Warangal News: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ పరిధితో పాటు నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, ఇతర అంశాలపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఓ వైపు వైద్యం, మరోవైపు వైద్య విద్యను విస్తరిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే ఈ ప్రాంతం మెడికల్ హబ్ గా మారుతుందన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు.
వరంగల్ హెల్త్ సిటీ ప్రత్యేకతలు:
వరంగల్ హెల్త్ సిటీ భవనాన్ని చారిత్రక కట్టడంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందించబోతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మొత్తం 216 ఎకరాల్లో వరంగల్ హెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోంది. అవయవ మార్పిడి ఆపరేషన్లు కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ రూ.1100 కోట్లతో ఆర్ అండ్ బీ పర్యవేక్షణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో ఆసుపత్రి నిర్మాణ పనులను చేపట్టింది. 16.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల్లో అతిపెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. 14.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 రకాల వైద్య, పారామెడికల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తలసేమియా బాధితుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Indravelli incident: మాయని ఇంద్రవెల్లి గాయాలు.. మారణకాండకు 42ఏళ్లు