బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!
మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా చెప్పేశాడు! సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావటంతో మూవీ సెట్స్ మీద సెటిలైపోయాడు! ఆమీర్ లాగే ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా అక్షయ్ కూడా డిగ్రీ కాలేజ్ గేట్ కూడా చూడలేదు. మార్షల్ ఆర్ట్స్ కోసం సింగపూర్ వెళ్లి ఆ తరువాత రకరకాల ఉద్యోగాలు చేస్తూ చివరకు బాలీవుడ్ లో ‘ఖిలాడీ’గా బాక్సాఫీస్ ని బాగా స్టడీ చేసేశాడు!
ఈ తరం సూపర్ స్టార్, కపూర్ ఖాన్ దాన్ వారసుడు రణబీర్ కూడా టెన్త్ అయిపోగానే రన్నింగ్ చేస్తూ సినిమా పరిశ్రమ వైపు వచ్చేశాడు. ఆయనకి పదో తరగతిలో 54 శాతం మార్కులొచ్చాయి! కపూర్ ఫ్యామిలీలో అదే చాలా గొప్ప! సాధారణంగా వాళ్లు టెన్త్ ఫెయిలైగాని మళ్లీ పాస్ అవ్వరట! మొదటి సారికే గట్టెక్కిన రణబీర్ కోసం అప్పట్లో తల్లి నీతూ కపూర్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది!
రణబీర్ గురించి మాట్లాడుకున్నాక ఆయన ఎక్స్ గాళ్ ఫ్రెండ్ కత్రీనా గురించి కూడా మాట్లాడుకోవాలి. టీనేజ్ లోనే మోడలింగ్ చేస్తూ బ్రిటన్ నుంచీ ఇండియా దాకా వచ్చిన ఆమె ‘పెద్దగా’ చదువుకోలేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! కాకపోతే, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లంతా బాగా చదువుకున్న వాళ్లేనని భ్రమించే ఇండియన్స్ కత్రీనా కాలేజ్ కి వెళ్లలేదంటే నమ్మలేకపోవచ్చు! ఇంగ్లీష్ ఆమె మదర్ టంగ్!
తమ్ముడు రణబీర్ పదో తరగతి పట్టుదలతో పూర్తి చేశాడని చెప్పుకున్నాం. అక్క కరిష్మా అయితే స్కూల్ కి వెళ్లటం ఆపేసి 16 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకుంది. సో, టెన్త్ కూడా అటెంప్టు చేయలేదన్నమాట! అయితే, కరిష్మా కంటే చెల్లెలు కరీనా కాస్త ఎక్కువ చదివింది. ఆమె కాలేజ్ కి వెళ్లి కామర్స్ లో డిగ్రీ దాకా నెట్టుకొచ్చింది. తరువాత లా చదువుదామని భావించింది. కానీ, అలా అలా బాలీవుడ్ లోకి వచ్చేసింది బెబో!
కరిష్మా, కరీనా లాంటి కపూర్సే ఉన్నత విద్య అభ్యసించలేదంటే మన శ్రీదేవి కపూర్ గురించి చెప్పేదేముంది! లెజెండ్రీ సౌత్ ఇండియన్ యాక్ట్రస్ తమిళం నుంచీ హిందీ దాకా అన్ని సినిమా రంగాల్ని బట్టీ పట్టేసింది! కానీ, ఎకడమిక్ ఎడ్యుకేషన్ మాత్రం తక్కువ. బాల నటిగా మొదలై హీరోయిన్ గానూ శ్రీదేవి తొందరగానే పరిశ్రమలో కాలుమోపింది. దాంతో ఆమెకి స్కూల్ కి వెళ్లే వీలే చిక్కలేదు!
విజయానికి అందమైన తార్కాణం… ఐశ్వర్య రాయ్ కూడా విద్యలో పెద్దగా ఆస్తికగల విద్యార్థిని ఏం కాదట. డిగ్రీలో చేరి ఓ సంవత్సరం పుస్తకాలు పట్టుకునే ప్రయత్నం చేసినా మోడలింగ్ లో ఆఫర్స్ ఆమెను రారా రమ్మన్నాయి. ప్రపంచ సుందరి కిరీటం మొత్తం అంతా మార్చేసింది! ఐష్ లాగే మరో అందాల సుందరి ప్రియాంక కూడా కాలేజ్ పూర్తి చేయలేకపోయింది. మిస్ వరల్డ్ అయిపోవటంతో ఎడ్యుకేషన్ మిస్ చేసుకోక తప్పలేదు!
తరతరాలుగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న కుటుంబంలో పుట్టింది కాజోల్. అజయ్ దేవగణ్ ని పెళ్లాడిన ఆమె 17 ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది. మరి స్కూల్ తరువాత కాలేజ్ కి ఎలా వెళుతుంది? సో, గ్రామర్ ని పక్కన పెట్టి గ్లామర్ కే ప్రాధాన్యం ఇచ్చింది!
‘పెద్ద’గా చదువుకోకుండానే… ‘పెద్ద పెద్ద’ స్టార్స్ అయిపోయారు!
