మళ్లీ మూతపడిన నెల్లిమర్ల జూట్‌మిల్..
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్‌మిల్ మరోసారి మూతపడింది. జూట్ కొరతను కారణంగా చూపి కర్మా గారాన్ని లాకౌట్ చేస్తున్నట్టు యాజమాన్య ప్రకటించింది. గడచిన వారం రోజులగా ఉద్యోగులకు ఎలాంటి పని చెప్పకుండా ఖాళీగా ఉంచింది యాజమాన్యం… ఇలాగా గతంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన గురయ్యారు. ఇప్పుడు లాకౌట్ ప్రకటించడంతో మిల్లులో పనిలేక, వేరేపనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడుతున్నారు. అయితే, జూట్‌మిల్లులో సుమారు 200 మంది రెగ్యులర్, మరో 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ముడి సరుకు కొరత పేరిట యాజమాన్యం మిలును అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.. కొన్నేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించడంలోయాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందటం లేదంటున్నారు.. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా ఉండిపోయాయని.. ఇప్పుడు ఏకంగా లాకౌట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, వెంటనే ఈ వ్యవహారంలో.. ప్రభుత్వం జోక్యం చేసుకొని జూట్ మిల్‌ను తెరిపించాలని.. తమకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగులు, కార్మికులు..
డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్.. ఇప్పుడు రైతు నుంచి.. గతంలో చంద్రబాబు ఇంటి సర్వే కోసం లంచం డిమాండ్..
చిత్తూరు జిల్లా శాంతిపురం మండల డిప్యూటీ సర్వేయర్ ఎస్.సద్దాం హుస్సేన్‌ను సస్పెండ్ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు.. ఓ రైతు నుంచి సర్వే పని పూర్తి చేయడానికి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశారని డిప్యూటీ సర్వేయర్ పై అభియోగాలు నమోదు చేశారు.. అయితే, రైతు ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు.. అది నిజమేనని నిర్ధారణకు వచ్చారు.. దీంతో.. అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు జాయింట్ కలెక్టర్.. మరోవైపు.. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి సర్వే చేయడానికి కూడా లంచం డిమాండ్ చేశాడట సద్దాం.. శాంతిపురం మండలం శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి.. చంద్రబాబు నాయుడు గతంలో స్థలాన్ని కొనుగోలు చేశారు.. అది వ్యవసాయ భూమి కావడంతో భూవినియోగ మార్పిడి, సబ్ డివిజన్ కోసం.. టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు.. ఈ సమయంలో 1.80 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడట డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్.. గత కుప్పం పర్యటన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకోచ్చిన స్దానిక కుప్పం నేతలు.. ఆ తర్వాత ఓ రైతు పొలం సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేయడం.. ఆ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడం.. విచారణలో అది నిజమేనని తేలడంతో.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో.. డిప్యూటీ సర్వేయర్‌ను సస్పెండ్ చేశారు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు.
ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇచ్చిన జనసైనికులు.. ఈఎంఐ మాత్రం కట్టుకోవాలి..!
ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరగాలన్నా.. అసెంబ్లీకి వెళ్లాలన్న.. ఇతర సమావేశాలు, సమీక్షలు, మీటింగ్‌లకు వెళ్లాలన్నా.. ఇబ్బందిగా ఉందని గుర్తించిన జనసైనికులు.. తమ నేత కోసం అంతా చందాలు వేసుకున్నారు.. కరాటం రాంబాబు కుటుంబ సభ్యులతో పాటు.. బుట్టాయగూడెం గ్రామ జనసైనికులు కొంత నగదు సేకరించారు.. ఆ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి.. టయోటా ఫార్చ్యూనర్ కారు బుక్ చేశారు.. ఆ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గిఫ్ట్‌గా ఇచ్చారు.. అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది.. డౌన్‌పేమెంట్ వరకు వారు చెల్లించారు.. కానీ, మిగతా మొత్తాన్ని ఈఎంఐల రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించాల్సి ఉంటుంది.. ఎందుకంటే డౌన్‌పేమెంట్ డబ్బు వరకు చెల్లించారు.. మొగతా మొత్తాన్ని ఎమ్మెల్యేకు నెలవారి వచ్చే జీతంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు అభిమానులు.. మొత్తంగా తమ ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక సామాన్య నిరుపేద రైతుని ఎమ్మెల్యేగా గెలిపించడమే కాక 175 ఎమ్మెల్యేల్లో మా ఎమ్మెల్యే ఏ మాత్రం తీసిపోడు అనే విధంగా కరాటం రాంబాబు సోదరుల చేతుల మీదుగా ఈ రోజు జన సైనికుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కారును అందజేశారు. కాగా, కరాటం రాంబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బాలరాజు.. 