EX Sarpanches Protest: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. అయితే, తమ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్‌లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అసెంబ్లీ వైపు కదులుతున్న వారిని గన్‌పార్క్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకుని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Also: Toxic : ‘టాక్సిక్’లో హ్యుమా ఖురేషీ.. ఆమె పాత్ర వెనుక అసలు కథ ఇదే!
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌లు ఎన్‌టీవీతో మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి రెండేళ్లు అవుతోంది.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఇప్పటి వరకు రాలేదని వాపోయారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. మా పెండింగ్ బిల్లులు చెల్లించి మా ప్రాణాలు కాపాడాలని ముఖ్యమంత్రికి వేడుకుంటున్నారు. బిల్లులు చెల్లించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అన్యాయం.. గ్రామాల అభివృద్ధి కోసం చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సర్పంచ్‌లుగా ఆర్థికంగా కుంగిపోయామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని.. అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న మమ్మల్ని ఆదుకోవాలని మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేశారు.