Vijayashanti Fires On CM KCR Over Telangana Heavy Rains: తెలంగాణ సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారీ వర్షాల కారణంగా జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు జనాల కష్టాలు ఏమాత్రం పట్టడం లేదని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు జారీ చేస్తోన్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహించారు.
‘‘హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరద నీరే ఉంది. రోడ్లపై వరద నీరు వచ్చి చేరడంతో, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. సీఎం గద్దెనెక్కినప్పటి నుంచి హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానని కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. ఆ డల్లాస్ అంటే ఇదేనా?’’ అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుంటే.. మీరు ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజల కష్టాల్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ వాఖ ప్రకటించినా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోందన్నారు.
మొన్నటి వరకు భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయితే.. టీఆర్ఎస్ ప్ఱభుత్వం మాత్రం కేవలం భద్రాచలంలోనే నష్టం జరిగినట్టు చూపిస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని విజయశాంతి చెప్పారు. హైదరాబాద్‌లోనూ అలాంటి ప్రయత్నమే చేస్తోందన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తోంటే.. కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విజయశాంతి పేర్కొన్నారు.