Venkaiah Naidu Speech At Koti Deepotsavam Event: భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటీ దీపోత్సవం కార్యక్రమానికి ఆదివారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీపం జ్ఞానానికి చిహ్నం, వెలుగు అభివృద్ధికి మార్గం.. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి సమాజాన్ని విజ్ఞానం దిశగా జాగృతం చేయటమే ఇలాంటి కార్యక్రమాల్లోని అంతరార్థమని చెప్పారు. శ్రీమతి రమాదేవి, శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు ఎంతోకాలంగా సమాజం బాగు కోరి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దీపేన సాధ్యతే సర్వం అన్నది పెద్దల మాట అని.. వెలుగులోనే మనిషి మనుగడ సాధ్యమౌతుందని.. అందుకే ఏ కార్యక్రమాన్నైనా దీప ప్రజ్వలనతో ప్రారంభించటం భారతీయుల సంప్రదాయమని అన్నారు. శివకేశవులకు కార్తిక మాసం ఎంతో ప్రీతికరమని పెద్దలు చెప్తుంటారని.. ఈ మాసంలో చేసే స్నానం, జపం, దీపం, దానం, ఉపవాసం వంటివి ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయని అంటుంటారని పేర్కొన్నారు.
ప్రాతఃకాలాన నిద్ర లేవటం, స్నానం ఆచరించటం మన రోజును వేగవంతం చేస్తాయన్నారు. జీవితంలో తన ఎదుగుదలకు ప్రధాన కారణాల్లో ఉదయాన్నే నిద్రలేవటం ఒకటని తాను బలంగా నమ్ముతానన్నారు. స్నానం అంటే కేవలం నీళ్ళు పోసుకోవటం కాదని.. మన శరీరంతో పాటు, మనసులో ఉన్న మలినాలను కడిగేసి సమాజం మనదిగా చూడటమన్నది అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇది కేవలం కార్తిక మాసానికే పరిమితం కాకూడదన్నారు. వసుదైవ కుటుంబ స్ఫూర్తిని మన పెద్దలు సంప్రదాయంగా, సంస్కృతిగా అందించారని.. అందులో కార్తిక మాసంలో చేసే దానాలు కూడా ఒకటని తెలిపారు. కార్తిక మాసం దానానికి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. మనకున్న దానిని నలుగురితో పంచుకోవటం అనే అంతరార్థం ఇందులో దాగి ఉందన్నారు. ఈ కాలంలో వనభోజనాలకు పోవటం మనందరికీ తెలిసిందేనన్న వెంకయ్యనాయుడు.. ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో కలిసి జీవించటం అనే అంతరార్థం ఇందులోనే దాగి ఉందన్నారు. ఈ స్ఫూర్తిని ప్రజలందరిలోకి తీసుకుపోయేందుకు నడుం బిగించిన భక్తి టీవీ వారిని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. భక్తి అంటే సేవ అని.. అది భగవంతునికి చేసే సేవ మాత్రమే కాదు, మాధవుని స్వరూపమైన మానవాళికి చేసే సేవ అని వెల్లడించారు.
‘పరమేశ్వరుని పాదాలను చేరిన మానసిక ప్రవృత్తే భక్తి’ అని శ్రీ శంకరాచార్యుల వారు ప్రబోధించారని, ‘అవాంతరాలకు లొంగని నిరంతర ప్రేమ ప్రవాహమే భక్తి’ అని శ్రీ రామానుజాచార్యుల వారు ఉద్భోధించారని, ‘సర్వాధికమైన స్నేహ భావమే భక్తి’ అని శ్రీ మధ్వాచార్యుల వారు నిర్వచించారని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమస్త ప్రాణికోటి పట్ల, ప్రకృతి పట్ల స్నేహభావం, కరుణా భావాన్ని పెపొందించుకోవడమే నిజమైన భక్తి అని సూచించారు. కోటి దీపోత్సవం లాంటి కార్యక్రమాల ద్వారా ఇలాంటి స్ఫూర్తి ప్రజల్లో పరిఢవిల్లాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. స్వామి వివేకానందుల వారు బోధించినట్లు.. దేవునిపై నమ్మకం లేని వాడు నాస్తికుడు కాదు – తన మీద తనకు నమ్మకం లేనివాడే నిజమైన నాస్తికుడని చెప్పారు. ఈ దృక్పథాన్ని యువతలో పెంపొందించగలిగినప్పుడే ఆస్తికత్వానికి ఆసలైన ప్రయోజనం ఉంటుందని, ఈ దిశగా ప్రసార మాధ్యమాలు యువతను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు.