ఓ స్థల వివాదంలో ఏడు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన ఖమ్మం జిల్లా లో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ లో కుల బహిష్కరణ వివాదం చర్చనీయాంశంగా మారింది. చిన్న కోరుకొండి గ్రామపంచాయతీలో గంతోటి.చిన్నప్ప(మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) తన స్థలానికి సరిహద్దుగా ఉన్న స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే ఆ స్థలంలో బావి తవ్వించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడుబడిన బావులను పూడ్చాలని ఆదేశించడంతో గ్రామపంచాయతీ సర్పంచ్ సహకారంతో బావిని పూడ్చి వేశారు.
అయితే బావి పూడ్చడంతో అక్కడ వివాదం మొదలైంది. బావి స్థలం మాల కాలనీకి చెందినదని ఆ స్థలాన్ని కాలనీకి కేటాయించాలని కుల పెద్దలు కోరినప్పటికీ స్థల యజమాని చిన్నప్ప అంగీకరించలేదు..దీంతో ఆగ్రహానికి గురైన కుల పెద్దలు చిన్నప్ప కుటుంబాన్ని ఇటీవల చిన్నప్ప కుటుంబం లో జరిగిన శుభ కార్యక్రమం కు హాజరైన మరో ఆరు కుటుంబాలను కులం నుండి కుల పెద్దలు బహిష్కరించారు. కులం నుండి బహిష్కరించిన వారితో ఎవరైనా మాట్లాడినా,శుభ కార్య క్రమాలకు పిలిచిన వారిని కూడా కుల బహిష్కరణ చేస్తామని జరిమానా విధిస్తామని హుకుం జారీ చేయడంతో బాధిత కుటుంబాలు గత కొద్ది రోజుల నుండి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
కుల బహిష్కరణ అయినవారు కులానికి 10వేలు జరిమానా కట్టి కులంలో కలవాలని రూల్స్ విధించారు. మూడు కుటుంబాలు మాత్రం 10వేలు చెల్లించి కులం లో కలిశారు. మరో 4 కుటుంబాలు 10వేలు చెల్లించలేక అధికారులను ఆశ్రయించారు. కుల బహిష్కరణతో తమ కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని చివరిసారిగా అధికారులను ఆశ్రయించామని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు స్పందించిన ఎస్ఐ వెంకటేష్,తహశీల్దార్ బాబ్జి ప్రసాద్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు కుల పెద్దలను వివరణ కోరగా కుల బహిష్కరణ ఏమీ లేదని గ్రామానికి చెందిన బావి స్థలాన్ని కాలనీ అవసరాల నిమిత్తం ఇమ్మనామని వారే తమ పై గొడవలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని కుల పెద్దలు తెలుపుతున్నారు.
Komatireddy Venkatreddy:ఈసారి అసెంబ్లీకీ.. బర్త్ డే సాక్షిగా మనసులోమాట