ఆదివారం ఉదయం అనారోగ్యంతో హిందూజా హస్పిటల్ లోని నాన్ కొవిడ్ వార్డ్ లో చేరిన లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ కు ఆక్సిజన్ సపోర్ట్ తో వైద్యం చేస్తున్నామని డాక్టర్ నితిన్ గోఖలే తెలిపారు. గత కొంతకాలంగా డాక్టర్ నితిన్ నేతృత్వంలోని వైద్య బృందమే దిలీప్ కుమార్ కు వైద్య సేవలు అందిస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న దిలీప్ కుమార్ ను ఈ ఉదయం హాస్పిటల్ లో చేర్చించారు. ఆ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా మేనేజర్ తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని అభిమానులు తమ వంతుగా ప్రార్థనలు చేయాలని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అప్పటి నుండి పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిలీప్ సాబ్ కోలుకోవాలంటూ ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆక్సిజన్ సాట్యురేషన్ స్థాయి తక్కువగా ఉండటంతో ఆక్సిజన్ సపోర్ట్ కల్పించామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐ.సి.యూ.లో కూడా చేర్చాల్సిన అవసరం కలగలేదని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యం ఏమాత్రం మెరుగైనా రెండు మూడు రోజులలో డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. గత నెలలోనూ హాస్పిటల్ లో చేరిన దిలీప్ కుమార్ ఆ తర్వాత రెండు రోజులకు ఇంటికి వెళ్ళిపోయారు. 98 సంవత్సరాల దిలీప్ కుమార్ ను హాస్పిటల్ లో సాయంత్రం ఎన్.సి.పి. అధినేత శరద్ పవర్ పరామర్శించారు.