సినిమా రంగంలోకి ఎంటరై ఏదో ఒక శాఖలో స్థిరపడాలంటే… ముందు సినిమా పట్ల పిచ్చి ఉండాలి! అది ఉన్న వారే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతారు! అక్షయ్ కుమార్ జీవితంలోనూ అదే జరిగింది!
‘ఖిలాడీ’ స్టార్ గా పేరు తెచ్చుకున్న అక్కీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్. కానీ, ఆయన ఈ స్థితికి ఊరికే రాలేదు. దశాబ్దాల పాటూ పడిన శ్రమ ఉంది. అంతకంటే ముందు చిన్న నాటి సినిమా పిచ్చి ఉంది! దాని గురించి ‘బెల్ బాటమ్’ ప్రమోషన్స్ లో భాగంగా ఆయనే స్వయంగా చెప్పాడు…
అక్షయ్ కుమార్, వాణీ కపూర్, లారా దత్తా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో ‘బెల్ బాటమ్’ రూపొందింది. ఆగస్ట్ 19న థియేటర్స్ లో విడుదలవుతోంది. ఆ చిత్ర ప్రచారం కోసం అక్షయ్ ఢిల్లీకి వెళ్లాడు. అదే ఆయన జన్మ స్థలం కూడా! దేశ రాజధానిలోని చాంద్నీ చౌక్ ప్రాంతంలో అక్షయ్ పుట్టాడు. అంతే కాదు, చాంద్నీ చౌక్ బోలెడు థియేటర్స్ కి ఫేమస్ కూడా…
చుట్టూ థియేటర్ల మధ్య పుట్టిన అక్షయ్ చిన్నప్పుడే సినిమాపై ప్రేమ పెంచుకున్నాడట. ఎలాగైనా నచ్చిన సినిమా, వచ్చిన ప్రతీ సినిమా వరుస పెట్టి చూస్తూనే ఉండేవాడట. అలా ఓ సారి అమితాబ్ బచ్చన్ ‘అమర్, అక్బర్, ఆంథోని’ రిలీజైంది. ఇంకేముంది, అక్కీ టికెట్ వేటలో బయలుదేరాడు. కానీ, ఎక్కడా ఆయనకి మూవీ టికెట్ దొరకలేదు. కానీ, ‘అమర్ అక్బర్ ఆంథోని’ చూడాలన్న కోరిక ఆపుకోలేక బ్లాక్ లో కొన్నాడట! ఆ రోజు వర్షం పడుతున్నా లెక్క చేయక తడిసి వెళ్లి బ్లాక్ లో సినిమా చూసి… ఆనందంలో తడిసి ముద్దయ్యాడట!
ఒకప్పుడు బ్లాక్ టికెట్ కొని సినిమాలు చూసిన ఆ ఢిల్లీ కా బచ్చానే… ఇవాళ్ల ముంబైలోని బాలీవుడ్ ని ఏలుతుండటం… నిజంగా గొప్ప విషయమే కదా!