2019లో జనసేన తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. కానీ, ఎక్కడా వెనుదిరగకుండా.. రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేశారు.. ఇక, 2024 ఎన్నికల్లో పోలవరం సీటు ఎవరికి అనే చర్చ సాగినా.. చివరికి కూటమి జనసేనకే పోలవరం సీటు కేటాయించింది.. దాంతో మరోసారి బాలరాజుకే సీటు కేటాయించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూటమి మద్దతు.. జనసేన నేతలు, కార్యకర్తలు.. మొక్కవోనీ దీక్షతో అహర్నిశలు కష్టపడి.. చిర్రి బాలరాజును గెలిపించి.. అసెంబ్లీకి పంపించారు.. ఇప్పుడు.. కారును గిఫ్ట్‌గా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పోలవరంలో మూడో రోజు నిపుణుల బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మళ్లీ ఫోకస్ పెడుతోంది.. అందులో భాగంగా.. ప్రాజెక్టులో ఉన్న ఇబ్బందులను అదిగమించే ప్రయత్నాలు చేస్తోంది.. దీనికోసం విదేశీ నిపుణులను రంగంలోకి దింపింది.. ఇక, ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు రెండు రోజుల నుంచి విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తోంది. గత రెండు రోజులపాటు పోలవరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను పరిశీలించిన బృందం మూడవ రోజు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణులబృందం మూడో రోజు డీ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని రాతిని పరిశీలించారు. మరిన్ని నమూనాల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది. ఈరోజు, రేపు ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు వివరాలు సేకరించిన అనంతరం నిపుణుల బృందం తుది నివేదికను అందించనుంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించి ఎగువ , దిగువ కాపర్ డ్యాం, డి వాల్, పనులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న బృందం ఆయా పనులకు సంబంధించిన వివరాలను జల వనరుల శాఖ అధికారుల నుండి సేకరిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు పనులపై ఆరా తీశారు.. ఇబ్బందులు, ప్రాజెక్టులో లోపాలు.. తదితర అంశాలపై దృష్టిపెట్టారు.. ఆ తర్వాత విదేశీ నిపుణులను రంగంలోకి దింపిన విషయం విదితమే.
బొగతలో జల సవ్వడి.. కనువిందు చేస్తున్న నీటి దార..
తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. తొలకరి వర్షాలతో బొగత జలపాతంపరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులగా ఎగువ ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీటి దార పర్యాటకులు కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జల సవ్వడితో జలపాతం అందాలను చూసి పర్యటకులు మురిసిపోతున్నారు. వర్షాలతో నిండిన బొగత జలాశయానికి చూసేందుకు పర్యాటలకు పోటెత్తారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న నీటి ధారలో జలకాలాడేందుకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు బొగత జలపాతానికి ప్రజలు పోటెత్తారు. జల సవ్వడితో అక్కడి వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు వస్తున్న పర్యాటకులతో బొగత జలాశయం నిండిపోయింది. నయాగరా జలశయానికి తలపించే వాతావరణంలో పర్యటకుల సందడి మొదలైంది. ఈ జలశయానికి చూసేందుకు వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జలపాతంలో దిగివ జలసవ్వడిలో జలకాలాడుతూ ఆనందంతో గడిపారు. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో వరద ప్రవాహం ఉండే అవకాశం ఉండడంతో పాటు జలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్దేశిత ప్రాంతం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు ఆ ప్రాంతం దాటి వెళ్లకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
హైదరాబాద్ ప్రజలు అలర్ట్.. 4,5న నీళ్లు బంద్..!
