టీటీడీ కీలక నిర్ణయం.. ఇక, ఆ భక్తుల సౌకర్యాల్లో కోత..!
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా 1600 కోట్లు కానుకులు అందుతుండగా.. టన్ను వరకు బంగారం, పది టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది. ఇక ఆస్థులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి 10 రాష్ర్టాలలో 80 వేల కోట్ల రూపాయల ఆస్థులు ఉన్నాయి. మరో వైపు హిందు ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి 11 ట్రస్ట్ లు నిర్వహిస్తోంది. ఇందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్, అన్నప్రసాదం ట్రస్ట్‌కి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. 2018లో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు రోజుకి కోటిన్నర వరకు విరాళాలు రాగా.. దాని నిధులు 2 వేల 400 కోట్లు దాటేసింది. అన్నప్రసాదం ట్రస్ట్ ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతుండగా.. ఇప్పటి వరకు 2 వేల 300 కోట్లు విరాళంగా అందించారు భక్తులు. ఇలా విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. ప్రధానంగా 99 వేల వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు వుండవు. లక్ష నుంచి 5 లక్షల వరకు ఇచ్చేవారికి ఏడాదికి ఒక్కసారి ఐదుగురికి సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తుంది. వసతి గది కేటాయింపుతో పాటు 6 చిన్న లడ్డూలు, కండువా, జాకెట్టు అందజేస్తారు. 5 నుంచి 10 లక్షలు ఇచ్చేవారికి ఏడాదికి మూడు సార్లు సుపథం నుంచి దర్శనానికి అనుమతించడంతో పాటు వసతి ఏర్పాట్లు ఉంటాయి. ఇక 10 నుంచి 25 లక్షలు విరాళంగా అందించిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే 50 గ్రాముల వెండి డాలర్ కూడా బహుమానంగా ఇస్తారు. అదే 25 నుంచి 50 లక్షలు విరాళం ఇస్తే… వీఐపీ బ్రేక్‌తో పాటు సుప్రభాత సేవా భాగ్యం కూడా ఉంటుంది. అలాగే 5 గ్రాములు బంగారం డాలర్‌తో పాటు 50 గ్రాముల వెండి డాలర్‌ను బహుమానంగా ఇస్తారు. ఇక 50 నుంచి 75 లక్షల.. ఆపై కోటి రూపాయిలు విరాళంగా అందించిన భక్తులకు మరిన్ని సదుపాయాలు అందిస్తారు.
ఏపీలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.. ఏకంగా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. వీరిలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాప్పులు జరిగినట్లు సమాచారం. మృతులలో ఒకరు మావోయిస్టుల అగ్రనేతగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం.. ఇటీవలి రోజులుగా ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్‌కు కీలక సమాచారం అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వర్గాలు వెల్లడించాయి. ఇక, ఎదురు కాల్పుల తర్వాత ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సులు ఇంకా అడవుల్లో తీవ్ర కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, స్టాకింగ్ మెటీరియల్ ఉన్న అవకాశాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఎన్‌కౌంటర్‌లో భార్యతో సహా మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి.. ఎవరి హిడ్మా..?
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. కీలక నేతలు సైతం హతం అయ్యారు.. మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు కూడా.. ఈ సమయంలో కీలక నేతగా ఉన్న హిడ్మా ఎక్కడ? హిడ్మా కూడా లొంగిపోతారా? అనే చర్చ జరిగింది.. అయితే, అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు.. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ప్రాణాలు విడిచారు.. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య హేమతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.. దేశంలోని అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించేవారిలో మడావి హిడుమాయ్ అలియాస్ హిడ్మా అలియాస్ సంతోష్ కీలకంగా ఉన్నారు.. ఆయుధాలు అప్పగించి ఆయన త్వరోనే లొంగిపోతారన్న ప్రచారం వేగంగా సాగుతూ వచ్చింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హిడ్మా ప్రాణాలు కోల్పోయారు.. ఆయన భార్య హేమతో పాటు.. ఆయనకు సెక్యూరిటీ ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు విడిచారని సమాచారం.. అయితే, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు హిడ్మా.. మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడుగా కూడా సేవలు అందించారు.. పీఎల్‌జీఏ (PLGA) ప్లాటూన్-1 కమాండర్ గా పనిచేశారు.. గెరిల్లా దాడులకు వ్యూహకర్త ఆయనకు పేరు ఉంది..
