ఒక ఐడియా జీవితాన్ని మార్చేయడం ఎంత కరెక్టో… ఒక విజయం లైఫ్ ను మార్చేస్తుందన్నదీ అంతే నిజం! ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అదే జరుగుతోంది. లేటు గా వెబ్ సీరిస్ లోకి అడుగుపెట్టినా… లేటెస్ట్ గా గ్రాండ్ ఆఫర్స్ సమంతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజానికి సమంత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఆహా లోని సామ్ జామ్ కార్యక్రమంతో అడుగుపెట్టింది. అయితే వెబ్ సీరిస్ లో నటించడం మాత్రం ఫ్యామిలీ మ్యాన్ -2
తోనే జరిగింది. సమంతకు ఫలానా మీడియంలో నటించాలి… ఫలానా దానిలో నటించకూడదనే పట్టింపులేవీ లేవు. కాకపోతే… తన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది, ఇది వర్కౌట్ అవుతుందా కాదా? అనేదే చూస్తుంది. గతంలో కొన్ని ఆఫర్స్ వచ్చినా… వాటిల్లో ఫ్యామిలీ మ్యాన్-2
బెటర్ అని దీనిలో నటించడానికి అంగీకరించింది. ఇందులో పోషించిన రాజీ అనే తమిళ తీవ్రవాది పాత్ర కంట్రవర్షియల్ అవుతుందని తెలిసి కూడా సమంత వెరవలేదు. తన ప్రాణం పెట్టి ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చింది. అదే ఇప్పుడు ఆమె పాలిట వరంగా మారింది. ఓటీటీ జయింట్ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సమంతతో భారీ స్థాయిలో మూడు భాషల్లో… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ వెబ్ సీరిస్ తీస్తామని ముందుకు వచ్చింది. అయితే సమంత దీనికి ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనేది చూడాలి. స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ విన్న తర్వాతే ఆమె అంగీకారం తెలిపే ఆస్కారం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. వివాహానంతరం ఆచితూచి సమంత సినిమాలు చేస్తోంది. కొద్దికాలం తెలుగు సినిమాలను పక్కన పెట్టి ఒకటి రెండు తమిళ చిత్రాలను మాత్రమే అంగీకరించింది. అయితే… యుక్తవయసు నుండి రాజకుమారి పాత్రను పోషించాలనే కోరిక ఉన్న సమంత… గుణశేఖర్ – దిల్ రాజు శాకుంతలం
మూవీ ఆఫర్ ఇవ్వగానే… మరో ఆలోచన చేయకుండా అంగీకరించేసింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగే జరుగుతోంది. సో… నెట్ ఫ్లిక్స్ నిర్మించే ప్రాజెక్ట్ స్టోరీ నచ్చితే మాత్రం… పాన్ ఇండియా వెబ్ సీరిస్ సమంత ఖాతాలో పడినట్టే!!