కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952కు ఇటీవల కొన్ని సవరణలు చేసింది. సెన్సార్ అయిన సినిమాలను సైతం తిరిగి చూసే అధికారం, రీ-ఎగ్జామిన్ చేసే అధికారం కేంద్రానికి ఉండేలా చేసింది. అయితే… ఇలాంటి పలు అంశాలతో రూపొందిన ఇండియన్ సినిమాటోగ్రఫీ అమాండ్ మెంట్ బిల్ 2021ని కేంద్రం ఆమోదించింది. చిత్రం ఏమంటే ఇప్పటి వరకూ ఉన్న ట్రిబ్యునల్ ను ఈ సవరణల ద్వారా కేంద్రం రద్దు చేసింది. దాంతో సెన్సార్ సభ్యుల కోరలకు మరింత పదను ఏర్పడినట్టు అయ్యింది. సెన్సార్ సభ్యులు లేదా రివైజింగ్ కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్ తో దర్శక నిర్మాతలు విభేదించేట్టయితే గతంలో ట్రిబ్యూనల్ కు వెళ్ళే వారు. ఇప్పుడు ఆ ఆస్కారం లేదు కాబట్టి తప్పనిసరిగా హైకోర్టును దర్శక నిర్మాతలు ఆశ్రయించాల్సిన ఉంటుంది.
Read Also: ‘నా స్వంతం’ అంటోన్న మిసెస్ రణవీర్!
గతంలో శ్యామ్ బెనగల్ నేతృత్వంలోని కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఏదైనా సినిమాను చూసే సభ్యులు దానిని ఏ వయసు వారు చూడాలో నిర్ణయించాలి తప్పితే, సినిమాను సెన్సార్ చేయకూడదని సూచించింది. అయితే దానిని కేంద్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికీ అభ్యంతరకర దృశ్యాలను తొలగించడం, సంభాషణలను మ్యూట్ చేయడం జరుగుతూనే ఉంది. కానీ తాజా సవరణలతో ఫిల్మ్ సర్టిఫికెట్ లో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇంతవరకూ ప్రధానంగా సినిమాలకు ‘యు’, ‘యు/ఎ’, ‘ఎ’ సర్టిఫికెట్ లను జనరల్ గా ఇస్తూ వచ్చారు. ‘యు’ అంటే అందరూ చూడదగ్గ చిత్రం, ‘యు / ఎ’ అంటే పెద్దల సమక్షంలో పిల్లలు చూడదగ్గ చిత్రం, ‘ఎ’ అంటే 18 సంవత్సరాల పైబడిన వారు చూడదగ్గ చిత్రం అని అర్థం. అయితే ఇప్పుడు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ను మూడు కేటగిరీలుగా విభజించారు. యు /ఎ 7 ప్లస్, యు /ఎ 13 ప్లస్, యు /ఎ 16 ప్లస్ అని. అంటే పెద్దల సమక్షంలో కూడా ఏడు సంవత్సరాలు, పదమూడు సంవత్సరాలు, పదహారు సంవత్సరాల పై బడిన వారు చూసే చిత్రాలుగా ఈ కేటగిరిని విభజించారన్న మాట! ఫిల్మ్ సెన్సారింగ్ లో వస్తున్న ఈ మార్పులను చూస్తుంటే… ఓటీటీ కంటెంట్ కు కూడా కత్తెర పడే ఛాన్స్ ఉందనిపిస్తోంది.