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
టీటీడీ పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరైన సమయంలో CVSO సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం హైకోర్టుకు తెలిసినట్లు పేర్కొంది.. ఇదే సమయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు… ఈ కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్ష్యులకు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.. పరకామణి చోరీ కేసు విచారణ ముగిసే వరకు సాక్ష్యులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఏపీ సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.. హైకోర్టు ఈ ఆదేశాల ద్వారా విచారణ సమయంలో ఏదైనా అనవసర ఇబ్బందులు రాకుండా, సాక్ష్యుల భద్రతను ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశాన్ని స్పష్టంగా తెలిపింది. కాగా, సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును ఆ తర్వాత హత్య కేసుగా నమోదు చేసిన విషయం విదితమే.. పరకామణి చోరీ కేసులో విచారణ జరుగుతుండగా.. జరిగిన సతీష్ కుమార్ ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే..
విజయవాడలో మావోయిస్టుల కలకలం..
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోవడం వద్ద మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగింది.. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు అతని భార్య హేమ మరో నలుగురు మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రికార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల పైగా రివార్డు ఉంది.. అయితే, మరోవైపు విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి.. నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలపై సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బ్రాంచ్ (SIB) ద్వారా సమాచారం అందింది. సుమారు 27 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు గుర్తించబడింది. అదేవిధంగా, స్థానిక పోలీసులు, గ్రే హౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలిన ఆరుగురిని కోసం పోలీసులు ప్రాంతంలో గాలింపును కొనసాగిస్తున్నారు. ఆటోనగర్‌లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు.. 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.. భవనాన్ని చుట్టుముట్టిన ఆక్టోపన్ పోలీసులు.. భవనంలో భారీగా ఆయుధాలు డంప్ చేసినట్టు గుర్తించారు.. అరెస్ట్ అయిన నలుగురు మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు, అక్కడ వారిపై కఠిన విచారణ ప్రారంభమయ్యింది. పోలీసుల ప్రకారం, ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి..
మరో వైసీపీ నేత అరెస్ట్.. అసలు కారణం ఏంటి..? అని అంబటి ఫైర్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని వెంకట రెడ్డి ఇంటికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు.. ఆయన్ని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు.. అయితే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు. ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వం, పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. తాడిపత్రికి ఆయనను తీసుకెళ్లారని సమాచారమొస్తోన్నా, అరెస్టుకు సంబంధించిన కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం దారుణమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటరెడ్డిపై కక్ష పెట్టుకుని అరెస్టు చేశారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో ప్రభుత్వం పరిశీలించాలి. కానీ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం భయంకరమైన ధోరణి అని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులకు సమాధానం అడిగినా స్పందించకపోవడం ఆందోళనకరం అన్నారు.. ఇక, టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణకు వెళ్తున్న సమయంలో మరణించిన సీఐ సతీష్ కుమార్ ఘటన కూడా అనుమానాస్పదమేనని అంబటి పేర్కొన్నారు. అది హత్యా? ఆత్మహత్యా? ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఆ విషయాన్ని ఎవరైనా మాట్లాడినా అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు..
మోడీ దేశానికి బడే భాయ్.. రాష్ట్రాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి..
అర్బన్ డెవలప్మెంట్ పై దక్షిణ–పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని మా ప్లాన్ అని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశామన్నారు. మోడీ 2047కి 30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకున్నారు.. మేము దేశంలో 10 శాతం ఉండాలని ప్లానింగ్ చేసుకున్నామని తెలిపారు. మెట్రో విస్తరణ… మూసి ప్రక్షాళన. ఆర్ఆర్ఆర్.. రేడియల్ రోడ్లకు నిధులు..అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. 3000 ఎలెక్ట్రిక్ బస్సులు నడపాలని ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు. డేటా.. ఐటీ.. మెడికల్ ..ఫార్మాలకు హబ్ హైదరాబాద్.. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ కట్టాలని అనుకుంటున్నామన్నారు. సింగపూర్.. దుబాయ్ లతో పోటీ పడాలని అనుకుంటున్నామని తెలిపారు.
