హిందీ చిత్రసీమలో మేటి నటులుగా పేరొందిన దిలీప్ కుమార్, రాజ్ కుమార్ కలసి నటించిన ‘సౌదాగర్’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి 32 ఏళ్ళ ముందు ‘పైఘామ్’లో వీరద్దరూ కలసి నటించారు. అందులో దిలీప్ కుమార్ కు అన్నగా రాజ్ కుమార్ కనిపించారు. నిజానికి వయసులో రాజ్ కంటే దిలీప్ నాలుగేళ్ళు పెద్దవారు. ‘పైఘామ్’ తరువాత వారిద్దరూ కలసి నటించకపోవడానికి పలువురు పలు రకాలుగా చెబుతారు. ఇద్దరూ ‘మెథడ్ యాక్టింగ్’లో నిష్ణాతులే అని పేరు సంపాదించారు. సంభాషణలు వల్లించడంలోనూ ఇరువురూ ఎవరికివారు ప్రత్యేకమైన బాణీ పలికించిన వారే. అందువల్ల వారిద్దరితో సుభాష్ ఘయ్ ‘సౌదాగర్’ ఆరంభించినప్పుడే జనం ఈ మహానటుల సంభాషణలు వినాలని ఆసక్తి కనబరిచారు. అందుకు తగ్గట్టుగానే సచిన్ భౌమిక్, కమలేశ్ పాండేతో కలసి సుభాష్ ఘయ్ రచన చేశారు. 1991 ఆగస్టు 9న విడుదలైన ‘సౌదాగర్’ చిత్రం దిలీప్, రాజ్ ఇద్దరు అభిమానులను ఎంతగానో అలరించింది.
‘సౌదాగర్’లో దిలీప్, రాజ్ ఇద్దరూ మిత్రులుగా నటించారు. అలాగే వారిద్దరి శత్రుత్వంతోనూ కథ సాగుతుంది. ఇందులో రాజేశ్వర్ సింగ్ ధనవంతుల అబ్బాయి, వీర్ సింగ్ ఓ సామాన్య రైతు కుమారుడు. ఇద్దరూ మంచి మిత్రులు. రాజేశ్వర్ సింగ్ చెల్లెలు వీర్ ను ప్రేమిస్తూ ఉంటుంది. రాజేశ్వర్ కూడా తన చెల్లెలిని వీరూకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఈ విషయాన్ని వీర్ కు, చెల్లెలికి చెబుతాడు రాజేశ్వర్. ఇద్దరూ అంగీకరిస్తారు. అయితే ఓ పేద అమ్మాయి పెళ్ళి కట్నం తక్కువైన కారణంగా ఆగిపోవడంతో వీర్ ఆమెను వివాహం చేసుకుంటాడు. అది తెలిసి రాజేశ్వర్ చెల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో రాజేశ్వర్, వీర్ పై పగ పెంచుకుంటాడు. ఇద్దరూ తమ ప్రాంతాలకు సరిహద్దులు నిర్ణయించుకొని ఒకరి పొలిమేరల్లో మరొకరు అడుగు పెట్టకుండా జీవిస్తూ ఉంటారు. వారి మధ్య చునియా అనేవాడు మరింత నిప్పు రాజేసి, వారి స్నేహం కాస్తా బద్ధవైరంలా మారేలా చేస్తాడు. అయితే చిత్రంగా రాజేశ్వర్ మనవరాలు రాధ, వీర్ మనవడు వాసు కలుసుకుంటారు. ప్రేమలో పడతారు. విడిపోయిన తాతలను కలపడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. తమ మధ్య వైరం పెరగడానికి కారకుడైన చునియాను అంతమొందిస్తారు రాజ్, వీర్. చివరకు తీవ్రగాయాలయిన ఆ ఇద్దరు మిత్రులు ఒకరిచేతుల్లో ఒకరు ఒరిగిపోయి చనిపోతారు. రాధ, వాసు తమ తాతల పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఓ స్కూల్ నెలకొల్పడంతో కథ ముగుస్తుంది.
ఇందులో వీర్ సింగ్ గా దిలీప్ కుమార్, రాజేశ్వర్ సింగ్ గా రాజ్ కుమార్ నటించారు. రాధగా మనీషా కొయిరాలా, వాసుగా వివేక్ ముష్రాన్ కనిపించారు. చునియాగా అమ్రిష్ పురి తనదైన బాణీ పలికించారు. ఇతర పాత్రల్లో ముకేశ్ ఖన్నా, జాహిద్ అలీ, అనుపమ్ ఖేర్, గుల్షన్ గ్రోవర్, దలీప్ తాహిల్, ఆకాశ్ ఖురానా, పల్లవి జోషి, అర్చన్ పూరన్ సింగ్ ఇతర పాత్రధారులు. సుభాష్ ఘయ్ ‘హీరో’తో స్టార్ గా మారిన జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కాసేపు కనిపించారు. అంతకు ముందు ‘ఫేరి భేతౌలా’ అనే నేపాలీ చిత్రంలో నటించిన మనీషా కొయిరాలాకు ‘సౌదాగర్’ తొలి హిందీ చిత్రం.
లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి ఆనంద్ బక్షీ పాటలు రాశారు. ఇందులోని “ఇలు ఇలు…” పాట అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. “ఇమ్లీ కా బూటా…” అనే పాట రెండు వర్షన్స్ లోనూ అలరించింది. “సౌదాగర్ సౌదా కర్…” అనే పాట మురిపించింది. “రాధా నాచేగీ…”, “మొహబ్బత్ కీ కీ…”, “దీవానే తేరే నామ్ కే…”, “తేరీ యాద్ ఆతీ హై…” పాటలు కూడా జనాన్ని ఆకర్షించాయి. ఈ చిత్రం అనేక కేంద్రాలలో విజయకేతనం ఎగురవేసింది. రజతోత్సవ చిత్రంగా నిలచింది. 30 ఏళ్ళ క్రితం 5 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా అప్పట్లో దాదాపు 16 కోట్లు పోగేసింది.