NTV Telugu Site icon

Telugu Screen Mothers: తెలుగు తారల తెర తల్లులు!

Screen Mothers

Screen Mothers

(మే 8న మదర్స్ డే సందర్భంగా…)
తెలుగు చిత్రసీమలో తల్లి పాత్రల్లో అలరించిన వారెందరో ఉన్నారు. వారిలోనూ చిత్రవిచిత్రంగా సాగిన వైనమూ కనిపిస్తుంది. తమ కంటే వయసులో ఎంతో పెద్దవారయిన నటులకు అమ్మలుగా నటించి ఆకట్టుకున్నవారూ ఉన్నారు. ఒకప్పుడు కొందరు హీరోల సరసన నాయికలుగా నటించి, తరువాతి రోజుల్లో వారికే తల్లులుగా నటించి మెప్పించిన సందర్భాలూ ఉన్నాయి. ఇక తల్లిగా నటించిన వారితో తరువాత నాయకులుగా నటించిన వారూ లేకపోలేదు. ఇలా చిత్ర విచిత్రమైన సినిమా రంగంలో అమ్మ పాత్రల్లో అలరించిన వారెందరో!

తెలుగు చిత్రసీమలో అమ్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే నటీమణి ఎవరంటే శాంతకుమారి అనే చెప్పాలి. ఆమె భర్త దర్శకులు పి.పుల్లయ్యను ‘డాడీ’ అని, ఆమెను ‘మమ్మీ’ అని అప్పట్లో స్టార్స్ అభిమానంగా పిలిచేవారు. ఇక తెరపై నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్ కు అనేక చిత్రాలలో తల్లిగా నటించి అలరించారు శాంతకుమారి. ఓ నాటి మేటి నాయిక కన్నాంబ సైతం తన తరువాతి తరం హీరోలకు అమ్మగా అభినయించి మురిపించారు. ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకున్న నటి పుష్పలతనే! ఆమె అనేక చిత్రాలలో ఎందరో నటులకు తల్లిగా నటించి ఒప్పించారు. ఈ నాటికీ అందరికీ సినిమా అమ్మగా గుర్తున్న నటి ఎవరంటే నిర్మలమ్మనే! 1990లలోనూ ఆమె అనేక నాయకులకు తల్లిగానో, బామ్మగానో నటించి మెప్పించారు.

ఒకప్పుడు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ అదృష్ట నాయికగా జేజేలు అందుకున్నారు అంజలీదేవి. ఏయన్నార్ కు జానపద కథానాయకునిగా ఎనలేని పేరు సంపాదించి పెట్టిన “బాలరాజు, కీలుగుర్రం, స్వప్నసుందరి, సువర్ణసుందరి” చిత్రాల్లో అంజలీదేవి ఆయనకు హీరోయిన్ గా నటించి మెప్పించారు. అలాగే యన్టీఆర్ సొంత చిత్రాల్లో తొలి ఘనవిజయం సాధించిన చిత్రం ‘జయసింహ’లో ఆయన సరసన అంజలీదేవి నటించారు. ఆ పై యన్టీఆర్ ను శ్రీరామచంద్రునిగా నిలిపిన ‘లవకుశ’లోనూ, “పల్లెటూరి పిల్ల, చరణదాసి, పరువు-ప్రతిష్ఠ, భట్టి విక్రమార్క, పల్నాటియుద్ధం, బడిపంతులు” వంటి చిత్రాలలో రామారావుకు జోడీగా అంజలీదేవి తనదైన అభినయంతో అలరించారు. ఈ ఇద్దరు హీరోలకు అనేక చిత్రాలలో అంజలీదేవి తల్లిగా నటించి మెప్పించడం విశేషం! తరువాతి తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజుకు కూడా అంజలీదేవి అమ్మగా అభినయించి ఆకట్టుకున్నారు. యన్టీఆర్ తో అత్యధిక చిత్రాలలో నాయికగా నటించిన జమున ఆయనకు తల్లిగా ‘మంగమ్మశపథం, మనుషులంతా ఒక్కటే’ వంటి చిత్రాలలో నటించి అలరించారు. తరువాతి తరం హీరోలకు కూడా ఆమె అమ్మగా నటించారు. భానుమతి, సావిత్రి, యస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి వంటి మహానటీమణులు సైతం తరువాత తల్లి పాత్రల్లో ఎంతగానో మెప్పించారు.

తెలుగు చిత్రసీమ మూడోతరం స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు అందరికీ శారద తల్లిగా నటించి మెప్పించిన తీరును ఎవరూ మరచిపోలేరు. ఈ హీరోలకు కె.ఆర్.విజయ, శ్రీవిద్య, సుజాత వంటివారు కూడా అమ్మలుగా నటించి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు నాయికలుగా భలేగా అలరించిన అందాలభామలు, ఇప్పటి హీరోలకు తల్లులుగా మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో జయసుధ, రమ్యకృష్ణ, రేవతి, నదియా, పవిత్ర లోకేశ్, తులసి, రోహిణి వంటివారు ఉన్నారు. వీరి బాటలో మరికొందరు నటీమణులు పయనిస్తున్నారు. ఇలా ఎందరెందరో ఓ నాటి నాయికలు ఇప్పటి అమ్మలుగా అలరిస్తూ ఉండడం విశేషం!