నేడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే, ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లతో పాటు, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరకాబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటూ.. వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపించారు. ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటూ.. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.
నేడు నగరానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఒకె ఫ్లైట్ లో ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక హైదరాబాద్ చేరుకుంటారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. ఉదయం 07:20 గంటలకు UK-829 విమానంలో ఢిల్లి విమానాశ్రయం నుండి బయలుదేరి 9:30 గంటలకు శంషాబాద్ కు రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్‌కృష్ణా హోటల్‌కు చేరుకుంటారని, కొంత విశ్రాంతి అనంతరం ఎల్‌బీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. మరోవేపు రేవంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమముకు హాజరు అవుతున్న కర్ణాటక సిఎం సిద్ధి రామయ్య రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు సిద్ధైరమయ్య చేరుకుని, అక్కడి నుంచి నేరుగా LB స్టేడియంకి కర్ణాటక సిఎం చేరుకుంటారు.
ఇంద్రకీలాద్రిలో సీఎం జగన్.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పలు నృత్యాలతో పిల్లలు, నాట్యకారులు అలరించారు. అలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన చేశారు. 216 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు, 5 కోట్ల దాతల నిధులు, 33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
నేడు విశాఖకు పవన్ కళ్యాణ్..
నేడు విశాఖపట్నంలో ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరుగనుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు చేరనునన్నారు. ఇక, మధ్యాహ్నం నగరానికి జనసేన చీఫ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలు, తుఫాన్ నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులు, తాజా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారని పార్టీ వర్గాల వెల్లడించాయి. ఇప్పటికే ఆళ్వార్‌దాస్ మైదానంలో ఏర్పాటు పూర్తి అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మైదానానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారన్నారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతుల సమస్యలు, వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరాన్ని సభలో ప్రస్తావించనున్నారు. రాబోయే ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలనే అంశంపై 100 రోజుల ప్రణాళికను ఆయన వివరించనున్నారు. ఇక, ఈ బహిరంగ సభ తర్వాత పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం జరగనుంది.
రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. రేపు పొన్నూరు, వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్లబోతున్నారు. రేపు రాత్రికి బాపట్లలోనే టీడీపీ అధినేత బస చేయనున్నారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకోనున్నారు.
నాని హాయ్ నాన్నతో హిట్ కొట్టేసినట్లేనా?
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న… ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమాకి హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమాకి అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షో కూడా పడిపోయింది. సోషల్ మీడియాలో హాయ్ నాన్న సినిమా చూసిన వాళ్లు కంప్లీట్ గా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నాని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర సినీ అభిమానులు కూడా హాయ్ నాన్న సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఒక మంచి ప్రేమ కథని ప్రెజెంట్ చేయడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. హాయ్ నాన్న సినిమా కూడా నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలుస్తుంది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ లో నాని యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన మ్యాజిక్ తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా తోడవడంతో హాయ్ నాన్న మూవీ కథలో, రైటింగ్ లో కొంచెం ఫ్లాస్ ఉన్నా కూడా అవేమి పెద్ద లోపాల్లా కనిపించకుండా చేసారు. హేషం సినిమాని కంప్లీట్ గా మ్యూజిక్ తో మోసుకెళ్లాడు, తన మ్యూజిక్ లేని సినిమాని ఊహించడం కష్టమే. ఓవరాల్ గా నాని దసరా తర్వాత మరో హిట్ కొట్టాడు అని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అసలు హైప్ లేకుండా రిలీజ్ అయిన ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.