Yugatulasi Party K Shivakumar Complains On TRS Over Munugode Bypoll: తనకు వచ్చిన రోడ్ రోలర్ గుర్తును మార్చేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని యుగతులసి పార్టీ అధ్యక్షుడు కే. శివకుమార్ ఆరోపణలు చేశారు. 5వ స్థానంలో ఉన్న రోడ్ రోల్ గుర్తును 14వ స్థానానికి, 4వ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ గుర్తును 2వ స్థానానికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తును 14వ స్థానానికి మార్చడం వల్లే.. తమకు ఓట్లు తక్కువ శాతం పడ్డాయన్నారు. రోడ్ రోలర్‌కు వచ్చిన ఓట్లు కూడా తమ ఓట్లేనని మంత్రి కేటీఆర్ ప్రకటించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అక్రమాలకు పాల్పడి.. ప్రజలను ప్రలోభ పెట్టాయని శివకుమార్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కుట్రలు చేసి.. ఆ నెపం బీజేపీ మీదకి నెట్టాలని చూస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి.. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అక్రమాలు చేసిందన్నారు. ఆ అక్రమాలను వీడియో ఆధారంగా బయటపెట్టిన శివకుమార్.. వాటిని సెంట్రల్ ఎలెక్షన్ కమిషన్‌కు అందుజేసి, ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి.. ఈ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని శివకుమార్ డిమాండ్ చేశారు.
కాగా.. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీన జరగ్గా, ఆ ఫలితాలను నవంబర్ 6వ తేదీన వెల్లడించారు. మొత్తం 15 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ జరగ్గా.. చివరగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగాయి.