V Hanumantha Rao Reacts On BJP MLA Raja Singh Suspension: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి కేవలం నోటీసులు ఇవ్వడమే కాదు.. తిరిగి పార్టీలోకి తీసుకోకూడదని, అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. ఇలాంటి అంశాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని, చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ‘కేసీఆర్, మీ ఎమ్మెల్యేలను ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పండి’ అని ఆయన హెచ్చరించారు. బీజేపీ వాళ్లకు చెప్పేదేమీ లేదని, బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే అనర్హత వేటు పడేలా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అవి తీవ్ర దుమారం రేపడం, దీనిపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయి ఆయన్ను సస్పెండ్ చేసిన వ్యవహారంపై వీ హనుమంతరావు పై విధంగా స్పందించారు.
ఇక ఇదే సమయంలో.. తనను ఢిల్లీకి పిలవలేదని, తాను పోలేదని, అయినా పిలవని పేరంటానికి తానెందుకు వెళ్తానని వీ హనుమంతరావు మండిపడ్డారు. సోనియా గాందీకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారని.. ఆ వ్యవహారం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై.. అలాగే మునుగోడు ఉప ఎన్నికలపై ఇంఛార్జి, పీసీసీలు కలిసి మాట్లాడాలన్నారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే మునుగోడులో ప్రచారానికి వెళ్తామని స్పష్టం చేశారు.