20నే సీఎంగా నితీష్ ప్రమాణం.. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ నవంబర్ 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా పదోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలిసిన నితీష్ కుమార్.. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాలని కోరారు. నవంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చేలా చూడాలని సిఫార్సు చేశారు. దీంతో పాత ప్రభుత్వం బుధవారంతో ముగుస్తుంది. ఇక నవంబర్ 20న పాట్నాలోని గాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చోటు కల్పిస్తూ మంత్రివర్గ కూర్పు చేస్తున్నారు. అయితే స్పీకర్ పోస్ట్‌పై బీజేపీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ పదవిని తమకే ఇవ్వాలంటూ కమలనాథులు కోరుతున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ పోస్ట్ మాత్రం తమకే దక్కాలంటూ జేడీయూ పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల్లో స్పీకర్ పోస్ట్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉంటే నవంబర్ 20న జరిగే నితీష్ కుమార్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సీనియర్లు హాజరుకానున్నారు.
ఢిల్లీ స్కూళ్లు, కోర్టులకు మరోసారి బాంబ్ బెదిరింపులు.. డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. స్కూళ్లు, కోర్టులకు బెదిరింపులు వచ్చాయి. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టులతో పాటు రెండు సీఆర్పీఎఫ్ స్కూళ్లకు కూడా బాంబ్ బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్వ్కాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆవరణలు ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. నవంబర్ 10న ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. అలాగే ఉగ్రవాది ఉమర్ కూడా హతమయ్యాడు. దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం భారీ దాడులకు కుట్ర చేస్తుండగా కారు బ్లాస్ట్ జరిగింది. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుట్రలో భాగమైన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఒకే సంవత్సరంలో మూడు రెట్లు పెరిగిన బంగారం దిగుమతులు.. అక్టోబర్ లోనే రూ.1,30,411 కోట్ల గోల్డ్ దిగుమతి
గతంలో ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు ఈ ఏడాది రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. వేలకు వేలు పెరుగుతూ కొనుగోలుదారులకు వణుకుపుట్టించాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. భారతదేశ బంగారం దిగుమతులు అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశం అక్టోబర్ 2025లో $14.72 బిలియన్ల (సుమారు రూ. 1,30,411 కోట్లు) విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాది అక్టోబర్‌లో $4.92 బిలియన్ల (సుమారు రూ. 43.58 వేల కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. పండుగలు, శుభకార్యలు, వివాహాల సీజన్‌లో బలమైన డిమాండ్ కారణంగా ఈ పెరుగుదల సంభవించింది. 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, మొత్తం బంగారం దిగుమతులు 21.44% పెరిగి $41.23 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో $34 బిలియన్లుగా ఉంది. బంగారం దిగుమతుల్లో ఈ అనూహ్య పెరుగుదల దేశ వాణిజ్య లోటును రికార్డు స్థాయికి నెట్టివేసింది. అక్టోబర్‌లో దేశ వాణిజ్య లోటు $41.68 బిలియన్లుగా ఉంది. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, దిగుమతుల పెరుగుదలకు పండుగ డిమాండ్ ఎక్కువగా కారణమని అన్నారు. “పండుగలు, వివాహాల సీజన్లలో డిమాండ్ పెరగడం వల్ల బంగారం దిగుమతులు పెరిగాయి” అని అన్నారు.
నేనేమైన హర్మన్‌ప్రీత్‌నా? బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో తీవ్ర వివాదం రాజుకున్నా విషయం తెలిసిందే. ఆ జట్టు మాజీ పేసర్ జహానారా అలం చేసిన ఆరోపణలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జహానారా 2024లో చివరిసారిగా బంగ్లాదేశ్ తరఫున ఆడగా.. కెప్టెన్ నిగార్ సుల్తానా జోటీ తన కంటే జూనియర్ ప్లేయర్లను కొట్టిందని సంచలన ఆరోపణలు చేసింది. జోటీ జూనియర్లను తరచూ కొడుతుందని ఆమె ఓ పత్రికకు తెలిపింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. జట్టుపై, కెప్టెన్‌పై, మేనేజ్‌మెంట్‌పై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో జోటీ కూడా స్పందించింది. కానీ, ఆమె సమాధానంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. నిగార్ సుల్తానా మాట్లాడుతూ.. “నేను ఎవరినైనా ఎందుకు కొడతాను? స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టినట్లు నేనూ కొడతానా? నేను హర్మన్‌ప్రీత్‌నా? అలా స్టంప్స్ కొడుతూ తిరగడానికి? నా వ్యక్తిగత స్పేస్‌లో, నేను వంట చేస్తూ ఉండవచ్చు, బ్యాట్‌ను గోడకు తాకించవచ్చు, హెల్మెట్‌ను కొట్టవచ్చు… అవి నా విషయాలు. కానీ, నేనెవరినైనా హార్ట్ చేయాలనుకుంటానా? ఎందుకు చేస్తాను?” అంటూ వ్యాఖ్యానించింది.
