V Hanumantha Rao Comments On Rajagopal Reddy: నల్లగొండ జిల్లాలోని గట్టుపల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వాల్సి ఉండగా.. చివరి క్షణంలో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చామన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో తనకు ఇప్పటివరకూ అర్థం కాలేదన్నారు.
నువ్వు బీజేపీతో చేరితే నీకు కష్టమవ్వడంతో పాటు మీ అన్నయ్యకి కూడా నష్టం జరుగుతుందని తాను రాజగోపాల్ రెడ్డికి వీ హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి.. పార్టీకి నష్టం చేయొద్దని కూడా తాను విజ్ఞప్తి చేశానని తెలిపారు. అయినా రాజగోపాల్ వినిపించుకోకుండా బీజేపీలో చేరారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మహానీయుడని.. ఆయన ఆనాడు ఏమాత్రం కాంప్రమైజ్ అయినా ముఖ్యమంత్రి అయ్యుండేవారని అన్నారు. వారి సామాజిక వర్గానికి న్యాయం చేస్తే, కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అవుతుందన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న పాల్వాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని గెలిపించాలని నియోజకవర్గ ప్రజల్ని ఆయన కోరారు.
కాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెగ కసరత్తు చేస్తున్నాయి. మునుగోడు ప్రజల్ని ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి. బీజేపీ విస్తృతస్థాయిలో ప్రయత్నలు చేస్తోంది. ఎలాగైనా మునుగోడులో చక్రం తిప్పాలని, అక్కడ గెలిస్తే టీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ తగిలినట్టు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం తనదైన వ్యూహాలతో దూసుకెళ్తోంది. తామూ ఏం తక్కువ కాదన్నట్టు.. కాంగ్రెస్ కూడా ధీటుగా ముందుకు సాగుతోంది. దీంతో.. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.