Vivek Venkataswamy Sensational Comments On KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మునుగోడు ఉపఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఆయన నిద్ర లేచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రికి ఏదో ఆలోచిస్తారని, ఉదయం మరోలా ప్రవర్తిస్తారని అన్నారు. ఓట్ల కోసం కొత్త కొత్త పన్నాగాలు పన్నుతారని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో తెలంగాణ ఉద్యమకారులకు విలువ లేదన్న ఆయన.. డబ్బుతో కేసీఆర్‌ని కలిసి వాళ్లకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని, వరదల్లో నష్టపోయిన బాధితులకు ఒక్కొ్క్కరికి రూ.10,000 ఇస్తానని ఇచ్చిన హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదన్నారు.
రాజ్యసభ సీట్లను అమ్ముకోవడంతో పాటు మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత వాటర్ ట్యాంక్‌లకు కలర్ వేసి.. తానే అపర భగీరథుడ్ని అని కేసీఆర్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు ముగిశాక.. అక్కడి ప్రజలను పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి అమలుకాకపోవడం దారుణమని, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. ప్రజలపై భారం వేసి. కేంద్రం పై ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. చర్లగూడెం, డిండి భూ నిర్వాసితులకు పరిహారం అందకపోవడంతో.. స్థానికులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత డబ్బుతో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని.. ఈ విషయం ప్రజలకు తెలుసని వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి KTR అభద్రతతో మాట్లాడుతున్నారని, ధరణి పోర్టల్ తీసుకొచ్చి రూ.18 లక్షల కోట్ల స్కామ్ చేశారని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అటు.. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన అభిషేక్ రావు, ఎమ్మెల్సీ కవితకి బినామీ అంటూ ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్‌కు మునుగోడు ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యారని.. ఓట్లకోసం వచ్చే కేసీఆర్‌ను ఇంటికి సాగనంపడం ఖాయమని జోస్యం చెప్పారు.