కరోనా మహమ్మారి ఓ వైపు కల్లోలం సృష్టిస్తే.. మరోవైపు.. అదే అదునుగా అందినకాడికి దండుకుంటూ.. సామాన్య, మధ్య తరగతి ప్రజల ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి 66 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు అందగా.. అన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఇక, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలను ప్రారంభించింది సర్కార్… బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఇక కోవిడ్ పేషెంట్లను చేర్చుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్న కోవిడ్ పేషెంట్ల విషయంలో ప్రొటొకాల్ ప్రకారం చికిత్స అందించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు తేలితే ఆస్పత్రి లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి విరించిలో కోవిడ్ చికిత్స కోసం చేరడం.. పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే కాగా.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వంశీకృష్ణ బంధువులు ఆందోళనకు దిగడం.. ఆస్పత్రిపై దాడి చేయడం కూడా జరిగింది. అయితే, 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నోటీసు పంపినా.. సమాధానం రాకపోవడంతో.. కోవిడ్ లైసెన్స్ రద్దు చేశారు.. కాగా, గతంలో కూడా విరించి ఆస్పత్రి పై చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు.. ఆయినా ఆ ఆస్పత్రి యాజమాన్యం తీరు మారడం లేదు. ఇక, విరించిపై చర్యలు తీసుకుని.. మిగతా సమాధానం ఇవ్వని ఆస్పత్రులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం.