రాబోయే రోజుల్లో భద్రాచలంకి ముంపు సమస్య పెరుగుతుందని జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ అన్నారు. 1986 లో వరదల కంటే ఈసారి తక్కువే వచ్చాయి కానీ ముంపు ఎక్కువగా ఉంది అంటే కారణం పోలవరం ప్రాజెక్టు వల్లనే అన్నారు. రానున్న రోజుల్లో పోలవరంతో భద్రాచలంకు ముంపు ఎక్కువగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తు తగ్గించాలి. సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ వరద అంచనా వేయడంలో విఫలం అయ్యాయి.
Puvvada Ajay: పోలవరం ఎత్తు తగ్గించి.. ఆ మండలాలు మళ్ళీ కలపాలి
వారు అంచనా వేసి ఉంటే ఇంత నష్టం రాకపోయేది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ తరుణంలో సిడబ్ల్యుసి, గోదావరి నది యాజమాన్య బోర్డ్ అప్డేట్ కావాల్సి ఉంది. వరద అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాల్సి ఉండే కానీ చేయలేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వరదల వలన నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా ఈ వరదలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలంకు ఇంత ముంపు పెరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఇబ్బందులు వున్నాయని, పోలవరం ఎత్తు తగ్గించాలని ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
