Site icon NTV Telugu

T Congress: యశ్వంత్ సిన్హా పర్యటనతో మరోసారి బయటపడిన విభేదాలు

Tcongress

Tcongress

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. యశ్వంత్ పర్యటనను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా యశ్వంత్‌కు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు జరిగిన ర్యాలీలో సిన్హాతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ అధిష్టానం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. యశ్వంత్ నామినేష‌న్‌కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కేసీఆర్‌ను క‌లిసిన త‌ర్వాత తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ య‌శ్వంత్ సిన్హాను క‌లిసే ప్ర‌శ్నే లేద‌ని రాహుల్‌కు తేల్చి చెప్పిన‌ట్టు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

BJP National Executive Meeting: 2014 కన్నా ముందే తెలంగాణ వచ్చేదా?

ఇదిలా వుండ‌గా య‌శ్వంత్ సిన్హాను టీపీసీసీ త‌ర‌పున ఆహ్వానించి వుంటే బాగుండేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. కానీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండాలని టీపీసీసీ నిర్ణయించుకుంది. హైదరాబాద్‌లో తాము యశ్వంత్‌ను కలవబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఆదేశాలను ఆ పార్టీ నేతలు లెక్క చేయడం లేదు. ఇప్పటికే సీనియర్ నేత వి.హనుమంతరావు.. ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు.

మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. యశ్వంత్‌ను కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కోరారు. సిన్హాకు కాంగ్రెస్ మద్దతిస్తున్నప్పుడు ఆయనను సీఎల్పీ పిలిస్తే బాగుండేదని అన్నారు. సిన్హాను కలవొద్దని ప్రకటించిన రేవంత్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను తప్పుపడుతూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ కాంగ్రెస్ లో యశ్వంత్ పర్యటన ఏ పరిస్థితికి దారి తీస్తుందో చూడాలి. అవకాశం వచ్చినప్పుడల్లా తమలోని విభేదాలను బయటపెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వెనుకాడడం లేదని యశ్వంత్ పర్యటన నేపథ్యంలో నిరూపితమైంది.

Exit mobile version