ఈ మధ్య తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనల్లో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, ఓ యువకుడి ఆత్మహత్యకు కారణం అంటూ ఎస్ఐ గుర్రం ఉదయ్ కిరణ్ పై కేసు నమోదు చేశారు ములుగు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ.. ఓ యువకుడి ప్రాణం తీసింది. 12 రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్‌వోసీ కోసం పెండ్యాల ప్రశాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి యజమానిని అడిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షోరూమ్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Rajnath Singh: సరిహద్దులు దాటేందుకు వెనుకాడం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
దీంతో షోరూమ్ వద్ద ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక, తీవ్ర మనస్తాపానికి గురైన ప్రశాంత్ ఏప్రిల్ 12వ తేదీన రాత్రి బండారుపల్లిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రశాంత్ ఈ రోజు మరణించాడు.. ఇక, ప్రశాంత్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో, విచారణ చేసిన పోలీసులు.. షోరూం నిర్వహకుడిని ఏ1గా, ములుగు గణపురం ఎస్ఐని ఏ2గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.