లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. డీజీపీకి సూచన
లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారన్న సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి హెచ్చరించారు.
భుజం నొప్పిగా ఉంది దవాఖానకు వెళ్లాలి.. హరీష్ రావుతో పాటు ఆసుపత్రికి పోలీసులు
తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ రావుకు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీ వద్దకు వెళ్లేందుకు అనుమతి లభించింది. భుజం నొప్పి ఎక్కువగా ఉందని ఆసుపత్రికి నాతో పాటు మీరు కూడా రండి అన్నారు. భుజం నొప్పికి చికిత్స అవసరమని తెలిపారు. అయితే హరీష్ రావుతో పాటు పోలీసులు కూడా ఆస్పత్రికి వెళ్లారు. నిన్న హరీష్ రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. నిన్న బీఆర్‌ఎస్ ఆందోళనల నేపథ్యంలో హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే గాంధీ ఇంటికి వెళుతున్న పలు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఆస్పత్రికి వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అంటారే..? పోలీసులపై తలసాని ఫైర్..
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద హైడ్రామా వాతావరణం నెలకొంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తలసాని నివాసం నుండి బయటకు వెళ్లకుండా మారేడ్ పల్లి పోలీసులు సముదాయించారు. అయితే.. తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్ళాలి తలసాని తెలిపారు. నేను ఎలాంటి సంఘటనలకు పాల్పడడం లేదు… అలా అనుకుంటే నా వెంట ఫాలో కండి అంటూ పోలీసులతో తలసాని అన్నారు. ఏదిఏమైనా బయటకు వెళ్లవద్దు పోలీసులు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. పోలీసులు బయటకు వెళ్ళనియకపోవడంతో తన క్యాంపు కార్యాలయం ముందు తలసాని కూర్చున్నారు. కూకట్‌పల్లిలోని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ర్యాలీ, సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని పలువురు బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రులు హరీశ్‌రావును నానక్‌రామ్‌గూడలో, పీ సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్‌పల్లిలో గృహనిర్బంధంలో ఉంచారు.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట
దేవినేని అవినాష్, జోగి రమేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌లకు ఊరట కల్పించింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్.. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు రక్షణ కల్పించాలని సూచించింది.. మరోవైపు.. ఈ కేసు విచారణకు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహకరించాలని పేర్కొంది.. ఇదే సమయంలో దేవినేని అవినాష్, జోగి రమేష్ తమ పాస్‌పోర్ట్‌ను హ్యాండోవర్ చేయాలని స్పష్టం చేసింది.. అయితే, వైసీపీ నేతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబాల్.. ఇక, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి , సిద్ధార్థ లూత్రా తమ వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు.. కాగా, టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో జోగి రమేష్, దేవినేని అవినాష్‌కు కాస్త ఊరట దక్కినా.. పాస్‌పోర్ట్‌ను హ్యాండోవర్ చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. దేవినేని అవినాష్, జోగి రమేష్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంకు మధ్యంతర రక్షణ కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు.. మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీం.. పాస్‌పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని సూచించింది.
గుండ్లవల్లేరు ఘటనలో బిగ్ ట్విస్ట్..! హిడెన్ కెమెరాలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సంచలన వ్యాఖ్యలు..
కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది.. అయితే.. అలాంటి ఏమీ లేదని తేల్చారు పోలీసులు.. కానీ, ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. గుండ్లవల్లేరు ఘటనలో నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కడప నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. రెండు షవర్లను చీకట్లో పోలీసులు ఎత్తుకెళ్లడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించడం.. తెల్లారేసరికి పరిస్థితులు మారుతాయి అనడం.. అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే గుండ్ల వల్లేరు ఘటనలో ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవని పోలీసులు అంటుంటే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మాత్రం నూటికి నూరు శాతం హిడెన్ కెమెరాలు అంశం దాగి ఉంది అనడం సంచలనంగా మారింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. సీబీఐ కేసులోనూ బెయిల్
మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దొరికింది. లిక్కర్ కుంభకోణం కేసులో ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే, న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడమేనని బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ అన్నారు. ‘‘అరెస్టు చేసిన సమయంలో అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తుతోంది. బెయిల్ పొందిన కేజ్రీవాల్‌ను నిరాశపర్చడం కోసమే అరెస్టు చేసినట్టుగా అనిపించింది అన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ తర్వాత జూన్ నెలలో ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దాదాపు ఆరు నెలల జైలు శిక్ష అనభవించిన తర్వాత ఆయన బయటకు రానుండడంతో ఆప్ నేతలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు విధించిన సుప్రీంకోర్టు.
