తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ ఘన విజయం సాధించింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా తమిళ భాషలో 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇదే సినిమాను తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా రీమేక్ చేశారు. ఇక్కడా ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో మంచి లాభాలను తెచ్చిపెట్టింది ఇదే నంటూ అతని తండ్రి సురేశ్ సైతం చిత్ర బృందాన్ని అభినందించారు.
Read Also: ధనుష్ తో సితార ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం!
ఈ సినిమాను తెలుగులో నిర్మించిన నటుడు హనీశ్ దీని హిందీ రీమేక్ హక్కుల్ని సైతం అప్పట్లో తానే తీసుకున్నారు. అక్షయ్ కుమార్ తో హిందీలో సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అయితే కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా హిందీ రీమేక్ ఆలోచనకు హనీశ్ ఫుల్ స్టాప్ పెట్టేశారట. ఈ మూవీ రైట్స్ ను అక్షయ్ కే ఇచ్చేశారట. సో… అక్షయ్ కుమార్ తన సొంత బ్యానర్ లోనే అతి త్వరలో ‘రాక్షసుడు’ హిందీ రీమేక్ ను మొదలు పెట్టబోతున్నాడని తెలిసింది. ఇక్కడ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పోషించిన పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తాడట. ఓ ప్రముఖ దర్శకుడి చేతిలో దీనిని పెట్టబోతున్నారని, ప్రతినాయకుడి పాత్రలో ఓ పాపులర్ యాక్టర్ నటించబోతున్నాడని అంటున్నారు.