(జూన్ 20న ఫాదర్స్ డే)
“నాన్న అనే రెండక్షరాలు… మరపురాని మధురాక్షరాలు…” అంటూ ‘దీక్ష’ చిత్రంలో ఘంటసాల గళం పల్లవించగా, నటరత్న అభినయంతో అలరించింది ఆ పాట. ఇక ‘ధర్మదాత’లో “ఓ నాన్నా… నీ మనసే వెన్న… అమృతం కన్నా… అది ఎంతో మిన్నా…” అంటూ మరోమారు ఘంటసాల గాత్రంలోనే ఆ గీతం జాలువారింది. నటసమ్రాట్ నటనతో ఆ పాట కూడా జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. “బృందావనమొక ఆలయమూ…మాధవుడందలి దైవమూ…” అంటూ ‘భలేకృష్ణుడు’లో బాలు గొంతులో సాగిన గీతం సైతం నాన్నపై బిడ్డలకు ఉన్న ప్రేమను చాటింది. “అమ్మంటే మెరిసే మేఘం…నాన్నంటే నీలాకాశం…” అంటూ చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్ళు’లోనూ అమ్మానాన్నల ప్రాధాన్యతను చాటుతూ ఓ గేయం వెలసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక తెలుగు చిత్రాలలో నాన్న గొప్పదనాన్ని చాటారు గీత రచయితలు. మొన్నీ మధ్య వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలోనూ తండ్రిపై తనయులు చూపిన ప్రేమాభిమానాలు ఆకట్టుకున్నాయి. ఆ నాటి నుంచి ఈ నాటి దాకా పలు చిత్రాలలో ‘నాన్నపై ప్రేమలు’ పొంగి పొరలాయి. తెలుగు చిత్రసీమలోనూ పలువురు తనయులు తమ తండ్రుల గొప్పదనాన్ని తలచుకుంటూ పులకించిపోవడం అందరికీ తెలిసిందే!
నటరత్న యన్టీఆర్ సంతానం ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా “మళ్ళీ ఎప్పుడు పుడతావు నాన్నా…” అంటూ గుర్తు చేసుకొనేవారు. ఈ మధ్య ఆయనను స్మరించుకుంటూ ఘాట్ కు వెళ్ళి నివాళులు అర్పిస్తున్నారు. ఇక నటసమ్రాట్ ఏయన్నార్ వారసులు ఆయన ఇప్పటికీ తమ మదిలో నిలచే ఉన్నారని చాటుతూ, ‘ఏయన్నార్ లివ్స్…’ అంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. నందమూరి బాలకృష్ణ ఈ రోజున తాను ఈ స్థాయిలో ఉండటానికి తన తండ్రి యన్టీఆర్ కారకులని పదే పదే గుర్తుచేసుకోవడం అందరికీ తెలిసిందే! ‘నాన్న లేకుంటే మేమెక్కడా’ అంటూ నాగార్జున తన నాన్న నాగేశ్వరరావును స్మరించుకుంటూ ఉంటారు.
నవతరం టాప్ స్టార్స్ సైతం తమ తండ్రుల గొప్పదనాన్ని సందర్భాను సారంగా తలచుకొని పులకించి పోతూనే ఉన్నారు. రామ్ చరణ్, తన తండ్రి చిరంజీవిని ఎంతగా ప్రేమిస్తారో పలుమార్లు ఆయన మాటల్లోనే తెలిసింది. ఇక అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ ‘కృషి, దీక్ష, పట్టుదలకు మారుపేరని’ అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. ఈ పేరున్న తారలే కాదు, చిత్రసీమలో రాణిస్తున్న వారందరూ తమ తండ్రులను స్మరించుకోవడం అన్నది చూస్తూనే ఉన్నాం. సాంకేతిక నిపుణులు, దర్శకనిర్మాతలు ఇలా ఒక్కరని ఏమిటి, తాము ఈ రోజున చిత్రసీమలో రాణించడానికి తమ తండ్రులు కారణమయిన ప్రతీవారూ నాన్నల గొప్పదనాన్ని తలచుకొని పొంగిపోతూనే ఉంటారు. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా సినిమా రంగంలోనూ అందరి మదిలో వారి వారి తండ్రులపై ప్రేమాభిమానాలు పొంగిపొరలుతాయని ఆశించవచ్చు.