మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని మృతుడి ఇంటి ముందు ఆమె నిరాహార దీక్షకు దిగారు. మృతుడు రవికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇచ్చేంత వరకు కదిలేది లేదని షర్మిల ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల నిరాహార దీక్షను భగ్నం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: కిలాడీ లేడి.. కళ్లలో చుక్కలు వేసి చుక్కలు చూపించింది
అంతకుముందు షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. బంగారు తెలంగాణలో రైతులకు బతుకు లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల గుండెలు ఆగిపోయేలా కేసీఆర్ రాజకీయాలు సాగిస్తున్నారని ఆరోపించారు. సీఎం నిరంకుశ పాలన కారణంగా ధాన్యం కుప్పల మీదే రైతులు చనిపోయే దౌర్భాగ్య స్థితి నెలకొంది. రైతు రవి సీఎం కేసీఆర్‌కు లెటర్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది చాలా బాధాకరం అంటూ షర్మిల వాపోయారు. తెలంగాణలో రైతులను వరి వేయవద్దనే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని.. పండించిన పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని షర్మిల స్పష్టం చేశారు. ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పిన కేసీఆర్ మాట తప్పుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.