నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం దేవక్కపేట్ గోనుగొప్పుల గ్రామాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని బండి సంజయ్ అమిత్ షా ను అడగాలన్నారు. పాదయాత్రలో కర్ణాటక ప్రజలు తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు కావాలని బండికి వినతి పత్రం ఇచ్చారు. నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మీటింగ్ ముందు ఇవన్నీ అమిత్ షాతో చర్చించు అని బండి సంజయ్‌కు హితవు పలికారు.
కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత బంధు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తామని అమిత్ షాతో ప్రకటన చేయించు.. అని బండి సంజయ్‌కు చురకలంటించారు. టీఆర్ఎస్ పథకాలు కొన్ని కాపీ కొట్టారు..మిగతావి కూడా దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటన చేయించు అని ఆయన వ్యాఖ్యానించారు.