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేయనున్నారు. 4వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి శుక్రవారం 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు రిజర్వాయర్లలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వివరించారు. షేక్‌పేట, భోజగుట్ట రిజర్వాయర్ (లోప్రెసర్), జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నల్గండ్ల, చందానగర్, హుడాకాలనీ, హఫీజ్‌పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ రెండు రోజులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు కోరారు. తాజాగా.. జూన్ 26, బుధ, 27వ తేదీల్లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫేజ్-2 తాగునీటి సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) ప్రభావిత ప్రాంతాల నివాసితులకు నీటిని పొదుపుగా ఉపయోగించాలని సూచించింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఫేజ్-2 గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నీటిని అందిస్తోంది. అయితే కొండాపూర్ పంప్ హౌస్ లోని రెండో పంపు ఎన్ ఆర్ వీ వాల్వ్ అనూహ్యంగా మరమ్మతులకు గురికావడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీనితో NPA, మీర్ ఆలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, అల్లబండ, మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బుద్ధనగర్, తదితర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ 4, 5 తేదీల్లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రజలు మండిపడుతున్నారు. రెండు వారాలకు ఒకసారి నీటిని బంద్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందువులపై వ్యాఖ్యలు.. రాహుల్ ప్రసంగంలోని చాలా భాగాలు డిలీట్
లోక్‌సభలో సోమవారం విపక్ష నేత రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో చేసిన పలు వ్యాఖ్యలు రికార్డుల నుండి తొలగించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులు, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ గురించి వ్యాఖ్యానించడం గమనార్హం. తమను తాము హిందువులుగా చెప్పుకునే వారు 24 గంటలూ హింస, ద్వేషాలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రకటనపై ప్రధాని మోడీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా పేర్కొనడం తీవ్రమైన విషయమని అన్నారు. సోమవారం రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా తొలి ప్రసంగం చేశారు. బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘హిందువులమని చెప్పుకునే వారు 24 గంటలూ హింస, ద్వేషం, అబద్ధాలు చెబుతూనే ఉంటారు. వాళ్ళు అస్సలు హిందువులు కాదు. సత్యంతో పాటు నిలబడాలని, ఎప్పుడూ సత్యం నుండి వెనక్కి తగ్గకూడదని హిందూ మతంలో స్పష్టంగా వ్రాయబడింది. అహింస వ్యాప్తి చెందాలి. రాహుల్ ప్రకటనపై ప్రధాని మోడీ అభ్యంతరం వ్యక్తం చేయగా, నేను బీజేపీని హింసాత్మకంగా అభివర్ణించానని, నరేంద్ర మోడీది సంపూర్ణ హిందూ సమాజం కాదని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ మొత్తం హిందూ సమాజం కాదు. ఆర్ఎస్ఎస్ మొత్తం హిందూ సమాజం కాదు’ అన్నారు.
అప్పటికే నలుగురు భార్యలు.. మరో పెళ్లి చేసుకున్న డాక్టర్.. కట్ చేస్తే
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వివాహిత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీకి చెందిన ఓ వైద్యుడు మొదట తన మతాన్ని దాచిపెట్టి తనతో ప్రేమ వ్యవహారం నడిపాడని ఆ మహిళ ఆరోపించింది. ఆమెను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తర్వాత దేవబంద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ మహిళను బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ వైద్యుడు అప్పటికే నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడని మహిళకు తెలిసింది. పెళ్లయిన తర్వాత డాక్టర్ భర్త తనను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడని మహిళ ఆరోపించింది. అతడిని ఓ గదిలో బంధించారు. అక్కడ సీసీ కెమెరాను అమర్చారు. దీని కారణంగా డాక్టర్ ప్రతి క్షణం అతనిని పర్యవేక్షించేవారు.. కొట్టేవాడు. అంతే కాదు ఆ వైద్యుడు తన స్నేహితులతో కలిసి ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించినట్లు ఆ మహిళ చెబుతోంది. కానీ ఎవరూ ఆమె మాట వినలేదట. సోమవారం ఆ మహిళ మళ్లీ భజరంగ్ దళ్ నాయకుడు వికాస్ త్యాగిని కలిశారు. అనంతరం హిందూ సంస్థల ద్వారా మీడియాకు కథనం అందించారు. అతడితో పాటు మొదటి భార్య కూడా వైద్యుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయం సహరాన్‌పూర్ ఎస్పీ దేహత్ సాగర్ జైన్‌కు చేరడంతో.. విచారణ చేపట్టాల్సిందిగా ఆయన పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఆరోపణలు నిజమని తేలితే నిందితుడు డాక్టర్ హుస్సేన్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతని కోసం అన్వేషణ కొనసాగుతోంది.
ఎయిర్‌టెల్ రీఛార్జిపై రూ.600 ఆదా.. నేడే ఆఖరి గడువు!