WTC Final రేసులో భారత్ ఉండాలంటే.. 8 విజయాలు సాధించాల్సిందే..!
కోల్‌కాతా టెస్ట్‌లో టీమిండియా ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భారత్ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారింది. ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మూడు టెస్ట్‌ల్లో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సైకిల్‌లో మొత్తం నాలుగు విజయాలే సాధించగలిగిన భారత్.. టాప్-2 స్థానాల్లోకి చేరేందుకు భారీ సవాల్‌ను ఎదుర్కోతోంది. కానీ పోటీ అప్పుడే పూర్తిగా ఐపోలేదు. ప్రస్తుతం భారత్ సుమారు 54% పాయింట్స్ శాతంతో నాల్గవ స్థానంలో ఉంది. సాధారణంగా WTC ఫైనల్‌కు అర్హత పొందేందుకు అవసరమైన PTC 64% నుంచి 68% మధ్య ఉంటుంది. అందువల్ల మిగిలిన మ్యాచ్‌ల్లో ఎక్కువ భాగాన్ని భారత్ గెలవాల్సిందే. లేకపోతే ఒక్కో తప్పిదం కూడా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
శర్వానంద్ కెరీర్ ను డిసైడ్ చేయనున్న బైకర్..
సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా మేకోవరైన శర్వానంద్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునేలోపు నెక్ట్స్ మూవీతో ఫ్లాప్‌కు హాయ్ చెప్పాల్సిందే. మహానుభావుడు తర్వాత వరుస పరాజయాలకు ఒకే ఒక జీవితంతో చెక్ పెడితే మనమే మళ్లీ అతడి స్పీడుకు బ్రేకులేసింది. ఇక నెక్ట్స్ హోప్ బైకర్ మూవీపైనే. ఈ రేసింగ్ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు శర్వా. మునుపెన్నడూ లేనివిధంగా ఒళ్లు హునం చేసుకుని వెయిట్ లాస్ అవడమే కాకుండా ఫిట్‌గా తయారయ్యాడు. బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది బైకర్. శర్వాతో జోడీ కడుతోంది మలయాళ కుట్టీ మాళవిక నాయర్. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య అఖండ2తో పోటీ పడుతున్నాడు శర్వానంద్. శర్వానంద్ చేతిలో బైకర్ మాత్రమే కాదు, టూ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి, భోగి చిత్రాలున్నాయి. నారీ నారీ నడుమ మురారి షూటింగ్ కంప్లీట్ కాగా, నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ బైకర్ డిసెంబర్‌కు వచ్చేస్తుండటంతో కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇక హిట్ మొహం చూసి మూడేళ్లు దాటిపోతున్న శర్వానంద్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం ఈ యంగ్ హీరోతో దోబూచులాడుతోంది. శర్వాని మార్కెట్ ని మించి ఖర్చు చేసిన ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా ట్రాక్ ఎక్కాలని ఎదురుచూస్తున్నాడు.
హిట్ 3 లీక్.. పాపం ఎంప్లాయ్స్ ని అనుమానించారు కదరా!
నాని హీరోగా ఈ ఏడాది హిట్ 3 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కి 18 గంటల ముందు ఐ-బొమ్మలో ఒరిజినల్ క్వాలిటీతో రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొడక్షన్ హౌస్ అయితే కచ్చితంగా ఇది ప్రొడక్షన్ హౌస్‌లో ఎవరో చేసిన పని అని భావించి, తమ సొంత ఉద్యోగులను అనుమానించి పోలీస్ కేసులను సైతం నమోదు చేయించి దర్యాప్తు చేయించింది. అయితే అప్పట్లో వారి మీద ఎవరు కేసులు పడలేదు. కానీ, అనుమానం వ్యక్తం చేయడంతో వారందరూ బాధపడిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇప్పుడు ఐ-బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అయిన తర్వాత ఇదంతా అతని పనే అని అర్థమైంది. అతను ప్రొడక్షన్ కంపెనీలకు పంపించిన ఒరిజినల్ కంటెంట్‌ను వాటి సర్వర్‌లను హ్యాక్ చేసి డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. ఇక నాని హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. నాని కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు, క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాస్ దక్కించుకుంది. అయితే, నాని సినిమా రిలీజ్‌కి ముందే రిలీజ్ చేయడంలో ఐ-బొమ్మ రవి పాత్ర ఉందని పోలీసులు తాజాగా గుర్తించడం గమనార్హం.