తెలంగాణలో ఆంత్రాక్స్ చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. గొర్రెల వరుస మరణాలను ఆంత్రాక్స్ కారణమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంబయ్య అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రెల మందలో కొన్నిరోజులగా రోజుకొక గొర్రె చనిపోతుండటంపై పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు చనిపోయిన గొర్రెల శాంపిళ్లను సేకరించి జిల్లా కేంద్రంలోని పశువుల ప్రధాన ఆస్పత్రి ల్యాబ్‌కు పంపారు. పరీక్షల రిపోర్టులో గొర్రెలకు ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
Read Also: రైతు ఉపాయం: పక్షులు పరార్
దీంతో గొర్రెల నుంచి ఆంత్రాక్స్ మనుషులకు వ్యాప్తి చెందితే ప్రాణహాని కలిగే అవకాశాలు ఉండటంతో అధికారులు తగుజాగ్రత్తలు చేపట్టారు. గొర్రెల మందను గ్రామానికి దూరంగా ఉంచాలని ఆయా గొర్రెల మంద యజమానులకు సూచించారు. గ్రామంలోని 1200 గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాపించకుండా టీకాలు వేస్తున్నారు. ఆంత్రాక్స్ వ్యాధి 95 శాతం శరీరం తాకితే వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వికారం, వాంతులు, విరేచనాలు వంటివి ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలుగా వారు సూచించారు. కరోనా వైరస్, ఫ్లూ జ్వరాల మాదిరిగా ఆంత్రాక్స్ మనిషి నుంచి మనిషికి వేగంగా వ్యాప్తి చెందుతుందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.