరూర్ పదే పదే హాజరవ్వకపోవడం కాంగ్రెస్‌లో అసంతృప్తిని పెంచుతోంది. ముందస్తు సమావేశాలు, ప్రయాణాలు ఉన్నాయని థరూర్ చెప్పినప్పటికీ, కీలకమైన పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ ఎంపీల ఐక్యతను ప్రతిబింబించే సమావేశానికి రాకపోవడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్‌లో శశిథరూర్‌తో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో, బీజేపీకి శశిథరూర్ దగ్గరవుతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కూడా హస్తం పార్టీకి రుచించడం లేదు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ మీటింగ్‌కు చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీతో పాటు థరూర్ కూడా గైర్హాజరు అయ్యారు. ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి థరూర్ నిన్న రాత్రి కోల్‌కతా వెళ్లారు, అంటే ఆయన సమావేశానికి సమయానికి ఢిల్లీకి తిరిగి రాకపోవచ్చని తెలుస్తోంది.
పాకిస్థాన్‌లో హిస్టరీ రిపీట్ కానుందా.. భుట్టో-జియా తర్వాత మరో నియంత రాబోతున్నాడా?
పాకిస్థాన్‌లో మరోసారి హిస్టరీ రిపీట్ కానుందా.. భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పెద్ద యుద్ధం లేదా సైనిక చర్య తర్వాత, దాయాది దేశంలో ఒక నియంత ఉద్భవిస్తాడు. 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం తర్వాత, జనరల్ జియా-ఉల్-హక్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. కార్గిల్ యుద్ధం తర్వాత జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అసిమ్ మునీర్ నియంతగా మారే మార్గంలో ఉన్నాడని జోరుగా ప్రచారం వినిపిస్తుంది. అసిమ్ మునీర్ మొదట ఫీల్డ్ మార్షల్‌గా, ఆ దేశ రాజ్యాంగ సవరణ ద్వారా, రక్షణ దళాల అధిపతిగా (CDF) స్థాయికి ఎదగడం ఈ ప్రచారానికి స్పష్టమైన సూచనగా విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందిన 78 సంవత్సరాలలో 33 సంవత్సరాలు సైనిక నియంతల పాలనలో ఉంది. మొదటిసారిగా 1958లో జనరల్ అయూబ్ ఖాన్ పదవీచ్యుతి అయ్యాడు. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం అయూబ్ ఖాన్‌పై ఒత్తిడిని పెంచింది, కానీ ఆయన స్వయంగా సైనిక నియంత కాబట్టి, ఆ ఒత్తిడిని ఆయన తట్టుకొని ఉన్నాడు. కానీ పాక్ చరిత్రలో 1971 యుద్ధం ఒక కీలక మలుపుగా చెబుతారు. ఈ యుద్ధంలో పాకిస్థాన్ ఓటమి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. జనరల్ యాహ్యా ఖాన్ నాయకత్వంలో పాకిస్థాన్ ఈ ఓటమిని చవిచూసింది. ఈ పరాజయం ఆయనకు తన స్వదేశంలో తీవ్ర అవమానానికి గురి చేసింది. దీంతో దేశంలో తిరుగుబాటు జరుగుతుందనే పుకార్లు వ్యాపించాయి. ఆ సమయంలో దేశంలో నెలకొన్న ఈ అశాంతిని నివారించడానికి యాహ్యా ఖాన్ అధ్యక్ష పదవిని, ప్రభుత్వ పగ్గాలను డిసెంబర్ 20, 1971న అప్పటి శక్తివంతమైన, ప్రజాదరణ పొందిన పీపుల్స్ పార్టీ ప్రతిష్టాత్మక నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టోకు అప్పగించాడు.
ఇండియాలో డయాబెటిస్ సూపర్ డ్రగ్ ‘ఒజెంపిక్’ లాంచ్.. ధర, ఎలా వాడాలంటే.
డెన్మార్క్ ఔషధ తయారీదారు ‘‘నోవో నార్డిస్క్(Novo Nordisk)’’ భారతదేశంలో తన ప్రతిష్టాత్మక డయాబెటిస్ డ్రగ్ ‘‘ఒజెంపిక్’’(Ozempic)ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటోంది. HbA1c 7 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పెద్దలకు ఈ మందు అనుకూలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, రిస్క్ ఎక్కువగా ఉన్న పెద్దలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకలిని తగ్గించే ప్రభావం వల్ల వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగపడనుంది. ఒజెంపిక్‌లో సెమాగ్లటైడ్(Semaglutide) అనే హార్మోన్ ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. దీనిని వారానికి ఒకటి, ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 2,200గా ఉంది. భారతదేశంలో స్థూలకాయం పెరుగుతోంది. 25.4 కోట్ల మంది స్థూలకాంలో బాధపడుతుంటేన 35.1 కోట్ల మంది పొట్ట చుట్టూ కొవ్వుతో హెల్త్ రిస్క్ ఎదుర్కొంటున్నారు. దీంతోనే భారతదేశంలో GLP-1 మందులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
నితీశ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్.. అయినా ఆంధ్రకు నిరాశే!
ఫామ్ కోల్పోయిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఆడుతున్నాడు. ఆంధ్ర తరఫున ఆడుతున్న నితీశ్.. శుక్రవారం డీవై పాటిల్ అకాడమీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో మెరిశాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి మూడు బంతుల్లో హర్ష్ గవాలి, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్‌ను ఔట్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన అతడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి మూడు ఓవర్లలో 17 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ఇది టీ20 క్రికెట్‌లో నితీశ్ బెస్ట్ గణాంకాలు. నితీష్ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 25 రన్స్ చేశాడు. కీలక సమయంలో శిఖర్ భరత్ (39)తో కలిసి మూడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇద్దరు ఔటైన వెంటనే ఆంధ్ర ఇన్నింగ్స్ గాడి తప్పింది. 19.1 ఓవర్లలో 112 పరుగులకే ఆంధ్ర జట్టు ఆలౌట్ అయింది. 113 పరుగుల లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ 17.3 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. రిషభ్ చౌహాన్ (47), రాహుల్ బథమ్ (35 నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (22) ఫర్వాలేదనిపించాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటీదార్ డకౌట్ అయ్యాడు. నితీశ్ హ్యాట్రిక్ మ్యాచ్‌ను రసవత్తరం చేసినా.. చౌహాన్–బథమ్ ఇన్నింగ్స్ మధ్యప్రదేశ్‌ను విజయానికి చేర్చింది. టెస్టు, వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టుతో ఉన్న నితీశ్.. టీ20 సిరీస్‌లో మాత్రం చోటు కోల్పోయాడు.
అఖండలో బోయపాటి కొడుకుల పాత్రలివే
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 తాండవం పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో బోయపాటి శ్రీను ఇద్దరు కుమారులు భాగమవ్వడం విశేషం. బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు బోయపాటి హర్షిత్ ఈ సినిమాకు స్పెషల్ కాన్సెప్ట్స్ అందిస్తూ తన తండ్రి బోయపాటికి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో సహాయం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక, బోయపాటి చిన్న కుమారుడు వర్షిత్ ఈ సినిమాలో ప్రహ్లాదుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో ఒకటైన బాలమురళీకృష్ణ ఎంట్రీ సమయంలో ఈ ప్రహ్లాదుడి పాత్ర కనిపిస్తుంది. అలా అఖండ తాండవం సినిమాలో బోయపాటి పెద్ద కుమారుడితో పాటు చిన్న కుమారుడు కూడా భాగం అవ్వడం విశేషం. ఇక అఖండ తాండవం సినిమా ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్‌తో ప్రారంభమైంది. ఇక ఈరోజు కూడా బుకింగ్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెడుతోంది.