Site icon NTV Telugu

Uttam Kumar Reddy : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని విపక్ష నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్‌ సర్కార్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మళ్లీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో తెలంగాణలో విపక్ష పాత్ర పోషించే కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. అయితే ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు కొత్త జోష్‌తో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా రేవంత్‌ రెడ్డి తనదైన స్టైల్‌లో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ నియామకమైన నాటి నుంచి బీజేపీ కూడా తెలంగాణ పుంజుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్పొరేటర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటారు.

అంతేకాకుండా విపక్ష పార్టీ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని వెనక్కి నెట్టిన బీజేపీ ఆ స్థానాన్ని కొట్టేసింది. ఆ ఎన్నికల తరువాత టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్‌లో సీనియర్స్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి లు అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆలోచించిన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు రేవంత్‌ రెడ్డికి కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి ల మధ్య సఖ్యత కుదిర్చారు. అయితే జగ్గారెడ్డితో మాత్రం రేవంత్‌రెడ్డికి సెట్‌ అవడం లేదని పార్టీలోని నేతలే అంటున్నారు. అయితే తాజాగా ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి… నియోజక వర్గాలకు వెళ్ళండని ఆయన పిలుపునిచ్చారు. దీనితో పాటు నేను ఎక్కడ పోటీ చేయాలి అనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు.

https://ntvtelugu.com/hyderabad-lighting-from-space/
Exit mobile version