ప్రముఖ టెలికాం కంపెనీ ‘భారతి ఎయిర్‌టెల్’ మొబైల్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్‌టెల్ తన టారిఫ్ ధరలను 11 నుంచి 21 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. పాత ధరలు మరికొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈలోపు రీఛార్జి చేసుకున్న వారు భారీగా ఆదా చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌లో వార్షిక ప్లాన్ ఉన్న విషయం తెలిసిందే. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌తో రూ.2999 వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. జులై 3 నుంచి ఈ ప్లాన్ ధర రూ.3,599కి చేరనుంది. వార్షిక ప్లాన్‌పై ఏకంగా రూ.600 పెరిగింది. జులై 2 అర్ధరాత్రి లోపు మీరు వార్షిక ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే.. రూ.600 ఆదా చేసుకోవచ్చు. అలానే రూ.719 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.140, రూ.549 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.100, రూ.839 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.140, రూ.1799 ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే రూ.200 మీరు ఆదా చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌లో యాక్టివ్ ప్లాన్ అందుబాటులో ఉండగా.. మరో ప్లాన్‌ను రీఛార్జి చేసుకుంటే తక్షణమే ఆ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. పాత ప్లాన్‌నే రీఛార్జి చేసుకున్నప్పుడు మాత్రమే క్యూలో ఉంటోందని పలువురు పేర్కొంటున్నారు. ఇక జియో పెరిగిన ధరలు జులై 3 నుంచి మల్లోకి రానున్నాయి. అలానే వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ ధరలు జులై 4 నుంచి అమల్లోకి రానున్నాయి.
పోతూ పోతూ.. విరాట్ కోహ్లీకి టార్గెట్ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్!
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించగానే రాహుల్ ద్రవిడ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలోకి వచ్చి.. ఆటగాళ్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీ గెలవకున్నా.. కోచ్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సేవ చేస్తున్న ‘ది వాల్’.. కోచ్‌గా తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా కోచ్‌గా అతడి బాధ్యతలు ముగిశాయి. ద్రవిడ్ పోతూ పోతూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ భారత జట్టును ఛాంపియన్‌గా నిలవాలని విరాట్ కోహ్లీతో రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ‘తెల్ల బంతితో ఆ మూడూ మనం సాధించాం. ఇక ఎరుపే మిగిలి ఉంది. అది కూడా సాధించండి’ అని డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో ద్రవిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ద్రవిడ్ దృష్టిలో మూడు అంటే.. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా విరాట్ ఈ మూడూ గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మాత్రమే. అందుకే టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా గెలవాలి కోహ్లీకి టార్గెట్ ఇచ్చాడు. భారత జట్టు 2021, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. 2021 ఫైనల్స్‌లో న్యూజీలాండ్ జట్టుపై, 2023 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయింది. ఈసారి కూడా ఫైనల్స్‌కు చేరాలనే లక్ష్యంతో భారత్ ఆడుతోంది. 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఉన్నది. ఈ సారి కూడా ఫైనల్స్ చేరితే.. హ్యాట్రిక్ కొడుతుంది. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచాక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
పీకల్లోతు అప్పుల్లో రకుల్ ప్రీత్ భర్త… అండగా నిలబడ్డ స్టార్ హీరో!
బడే మియాన్ చోటే మియాన్ సినిమా చేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త, మామ అనూహ్యంగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించారు. అయితే ఏప్రిల్ 10వ తేదీన బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సినిమా వెనక్కి రాబట్టింది. దీంతో దాదాపుగా 240 కోట్ల రూపాయలకు పైగా జాకీ భగ్నాని, వశుభగ్నాని నష్టపోయినట్లయింది. ఈ దెబ్బతోటి ఏకంగా ఆఫీస్ అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళకి ఇంకా కొంతమందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయనే విషయం తెరమీదకు వచ్చిన తర్వాత జాకీ భగ్నాని ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. అదేంటంటే ఈ విషయం తెలిసిన వెంటనే అక్షయ్ కుమార్ తమకు అండగా నిలబడ్డాడని, అక్షయ్ కుమార్ కి ఇవ్వాల్సిన పేమెంట్ ఆపేయమని కోరాడని చెప్పుకొచ్చారు. అందరి పేమెంట్స్ క్లియర్ అయిన తర్వాత ఇబ్బందులు క్లియర్ అయిన తర్వాతే తనకు పేమెంట్ ఇవ్వాలని ఆయన తమకు అభయం ఇచ్చాడని ఈ సందర్భంగా జాకీ భగ్నాని వెల్లడించాడు.