ప్రతిభ ఉన్నవారికి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. అలాంటి ప్రతిభావంతుల కోసం, వారి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఒక వేదికగా ఆవిర్భవించింది పీజే ప్రొడక్షన్స్ సంస్థ. ప్రసాద్ ల్యాబ్‌లో పీజే ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని కంటెంట్లను ప్రదర్శించే కార్యక్రమం జరిగింది. వీటిలో మొదటిది మీరా పర్వం. స్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్, ఒక పూర్తి స్థాయి చిత్రంలా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అదే విధంగా, మరో రెండు షార్ట్ ఫిల్మ్‌లు కూడా ప్రదర్శించారు. రాకీ నాగ సాయి దర్శకత్వంలో ఫేడెడ్ మరియు గోపీ చంద్ ఎం దర్శకత్వంలో కలలో రాకుమారి అనే సందేశాత్మక షార్ట్ ఫిల్మ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఎంతో ప్రతిభావంతులైన కళాకారుల నైపుణ్యం స్పష్టంగా కనిపించింది.ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్‌ల దర్శకులు మాట్లాడుతూ, నిర్మాత ప్రవీణ్ జోలు గారి అండదండల వల్లే ఈ చిత్రాలను ఇంత అద్భుతంగా తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రవీణ్ జోలు మాట్లాడుతూ, ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్‌ను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం ఎంతటి కృషి చేయడానికైనా సిద్ధమని చెప్పారు. అలాగే, తమ సంస్థ నుంచి త్వరలో ఒక పూర్తి స్థాయి చిత్రం విడుదల కానుందని, ఆ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను రాబోయే రోజుల్లో వెల్లడిస్తామని ప్రకటించారు.
ఆ చిత్రానికి నిర్మాత ప్రవీణ్ జోలు స్వయంగా రచన మరియు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆ చిత్ర టీజర్‌ను ప్రదర్శించారు, అది అందరి దృష్టిని ఆకర్షించిన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.