ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న బాలయ్య.. ఏం మాట్లాడారంటే..?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు బెజవాడ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై ఆరో రోజుకి చేరుకున్నాయి దసరా మహోత్సవాలు.. ఈ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శమనిస్తున్న దుర్గమ్మ ను దర్శించుకున్నారు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు.. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నా.. తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారు.. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటే.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ఆకాక్షించారు. ఇక, ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల ఏర్పాట్లు బాగున్నాయి అన్నారు నందమూరి బాలకృష్ణ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు అని అభినందించారు నటసింహ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..
తీరం దాటిన వాయుగుండం..
ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం గండం తప్పినట్టు అయ్యింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తెల్లవారు జామున తీరం దాటింది.. గోపాల్ పూర్ సమీపంలో తీరాన్ని దాటి బలహీన పడుతోంది వాయుగుండం.. దీంతో, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, ఈ ప్రభావంతో ఇవాళ నెల్లూరు మినహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుయనున్నాయి.. ఇదే సమయంలో, సముద్రం కల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో.. మరో రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు, భూ ఉపరితలంపై తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది వాయుగుండం.. ఈ ప్రభావంతో.. తెలంగాణలో మరో రెండు రోజుల ఈరోజు, రేపు భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ.. కాగా, ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి..
మండలిలో సద్దుమణిగిన ప్రోటోకాల్ వివాదం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రోటోకాల్ వివాదం సద్దుమణిగింది.. మండలి చైర్మన్ కు ప్రోటోకాల్ విషయంలో జరిగిన పరిణామాలను దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇవ్వడంతో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాంతించారు.. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. మరోవైపు, ఈ పరిణామాలపై స్పందించిన మండలి చైర్మన్ మోషేర్‌రాజు.. వ్యక్తులకు, వ్యవస్థలకు, అధికారులకు గౌరవం ఇవ్వాలని సూచించారు.. తన వ్యక్తిగత అంశాన్ని గుర్తించి లేవనెత్తిన ప్రతిపక్షం, స్పందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మండలి చైర్మన్ మోషేర్‌రాజు..
హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి.. పవన్ కల్యాణ్ పిలుపు..
హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి అంటూ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా వికారాబాద్, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది.. ఓల్డ్ సిటీ, పురానాపూల్, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్.. ఇలా మూసీ నది పరివాక ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది.. ఈ నేపథ్యంలో.. జనసేన నేతలకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.. హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ వరదతో ఎంజీ బస్టాండ్, పరిసరాలు నీట మునిగాయని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచిస్తున్నాను. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు జనసే అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఏడుపాయల ఆలయం వద్దకు ఎవరు రావొద్దు..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నదికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్టు యొక్క గేట్లు ఓపెన్ చేయడంతో ఏడుపాయల వన దుర్గా దేవీ ఆలయానికి వచ్చే రెండు మార్గాలు బంద్ అయ్యాయి. లక్షకు పైగా క్యూసెక్కుల వరద రావడంతో ప్రసాదాల పంపిణీ షెడ్డూ కొట్టుకుపోయింది. ఇక, ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం పైకప్పుని తాకుతూ ప్రమాదకర స్థాయిలో మంజీర నది పరవళ్లు తొక్కుతుంది. దీంతో పోతం శెట్టిపల్లి నుంచి ఏడుపాయల, మెదక్ నుంచి ఏడుపాయల ఆలయానికి వెళ్ళే దారిలో బ్రిడ్జ్ మీదుగా వరద ప్రవహిస్తుంది. ఇక, పోలీసులు ప్రజలు ఎవరు కూడా అటుగా రాకుండా బారికేడ్లు పెట్టి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.
బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లను ప్రారంభించిన మోడీ
ప్రధాని మోడీ ఒడిశాలోని ఝార్సుగూడలో రూ. 60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. భారతదేశం అంతటా 97,500 కి పైగా టెలికాం టవర్లు ప్రారంభించారు. టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం వంటి రంగాల్లో విస్తరించి ఉన్న రూ.60,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు. మొబైల్ 4G టవర్లు సరిహద్దు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలోని 26,700 కంటే ఎక్కువ అనుసంధానం కాని గ్రామాలకు కూడా కనెక్షన్ లభించనుంది. రాబోయే నాలుగు సంవత్సరాలలో 10,000 మంది కొత్త విద్యార్థులకు సామర్థ్యాన్ని సృష్టించే ఎనిమిది ఐఐటీల విస్తరణకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. సాంకేతిక విద్య, నైపుణ్య అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఒడిశా ప్రభుత్వం చేపట్టిన బహుళ కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభించారు.
‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలపై ఉక్కుపాదం.. యూపీ మతాధికారి అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు శుక్రవారం పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలకు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో బరేలీ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తౌకీర్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తౌకీర్ రజా ఇంటి వెలుపల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలివచ్చి ‘ఐ లవ్ ముహమ్మద్’ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ నిర్వహించారు. ఐ లవ్ ముహమ్మద్ ప్రచారానికి మద్దతుగా రజా ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో భారీ ఎత్తున జనసమూహం తరలిచ్చింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణలో 10 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇక రజాను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక బరేలీలో జరిగిన అల్లర్లలో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని.. 1,700 మంది గుర్తు తెలియని వ్యక్తులపై అల్లర్లు, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజలకు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు బరేలీలోని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల నైఫుణ్యాలను తగ్గిస్తున్న ChatGPT .. అధ్యయనంలో వెల్లడి..
ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎక్కువగా చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎలాంటి సమాచారమైనా ఈజీగా పొందొచ్చన్న ఆలోచనతో విద్యార్థులు ఎక్కువగా దీనిపై ఆధారపడుతున్నారు. విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలకు హాని కలిగిస్తుందా? MIT యొక్క మీడియా ల్యాబ్ పరిశోధకుల నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం కొన్ని ఆందోళనకరమైన ఫలితాలను అందించింది. దీని అధిక వాడకం మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని, ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గే చాన్స్ ఉందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం.. బోస్టన్ ప్రాంతం నుంచి 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల 54 మందిని మూడు గ్రూపులుగా విభజించి, వరుసగా OpenAI యొక్క ChatGPT, Google యొక్క శోధన ఇంజిన్ ఉపయోగించి కొన్ని వ్యాసాలు రాయమని.. అలాగే ఏమీ లేకుండా అనేక SAT వ్యాసాలు రాయమని కోరింది. 32 ప్రాంతాలలో రచయితల మెదడు కార్యకలాపాలను రికార్డ్ చేయడానికి పరిశోధకులు EEGని ఉపయోగించారు. మూడు సమూహాలలో, ChatGPT వినియోగదారులు అత్యల్ప మెదడు నిశ్చితార్థాన్ని కలిగి ఉన్నారని..నాడీ, భాషా మరియు ప్రవర్తనా స్థాయిలలో స్థిరంగా పేలవంగా పనిచేశారని ” కనుగొన్నారు. కొన్ని నెలల తర్వాత ఈ చాట్ జీపీటీని ఉపయోగించి కాఫీ పేస్ట్ కొడుతున్నారని వెల్లడించారు.
పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
బంగారం ధరలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. ఈ వారంలో రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధించారు. ఈ ప్రభావం పసిడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. రికార్డ్ స్థాయిలో బంగారం, సిల్వర్ ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా తులం గోల్డ్‌పై రూ.600 పెరిగింది. కిలో వెండిపై రూ.6,000 పెరిగి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 పెరిగి రూ.1, 15, 480 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.550 పెరిగి రూ.1, 05, 850 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 పెరిగి రూ.86,610 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండిపై మాత్రం 6,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,49, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,59,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,49, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
నేషనల్ అవార్డ్స్ లో..కూతురి పేరుతో గొలుసు పై స్పందించిన రాణీ ముఖర్జీ..
తాజాగా జరిగిన జాతీయ చలన చిత్ర పురస్కారాల వేడుకలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తన ప్రత్యేక స్టైల్‌తో అందరిని ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో రాణీ, మెడలో తన కుమార్తె అదిరా పేరుతో తయారు చేసిన గొలుసును ధరించి హాజరయ్యారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాణీ తాజాగా ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారో వివరించారు. ‘నా కుమార్తె అదిరా ఈ వేడుకలో నేరుగా హాజరు కావాలనుకుంది, నేను అవార్డు తీసుకున్నప్పుడు నా పక్కన ఉండాలని ఎంతో ఆశ పడింది. కానీ 14 ఏళ్ల లోపు పిల్లలకు వేడుకలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ కారణంగా అదిరా రాలేకపోయింది. నా పక్కన ఉండలేకపోయింది కాబట్టి, తనతో ఉన్నట్లు అనిపించడానికి ఆమె పేరుతో గొలుసు తయారు చేసి వేసుకున్నాను.. అదిరా నా అదృష్టం’ అని రాణీ తెలిపారు. రాణీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ ఘటనా గురించి ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. గొలుసును హైలైట్ చేసిన రీల్స్ చాలా వైరల్ అయ్యాయి, ఇవి చూసిన రాణి తన కుమార్తెకు చూపించగా, అదిరా చాలా సంతోషపడింది. రాణీ ముఖర్జీ ఇలా తన కుమార్తెతో ప్రత్యేక బంధాన్ని వ్యక్తం చేయడం, బాలీవుడ్‌లో ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది.
‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా వస్తారా మాస్టారు
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఈ నెల 27న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ సెప్టెంబర్ లో కూడా విడుదల కాలేదు. షూటింగ్ పెండింగ్ ఉండడంతో సెప్టెంబర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. దాంతో షూటింగ్ పార్ట్ ను చక చక ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. లక్ష్మణ్ భేరి అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తాజాగా మాస్ జాతర రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ముందుగా దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు కానీ అక్కడ కుదరకపోవడంతో అక్టోబరు 31న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. నేటి నుండి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. గత సంవత్సరం దీపావళి రిలీజ్ అనుకున్న సినిమా ఈ ఏడాది అక్టోబరు చివర్లో వస్తుంది.
రెండు రోజుల కలెక్షన్స్ తో వంద కోట్ల షేర్ క్లబ్ లో పవర్ స్టార్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ భారీ హైప్ మధ్య రెండు రోజుల క్రితం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన OG మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది. తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 154 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక షేర్ పరంగాను రూ. 88 కోట్లకు అటు ఇటుగా రాబట్టింది OG. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. వర్షాల కారణంగా కొన్ని సెంటర్స్ లో వసూళ్లు తగ్గినా డీసెంట్ కలెక్షన్స్ ను వసూలు చేయగలిగింది. రెండవ రోజు రాబట్టిన కలెక్షన్స్ తో వందకోట్ల షేర్ రాబట్టిన సినిమాల లిస్ట్ లో చేరింది OG. ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వందకోట్ల షేర్ ఉన్న సినిమా లేదు. ఇప్పుడు ఓజి సినిమాతో తొలిసారి పవర్ స్టార్ వందకోట్ల షేర్ కొల్లగొట్టి ఆ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. నేడు, రేపు వీకెండ్ నేపథ్యంలో ఈ రెండు రోజులు భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అటు ఓవర్సీస్ లోను 4.2 మిలియన్ డాలర్స్ రాబట్టింది OG.