అదానీపై హిండెన్‌బర్గ్ మరో షాక్…స్విస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్
గౌతమ్ అదానీ హిండెన్‌బర్గ్ భూతం నుంచి బయటపడ్డాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్‌లపై అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ మరో బాంబు పేల్చింది. హిండెన్‌బర్గ్ గౌతమ్ అదానీని అంత తేలికగా వదిలిపెట్టడం లేదని ఇది రుజువు చేస్తుంది. ఈసారి అమెరికా కంపెనీ చేసిన స్విస్ బ్యాంకుకు సంబంధించిన విషయాలను బయటపెట్టింది. మనీలాండరింగ్, అదానీ గ్రూప్ మోసంపై దర్యాప్తులో భాగంగా స్విస్ బ్యాంక్ 31 కోట్ల డాలర్లకు పైగా అంటే రూ. 2600 కోట్లను స్తంభింపజేసిందని హిండెన్‌బర్గ్ తాజా నివేదిక పేర్కొంది. దాదాపు 3 ఏళ్లుగా ఈ విచారణ సాగుతోంది. అదానీ గ్రూప్‌కి సంబంధించిన ఈ తాజా కేసు అదానీ గ్రూప్‌కు ఆందోళన కలిగిస్తుంది. అది కూడా నిధుల సమీకరణ కోసం రిటైల్ ఇన్వెస్టర్లను ఆశ్రయించాలని గ్రూప్ యోచిస్తున్న తరుణంలో. ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి అదానీ గ్రూప్ షేర్లపైనే ఉంటుంది. శుక్రవారం నాడు అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యే అవకాశం ఉంది.
చైనాలో అండర్ వేర్ తుపాన్.. ఆశ్చర్యపోయిన జనం
పొరుగు దేశం చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకో తెలియదు గానీ వింతలన్నీ ఆ దేశంలోనే జరుగుతాయి. అలాంటి కొత్త వింత సంఘటన మరొకటి జరిగింది. దేశంలో అండర్ వేర్ తుపాను ఏర్పడింది. దీనిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. తుపాను కారణంగా భారీ మొత్తంలో లోదుస్తులు ఆకాశంలో ఎగిరిపోయాయి. ఎగిరిపోతున్న లోదుస్తులను చూసి అక్కడి ప్రజలు షాక్ అయి చూస్తుండిపోయారు. లోదుస్తుల తుఫాను వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ బలమైన గాలులకు ప్రజల బట్టలు ఎగిరిపోయాయి. సెప్టెంబర్ 2న ప్రజల లోదుస్తులు వారి బాల్కనీల నుండి ఎగిరిపోయాయి. ప్రస్తుతం చైనాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు వానలు పడాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఈసారి వర్షాలనికి బదులు ఆకాశం నుంచి లోదుస్తులు వానలా పడ్డాయి. ఈ వింత దృశ్యాన్ని చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూర్య ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు?
తమిళ్ స్టార్ హీరో సూర్య చేస్తున్న కంగువ కోసం కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు ఫ్యాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైర్లు అవుతాను. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ విజువల్స్ తో కూడిన సినిమా “కంగువ” వాయిదా పడింది. ఈ చిత్రానికి అసలు విడుదల తేదీ అక్టోబర్ 10. అయితే, రజనీకాంత్ ‘వెట్టయన్’ ఆ తేదీని లాక్ చేయడంతో “కంగువ” టీమ్ మరో తేదీని ఎంచుకోవలసి వచ్చింది. అనేక సమీకరణాలను బట్టి లెక్కలు వేసుకున్న తర్వాత సినిమాని నవంబర్ 14వ తేదీన రిలీజ్ చేసినందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొదట్లో, నిర్మాతలు “పుష్ప 2” వాయిదా గురించి ఊహాగానాల కారణంగా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయొచ్చు అనుకున్నారు.. అయితే కచ్చితంగా పుష్ప డిసెంబర్ 6న రావడం ఖాయమని మేకర్స్ తేల్చి చెప్పడంతో నవంబర్ 14వ తేదీని కొత్త తేదీగా ఎంచుకున్నారు. నిజానికి “కంగువ” వంటి భారీ బడ్జెట్ చిత్రానికి ఇది సరైన తేదీ కాదు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో భారతదేశం అంతటా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ సినిమాకి హిందీ మార్కెట్ కీలకం కానుంది. శివ దర్శకత్వంలో కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆడేందుకు చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు..
సెప్టెంబర్ 19 నుంచి భారత క్రికెట్ జట్టు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. తొలి టెస్టు చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగనుంది. చెన్నై చేరుకోగానే ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీడియోలో కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత రోహిత్, విరాట్‌లు టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇకపోతే., రోహిత్ సారథ్యంలోని 16 మంది సభ్యుల జట్టులోకి కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ తిరిగి వచ్చారు. కొత్తగా యశ్ దయాళ్‌కు కూడా టీమ్‌లో అవకాశం దక్కింది. ఒకసారి మొదటి టెస్ట్ కు భారత జట్టు గమనించినట్లైతే ఇలా ఉంది. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ , శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ . యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా మరియు యశ్ దయాల్.